Friday, 1 December 2017

శ్రీ హనుమ శతకము


ఓమ్ శ్రీ గణేశాయ నమః
ఓమ్ శ్రీ వాగ్దేవ్యై నమః
----------------------------

1.
కం. శ్రీ రామ బంటువైనను
నోరారగ నిన్ను గొల్వ నుఱిచెదవు గదా
యే రుగ్మతలైన నీవే
యా రాముని కడకు చేర్చి యనుగుగ హనుమా...!
(
నుఱుచు ... నిర్మూలించు)
2.
కం. శ్రీ పావని యని దలచుచు
నీపై నే శతక మొకటి నెమ్మిగ దలతున్
నీ పాదములనె వేడెద
నాపై కృప జూపుమయ్య నయముగ హనుమా...!
3.
కం. పొగడిన బలశాలివె నువు
పొగడిన మాకెపుడు తగిన పోడిమియె కదా
పొగిడెద నా వ్రాతలలో
తిగుటయె కలిగించు నాకు దీటుగ హనుమా...!
(
తిగుట ... ఆసక్తి, శ్రద్ధ)


4. కం. బలమున సాటియె లేదుగ
ఖలునకు నువు తోపగలవు కాలుని భంగిన్
కొలిచిన నినె బంటు వలెను
తలచిన పనులన్ని సాగు తథ్యము హనుమా...!
5. కం. మాటల నెరిగిన వాడివి
మాటకు కాదందువుగ సమయమే యెపుడున్
మాటనె మన్నించినచో
మాటలె మరి రాక దొరకు మన్నన హనుమా...!
6. కం. నిను దలచిన బుద్ధి, బలము
లనువుగ మాకొసగెదవుగ యశమును, ధైర్యమ్
బనుగుగనే యారోగ్యము
వినయముతో నున్న యెడల విపులమె హనుమా...!
7. కం. ఇంతటి మహిమాన్వితుడవు
ఎంతయు తరచినను తీరదెపుడీ చరితన్
సుంతయు తృప్తియె మాకును
వింతయు ననలేము చూడ విపులమె హనుమా...!
8. కం. నీ జన్మ రహస్యము మా
కాజన్మాంతమ్ము కాదు నవగతమదియే
సాజమె దైవము పుట్టుక
భాజనమే కాదు తరచ బంటుకు హనుమా...!
(భాజనము ... యుక్తము)
9. కం. మురియగ యనిల సుతుడవని
తరచగ నా యనలుడైన తాతయె నీకున్
మరవగ లేముగ నీ కత
మరిపించుము మా వెతలనె మదమున హనుమా...!
(అనిల ... వాయువు, అనల ... అగ్ని, తాత ... తండ్రి. కాగా ముదము, మదము... రెండూ సమానార్థకాలే
భావము.. సమీర కుమార విజయము ప్రకారము... పరమ శివుని శుక్లమే అగ్ని చేరి అట నుంచి వాయువుకు ఆయన నుంచి అంజనాదేవికి చేరిందంటారు. ఆ ప్రకారముగా ఆంజనేయునికి కేసరితోపాటు శివుడు, అగ్ని, వాయువు కూడా తండ్రులే అన్నది గమనార్హము.).
10. కం. హరునికి సుతుడవె యైనను
హరి భక్తుని వీవె యనగ నరుసమె గద వా
నరులందున శ్రేష్ఠుడవే
నరులనె నువు గాచవలయు నయముగ హనుమా...

11. కం. నీవేక పాద రుద్రుడవు
నీవే శ్రీరామ చంద్ర నిజుడవు నిజమే
నీవే శివ రుద్ర తేజము
నీవే పావనుడవనగ నిక్కమె హనుమా...
(నిజుడు ... స్నేహితుడు)
12. కం. వనమున విహరించుచు హిమ
తనయే ప్లవములను జూచి తన్మయమందన్
తన సతి మనము నెరింగిన
మినుసిగ వేల్పామె కోర్కె మెచ్చగ హనుమా...!
(ప్లవము ... వానరము, మినుసిగ వేల్పు ... శివుడు)
(ముందరి పద్యంతో అన్వయము)
13. కం. శివ పార్వతులా వనమున
ప్లవములుగనె మార యపుడు పసరయె జారెన్
శివ సతి సాధ్యము కాదన
భవుడది భువిపైన భద్ర పరిచెను హనుమా...!
14. కం. ధారుణి సైతము వేడగ
భూరియె మరి యగ్ని జేర్చి, భుజి కోరికపై
నేరుగ వాయువు కీయగ
మారుత మంజనకు చేర్చె మదమున హనుమా...!
(భూరి ... శివుడు, భుజి ... అగ్ని.)
15. కం. ఆ విధమున సాంబశివకు
నీవో సుతుడనగ వలెను నెమ్మిగ, కానీ
పావనిగ గణుతి కెక్కితి
వీవే యిదె విధి యనంగ వేడ్కయె హనుమా...!
16. కం. ధాత సృజించిన కాంతయె
భాతిగ వర్తించు నామె బాళిగ చూడన్
భాతియె లేదు నహల్యకు
ఖ్యాతియె నార్జించె యామె ఖలమున హనుమా...
(భాతి ... పద్ధతి/పోలిక, బాళి ... అభిమానము, ఖలము ... విశ్వము.)
17. కం. ఆమెనె యెందరు కోరిన
పోమని గౌతమునికిచ్చె పోడిమి తోడన్
ఆమని పోలిన బాలిక
ఆమెకు జనియించెనన్న నరుసమె హనుమా...
(పోడిమి ... గౌరవము)
18. కం. కేసరి యన నీ తండ్రియె
ఆసురునినె మట్టుబెట్ట నమరులె ముదమున్
ఆ సౌశీల్యునె గదిసిక
చేసుకొనమనిరి వివహమె చెలిమిగ హనుమా...
(ఆసురుడు ... రాక్షసుడు, వివహము... వివాహానికి ఇదీ పర్యాయపదమే.
కేసరి చేతిలో మరణించిన రాక్షసుడే శంబసాధనుడు.)
19. కం.నీ తల్లిని తన తాతగు
గౌతముడే కపివరేణ్యు కొసగగ నపుడా
తాతయె కేసరి కీయగ
నాతడు తన సతిని గలిసె యనుగుగ హనుమా...
(గౌతముని ప్రధాన వ్యాపకం తపస్సే గనుక అంజనను కుంజరుడనే వానర శ్రేష్ఠునికి అప్పజెప్పాడు. ఆయన కేసరికి యిచ్చి వివాహం చేశాడు.
తాత అనగా తండ్రి అనే అర్థమూ ఉన్నది. కాగా అనుగు అనగా ప్రేమ)
20. కం. పతితో గూడియు నంజన
సుతులే లేరనుచు మిగుల శోకించగ మా
రుతమే మనకిక దిక్కని
సతికే కేసరియె యొసగె సమయము హనుమా...
(ఎంత కాలమైనా సంతానం లభించకపోవడంతో వాపోతున్న భార్యను ఓదారుస్తూ ఇక వాయుదేవుని గురించి తపసు చేయడమే మేలని చెప్పాడు కేసరి..
సమయము అనగా సమాధానమే)

21. కం. ఎరుకగ మారిన దేవత
ఎరిగించుచు భావి, యిచ్చె దరి యుంచుమికన్
సరి వేరు ముక్కయే యిది
మరి దప్పిక తెలియనీదు మహిమది హనుమా...
(ఎరుకగా మారిన ధర్మ దేవత అంజన వద్దకు వచ్చి తపసు సమయాన ఈ వేరు ముక్కను దగ్గరుంచుకుటే ఆకలి దప్పులు తెలియవని చెప్పి మాయమయింది.
22. కం. తపమాచరించ వెడలిన
కపి తనయకు తోడు నిలచె కాలము మిగులన్
తపమునకు మెచ్ట యనిలుడె
సపలమయే పండు నొసగ శస్తమె హనుమా...!
(ఆమె తపమునకు మెచ్చిన వాయుదేవుడు అది ఫలించునట్లుగా నొక పండు నిచ్చాడు..అయితే ఆమెకా ఫలము ఎక్కడిదో ఎవరిచ్చారో తెలిదు. తపసు మద్యలో కనులు తెరిస్తే కనపడడంతో స్వీకిరంచింది అంతే..
శస్తము ... శుభము)
23. కం. ఫలమది వాయు ప్రసాదమె
కలనైనను తలవలేక కలవరమందెన్
కలిగితివి నీవె సుతునిగ
ఇల వెలుగులు నిండెనుగద యిమ్ముగ హనుమా...!
24. కం. అంజన గర్భము నందున
వ్యంజనమై శివరసమ్మె వదలక యుండెన్
భంజనము సేసి ఖలులను
రంజిల్లగ సేయ భువిని రక్తిగ హనుమా...!
25. కం. పుట్టిన మానవ కులమునె
పట్టిన కపి వరుని పాణి పాడియె యయ్యెన్
మెట్టిన యంజనకే యట
గిట్టెను నీ వలన గొప్ప కీర్తియె హనుమా...!
26. కం. ఆకాశమె నిర్మలమై
కేకియు పురి విప్పి యాడె కేరింతలతో
ఆ కనకపక్షుడాడగ
నా కలకంఠమ్మె కూసె యలరుచు హనుమా...!
(కనకపక్షుడు ... గరుడుడు, కలకంఠము ... రాయంచ)
27. కం. పుడమియె పులకించగ మరి
తడయక పుష్పించె వనము తరుణమె యనుచున్
తడబాటు లేక పొలములు
ముదమున యందించె సస్యములనే హనుమా...!
28. కం. నిడుపైన వాలమొక్కటి
వడి చూడగ శంకరుండె వరిమిచ్చె యనన్
కుడి చాయ పగడమే కద
పొడలే తెలుపునుగ నీదు పోడిమి హనుమా...!
(వడి...బలము, కుడి ... శరీరము, పొడ ... చూపు, పోడిమి ... నడవడి)
29. కం. వటువై భాసిల్లగ నువు
కటి బంగరు మౌంజి తోడ కర్ణాభరణమ్
చిటి పుట్టము చూడగ మరి
ఘటికులలో మేటి యంద్రు కద నిను హనుమా...!
(చిటి ... మనోహరము, ఘటికుడు ... బలశాలి)
30. కం. ఆకలి దహించ నిన్నే
ఆ కపి పండుగనె దోచి యాత్రము హెచ్చన్
నీ కపి తత్త్వము వీడక
నా కపిలుని పట్టబోతి వబ్రముగ హనుమా...!
(కపి ... సూర్యుడు, వానరము, అబ్రము ... అబ్బురము)
31. కం. భీతిల్లిన తన వారిని
ఆ తరణియె చేరదీసి యనులాపముతో
ఈతడు నీశ్వర సుతుడే
కాతర్యమె వీడుమనెను కరుణను హనుమా...
(తరణి ... సూర్యుడు, అనులాపము ... ఓదార్పు, కాతర్యము ... భయము.)
32. కం. వేడిమి తగ్గిన సూర్యుని
పోడిమితో మ్రింగ బోవ బోగియె కద నీ
పోడిమికి బెదరిపోవుచు
వేడగ నా యింద్రుడపుడు వెడలెను హనుమా...
(పోడిమి ... శౌర్యము, పోకడ. భోగి ... రాహువు)
33. కం. "ఈ దినమె పర్వమనుకొని
యా దినకరు పట్టబోవ నా బాలకుడే
నా దారి కడ్డు నిలిచెను
ఏ దారియొ చూపుమ"నుచు నేకరె హనుమా...
(ఏకరు ... భయపడు)
34. కం. సురపతి ధైర్యము సెప్పగ
తరణిని పట్టుటకు నగువు తరలగ యపుడున్
సరి యతని కోరలందున
ఇరికిన రవి పండు నీకు నింగమె హనుమా...!
(అగువు ... రాహువు, ఇంగము ... విస్మయము)
35. కం. కలవరపడి రాహువపుడు
సురపతినే శరణుగోర చురుకుగ కదలన్
వెలిగౌరు మరొక ఫలమని
నలిగా కదిలితివటు నువె నయమా హనుమా...!
(వెలిగేరు ... ఐరావతము, నలి ... ఉత్సాహము, నయము ... న్యాయము)
36. కం. కినిసిన యింద్రుడె యప్పుడు
తన శరమును విసరివేయ తాలువు నదియే
ఘనమగు గాయము సేసెను
అనువుగ నీ నామమునకు నది కత హనుమా...!
సరము ... వజ్రాయుధము, తాలువు ... దౌడ)
37. కం. దెబ్బ తిని కూలగా నీ
యబ్బయె యాగ్రహముతోడ యాపగ చలనమ్
అబ్బా యన యీ జగతియె
కబ్బము పతి గదలి వచ్చె కరుణను హనుమా...!
(కబ్బము ... సరస్వతి)

38. కం. ఆ తాత నచ్చజెప్పగ
నీ తాతయు చల్లబడుచు నిలదీయగనే
నీ తాపము తొలగించుచు
ఆ తామర చూలి పలికె నంజియె హనుమా...!
(తాత ... ధాత/తండిరి, తాపము ... బాధ, తామరచూలి ... బ్రహ్మ, అంజి ... శుభము)
39. కం. "ఇతడే కద రుద్రతేజుడు
ఇతనికి మీరుచిత రీతి నీయుడు వరముల్
ఇతడే లోక హితైష"ని
పితువే సురలకును దెలిపె ప్రీతిగ హనుమా...!
(పితువు ... బ్రహ్మ)
40. కం. ఆరుణి మరణమె రాదని
వరమీయగ లభ్యమాయె వాముని శరముల్
ఫలితము నీయవు ననియెడి
పలుకే లభియించె నీకుపర్వమె హనుమా...!
(ఆరుణి ... యముడు, వాముడు ... శివుడు,)
41. కం. తన శరము లేవి యైనను
నిను గాయము సేయవనుచు నెమ్మియె నీపై
కనబరచె విశ్వకర్మయు
తన శ స్త్రము తాకదనెను దల్మియు హనుమా...!
(దల్మి ... ఇంద్రుడు)
42. కం. కోరిన రూపము నందును,
ధీరత్వము నందు లేదు దీటుయె సూడన్
వీరుడు, శూరుడు, నువె సీ
తా రాముల బంటనియెను ధాతయె హనుమా...!
43. కం. వరముల నెన్నో పొందిన
సరకే లేదాయె నీకు సహవాసులతో
తిరుగగ కపి చేష్టలతో
మరువక నీ తల్లి తెలిపె మార్గము హనుమా...!
44. కం. "ఉచితము సుగ్రీవునికే
సచివునిగా నుండవలయు సావరమైనన్
ఉచితమె కాదుగ వాలిక
పచితమె తలబెట్టక"నెను బాళిగ హనుమా...!
(సావరము ...తప్పు, అపచితము ... అపకారము, బాళి ... ప్రేమ)
45. కం. "నా సేవ రాముని కనుచు
ఆ సనతుడె తొలుత నాకు నానతి యిచ్చెన్
ఈ సుగ్రీవుని కొలువును
నీ సెలవన సేతు న"నవ నెమ్మిగ హనుమా...!
46. కం. తదుపరి కిష్కింధకు జని
వదలక నీ మేనమామ బంటరికమునే
మెదలగ మది యొక యోచన
కదలితివే విద్య కొరకు ఖంబుకె హనుమా...!
(బంటరికము ... కొలువు, ఖంబు ... ఆకాశము)
47. కం. అట నిను గాంచిన రవి నీ
పటిమకె యచ్చెరువు పొంది పరి పరి విధముల్
పటువే నీవని పొగడుచు
వటువుగ యంగీకరించె పర్వమె హనుమా...!
(పటువు ... సమర్థుడు, వటువు ... శిష్యుడు.)
48. కం. వేదములు, దర్శనములును,
వేదాంగములును, కళలును, వివిధ పురాణాల్
భేదము లెన్నక యార్కుడె
మోదముతో నేర్పె నీకు మొత్తము హనుమా...!
49. కం. నేర్చితి వన్నియు నీవే
నేర్చినదంతయును తిరిగి నిశ్చయముగనే
యోర్చుచు నేర్వదలంచిన
కూర్చుదు వీ మనమునందు కూర్మిగ హనుమా...!
50. కం. సర్వమెరింగియు నీవును
గర్వమె దరి చేరనీక ఖానుని కొలువున్
పర్వముగ తలచినావన
పర్వమె మాకెపుడు సూడ పావన హనుమా...!
(ఖానుడు ... అధిపతి/రాజు, పర్వము ... వేడుగ/సంబరము)
51. కం. సీతను గానక రాముడె
కోతను బడె హృదయమనుచు కుందుచు నుండన్
ధాతయె నిన్నటు చేర్చగ
భాతియె లభియించె మాకు బాళియె హనుమా...!
(భాతి ... కాంతి, బాళి ... సంతోషము)
52. కం. శివ కేశవులకు భేదము
లవ లేశము లేదనుటకు లక్షణముగ రా
ఘవునికి నాత్మజు వోలె నె
లవుకొంటివి నీవెపుడును లగ్గది హనుమా...!
(నెలవుకొను ... స్థిరపడు, లగ్గు ... శ్రేష్టము)
53. కం. నీ రాజుకు మేలు కలుగ
నా రాముని తోడ నెమ్మి నయముగ గూర్చన్
పారావారము లేకనె
పోరున నా వాలి గూర్చె పోడిమె హనుమా...!
54. కం. దాశరథి మేలు మరవక
ఆశగ నిను పంప లంక యన్వేషణకై
చూశావుగ జానకి లం
కేశుని పరివార మపుడె కృంగెను హనుమా...!
55. కం. జననికి ముద్రిక నిస్తివి
అనువుగ యా తన్వి నగనె యందుకు నీవా
దనుజునికి బోధ సేయగ
యనలమునే లంక జేర్చ నరుసమె హనుమా...!
56. కం. లంకను గాల్చితి వనగా
శంకయు మాకెపుడు లేదు శంభుడవీవే
లంకేశుని పతనమునకె
సంకేతమె తథ్యముగను శస్తము హనుమా...!
(శస్తము ... శుభము)
57. కం. ధరణిజ శిరోమణి నొసగి
జరిగిన సంఘటనలీవు చక్కగ దెలుపన్
హరియే యాప్తుడ వంచును
పరి పరి విధముల పొగడగ పర్వమె హనుమా...!
58. కం. నీ సలహాపై రాముడె
ఆ సరమాజానిని తను యాదరముగనే
తీసుకుని సమరమందున
ఆసురునే జంపెనంటే యరుసమె హనుమా...!
(సరమాజాని ... విభీషణుడు, ఆసురుడు ... రాక్షసుడు)
59. కం. నీ సామర్థ్యం బెట్టిదొ
యా సంజీవమును దెచ్చి యరుసం బొదవన్
మా సౌమిత్రికి జీవము
పోసితివన కలుగు మాకు పొదలిక హనుమా...!
(పొదలిక ... సంతోషము)
60. కం. సమరమునకు ముందుగ నువు
సమయోచిత సమయమనగ సరిగనె యా శై
లములనె రాముని పేరిట
సమీచమే దాటుటకును సరదితి హనుమా...!
(సమయము ... నిర్ణయము, సమీచము ... సముద్రము, సరదు ... పఱచు)
61. కం. సంజీవని తెచ్చు పనిలో
భంజన మొనరించితివిగ వంచక మునినే
అంజన సుత యేమందును
వ్యంజనమది నీ ప్రతిభకువందినె హనుమా...!
(వంచక ముని ... కాలనేమి అనే రాక్షసుడు మునిలా మారి హనుమను అడ్డుకోబోయాడు.
వ్యంజనము ... గుర్తు, వంది ... పొగిడేవాడు)
62. కం. రావణ సోదరుడే మై
రావణుడే మదము హెచ్చ రయమున మీ పా
రావారమునే పులుముచు
భూ వరునే దాచ, నీవె ప్రోచితి వనుమా...!
(పులుము ... మోసగించు, ప్రోచు ... రక్షించు,
అనుమా..అనుమడు అనేది కూడా హనుమ కు పర్యాయ పదమే)
63. కం. కాలము సేయగ కపి దొర
కాలుడె నీ ధాటి చూసి "కపి వరుడీ మా
ప్రోలున లేడ"ని సెప్పగ
కాలును వనజజుని వైపు గదిపితి వనుమా...!
(ప్రోలు ... ప్రాంతము.
కపి దొర/వరుడు ... గంధమాదనుడు. అతను మరణించగా రాములవారు వాపోవడం చూసి హనుమంతుడు యమునిపైకి దండెత్తాడు. బెదరిన కాలుడు అతనిక్కడ లేడని చెప్పడంతో బ్రహ్మనే కలిసి తమ దొరకు ప్రాణం పోయించుకు వచ్చాడు)
64. కం. దోసమె లేదని యెరిగియు
దోసమనే భావనొకటి దూరము సేయన్
కౌసల్యా తనయుడు సుత
చేసెను నీకొక్క వినతి చెలిమిని హనుమా...!
65. కం. నెలకొల్ప లింగ మచ్చట
వలెయని వెడలగ రయమున వదలక నిన్నున్
బలె శోధించగ భవుడే
తలచగ నువు గిరిని చేస్తి తపమునె హనుమా...!
66. కం. మెచ్చిన శివుడే రహితో
వచ్చెను నీ చెంతకపుడు వలయు నియతితో
ఇచ్చెను లింగమె, కానీ...
తెచ్చిన యింకొక పరీక్ష తెలిసెను హనుమా...!
67. కం. నీ రాక వేళ మించగ
నా రాముడు యాగలేక నాలోచనతో
పారావారమె సై యన
తీరమునను సైకతమ్మెతీర్చెను హనుమా...!
68. కం. అది కన్న నీ హృదయమే
అదవదతో నిండిపోవ యార్తిగ "రామా!
ఇది యిట్లయినను నాకిక
తుది శ్వాసయె మేల"నంగ దోసమె హనుమా...!

69. కం. అంతట రాఘవుడే నీ
చెంతకు జని పలికె నిట్లు చెలిమిగ నీతో
"ఇంతకు నీ ద్వైత తలపె
సుంతయు పోలేదు గాదె" చోద్యమె హనుమా...!
70. కం. "ఈ లింగము చెంతను మరి
నీ లింగము చేర్చవచ్చు నిక్కము జనులు
న్నా లింగము గొలిచిననే
నా లింగము గొలువగలరు నయముగ హనుమా...!"
71. కం. సైకత లింగమె కానీ
పైకెత్తుట వలను కాదు పాతాళమునన్
ఆక్రమణము గావించెను
నీకైనచొ చూడు మనెను నికరమె హనుమా...!
72. కం. కదిలించ చూడ నీవే
సడలించగ నీదు బిగువె సంకల్పముగా
కదలదె లింగము సుంతయు
విడెనుగ నీ గరిమ యెంత వింతయొ హనుమా...!!
73. కం. భంగ పడిన నిను జూచుచు
అంగము విడినట్లు రాముడార్తిని జెందన్
కృంగిన నిదానముగ సౌ
మంగల్యము పొంది తీవు మదమున హనుమా...!"
(సౌమంగల్యము ... స్వస్థత, మదము ... ముదము)
74. కం. నారద తుంబురు లిద్దరు
శారదకే పుత్రులనగ సంభావనతో
మీరగ గర్వమె నువ్వు ని
వారించితి వనగ మాకు పాఠమె హనుమా...!
(సంభావన ... గౌరవము)
75. కం. భారతమున యా జం
భారి తనయునికి వలసిన పాఠము గరపన్
వారథిపై శర సేతువు
కూలగ సేసితివి గాదె కూర్మిని హనుమా...!!
(జంభారి ... ఇంద్రుడు)
76. కం. తదుపరి బాళిగ యర్జుని
కదళిని నీవధివసించ కౌరవ సేనన్
కదనముననె నిలువక యమ
సదనమునకె చేరెననగ సాజమె హనుమా...
(బాళి ... ప్రేమ, కదళి ... ఝండా)
77. కం. నీ సోదరుడైన భీముడె
యా సౌగంధికము కొఱకు నారాటముగా
నీ సదనమునకె రాగా
ఆ సాహసము కద నీకు నచ్చెరు వనుమా...
(అనుమడు అనేదీ హనుమకు పర్యాయమే)
78. కం. నీ టెక్కము కదలక తన
మాటయె ఏమగునొ యంచు మధనము పొందన్
గీటును వీడగ నీవే
వాటముగా దరికి తీయ భవికమె హనుమా...
(గీటు ... గర్వము, భవికము ... శుభము.)
79. కం. నిను బ్రహ్మచారి యనుచును
మనువే నీవెరగవన్న మాయయె కాదా
మనువాడిన మనసునకే
తనువెప్పుడు శుద్ధమైన ధన్యులె హనుమా...
80. కం. ఇనుని సుత సువర్చలయే
మనువాడగ నిన్నె తగిన మగనిగ కమలా
సనుడే భావిని తేల్చగ
మనమునె యర్పించె తాను మదముగ హనుమా...
81. కం. శ్రీ రాముని రక్షించగ
మైరావణునడచితివిగ మాయల తో నీ
గారవమె పెంచె నది మా
పోరామియె తొలగజేయి పోణిమి ననుమా....
(పోరామి ... సంకటము, పోణిమి ... ఆదరము, అనుమ ... హనుమ కు పర్యాయ పదమే)
82. కం. కోటను కూల్చగ నీవే
వాటముగా పొంది పంచ వదనమ్ములతో
ఘాటైన సమయ మిస్తివి
దీటుగ దీపముల నార్పి తీరది హనుమా...!
(తీరు ... పద్ధతి)
(మైరావణుడి కోట చుట్టూ ఐదు దీపాలున్నాయి. వాటిని హనుమ ఐదు ముఖాలతో ఏక కాలంలో ఆర్పినందునేఆ యసురుడి బలం సన్నగిల్లి ఈయన చేతిలో మరణించాడు.)
83. కం. పిదప దశ హస్తములతో
విధముగ శరములను బట్టి విఖురుల గుంపున్
వధియించి రక్కసి సుతుని
అధిపతిగా చేసితివిగ యరుసమె హనుమా...!
(మైరావణుని చంపిన తర్వాత తనకు సహాయపడిన దుర్దండి అనే రక్కసి కుమారుడిని ఆ పాతాళ లంకకు అధిపతిని చేశాడీ హనుమ)
84. కం. పంచ ముఖములనగా యవి
పంచేంద్రియములకు మరియు పరిశీలింపన్
పంచ మహా భూతములకు
మంచిగ గురుతనగ వచ్చు మదమున హనుమా...!
85. కం. నరసింహుడవన నీవే
వరాహునిగ దలచవచ్చు వందన మిడగా
గరుడవు, కేసరి నందన
అరయ హయగ్రీవుడవన నరుసమె హనుమా...!
(పంచ ముఖాలే ఈ ఐదు అనగా నృసింహ, వరాహ, గరుడ, హయగ్రీవ, ఆంజనేయ ముఖాలు ...)
86. కం. తత్త్వము నెరిగింతువు కద
సాత్త్విక జీవనమున కది సాధన మగుగా
సత్త్వమె పెంచుతు మాలో
సాత్త్వికులను జేసి ప్రోచు సహనమె హనుమా...!
(ప్రోచు అనగా పెంచు)
(స్వామి నామావళిలో...ఓమ్ తత్త్వ జ్ఞాన ప్రదాతాయ నమః)
87. కం. సహనమె మాకును నేర్పుము
సహనముతో నింద్రియముల సమయుదు వీవే
అహమే యణగును శీఘ్రము
దహించిన చపలము నెపుడు తథ్యము హనుమా...!
(స్వామి నామావళిలో...ఓమ్ దాన్తాయ నమః)
(సమయు ... అణచు, దాన్త యనగా ఇంద్రియ నిగ్రహమునకు లేదా తపమునందు ఎదురగు ప్రయాసమును సహించుట)
88. కం. తూర్పున నంజని సుతుడవె
ఆర్పకనే మా యిడుముల నాదరముగనే
ఆర్పుచు నభీష్టములనే
ఓర్పుగ తీర్చెదవు గావ యొప్పుగ హనుమా...
(ఆర్పు ... ఏడ్పు/ఆర్పివేయు)
89. కం. పడమట గరుడవు నీవై
తడయక నీ భక్తులకును తగు నాయువునే
ఒడగూడు నట్లు సేతువు
కడవరకును తోడు నిలచి కరుణను హనుమా...
90. కం. ఉత్తర దిక్కున కిటివై
చిత్తము నిను నిలుపుకున్న సిరి తోడుగనే
విత్తమె అందించెదవన
విత్తమునిగ జేయుటదియె విప్పుగ హనుమా...
(కిటి ... వరాహము, విత్తముడు ... విజ్ఞాని, విప్పు ... శ్రేష్ఠము)
91. కం. దక్షిణమున నరసింహుడ
లక్షణముగ జయము గూర్చు లక్ష్మియె జతగా
శిక్షణ నిచ్చెద వీవే
తక్షణ ఫలితమ్ము గోర తగదుగ హనుమా...
92. కం. అరయగ నూర్ధ్వము నందున
వెలసి హయగ్రీవునిగను వేడిన యెపుడున్
మరువక జ్ఞానము నిత్తువు
మరపించుచు లౌకికమునె మదమున హనుమా...
93. కం. సారసమని కీర్తించిన
వారధి లంఘనము నందు వరుస యనంగన్
జాలము నే పక్షిని మరి
లేరుగ నీ సాటి యెవరు లెక్కకు హనుమా...
(సారసము ... పక్షి, వరుస ... సమానము.)
(స్వామి నామావళిలో...ఓమ్ మహా పతసే నమః
పతసః అను దానికి సంస్కృత నిఘంటు ప్రకారం పక్షి, చంద్రుడు అనే అర్థాలున్నాయి. అయితే, స్వామి లంఘనాన్ని దృష్టిలో ఉంచుకుంటే విహంగం అనే అర్థమే దగ్గరగా ఉందనిపిస్తున్నది కదా)
94. కం. జనకజ పాపిట వెలుగుకు
చనవుగ నీవడుగ కతన సమయమె దొరకన్
తనువెల్ల బులుముకొంటివి
ఘనముగ సింధూరమపుడు ఘనమే హనుమా...
(కతన ... కారణము, సమయము ... సమాధానము.)
95. కం. స్కందుడు నీ సోదరుడని
విందుము మా వీనులకది విందునె గూర్చున్
సింధురవదనుడు, శాస్తయు
పొందుగ నీ తోడ మమ్ము బ్రోచుగ హనుమా...
(సింధురవదనుడు ... గణపతి.
సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప, గణపతి, ఆంజనేయుడు... ఈ నలుగురూ శివ శుక్లజులే. గణపతి కూడా శివ శుక్లజుడేనని శివపురాణములో ఉన్నది.)
96. కం.శివ కేశవులొకటే యను
అవగాహన కలుగజేయు నాశయము వలన్
భవుని తనూజుడవుగనే
భువి రాఘవు నీడవైతి పొదలికె హనుమా...!
(పొదలికె ... సంతోషము)
97. కం. నిష్ఠగ నిన్నే దలచిన
ఇష్టముగా దరికి తీసి యిడుములు బోవన్
దుష్టత్వము తొలగజేయుచు
శిష్ఠులుగా తీర్చగలవు శీఘ్రమె హనుమా...!
98. కం. భూత పిశాచములను నీ
వే తొలగించ గలవన్న వివర మదేలా
భూతేశుడె నీ తండ్రిగ
భూత దయను చూపి మమ్ము బ్రోచుము హనుమా...!
99. కం. రోగములవి యేవైనను
పోగలవుగ నిన్ను గొల్వ పోరామిగనే
రాగ ద్వేషములే దరి
రాగలవా నిన్ను దలచ లయమగు హనుమా...!
(పోరామి ... భక్తి)
100. కం. సంకట సమయములందే
శంకయు లేకుండ దలచ సౌరత్వముతో
లెంకలుగ జూచి మా హృది
వంకరలే తీయు మయ్య బాళిగ హనుమా...!
(సౌరత్వము ... భక్తి, లెంక .. బంటు, బాళి ... అనురాగము)
101. కం. జీవన సాఫల్యమునే
నీవే యొసగెదవు మాకు నెమ్మిగ యెపుడున్
కావవె వరదా యనగా
వేవేగమె చేర్చ రావ విడిదిని హనుమా...!
(విడిది ... పరమ ధామమే)
102. కం. నాలుగు యుగముల యందున
చాలరు నీతోడ నెవరు జవసత్త్వములన్
చాలనమె పట్టి మాలో
మేలగు మేధస్సు నుంచ మిన్నగ హనుమా...!
(చాలనము ... జల్లెడ)
103. కం. కరి వీరుడ నిన్నే గద
కరి రక్షక బంటు వనుచు కై మోడ్పులతో
పరి పరి వేడెదమయ్యా
దరి చేర్చగ రావ నీవె దయతో హనుమా...!
(కరి ... ఏనుగు, కోతి)
104. కం. రాముని కంటెను రాముని
నామమె బహుదొడ్డదనుచు నయముగ నీవే
మా మదిని నాటినావుగ
సేమమె కలిగించుటకును శ్రేయమె హనుమా...!
105. కం. తొలుత నువు కానరాకను
తులసీదాసెంత గానొ దురసిల్లగనే
వెలసితివే కరుణించగ
మరి చాలీసాయె వచ్చె మదమున హనుమా...!
106. కం. చాలీసా పఠియించిన
చాలు కదా మాకు నీవె శస్తము సేయన్
మేలు కలుగ జేయునదే
వలెయని నీ బంట్ల జేర్చ వంచమె హనుమా...!
107. కం. సుందరమే నీ చరితము
పొందెదముగ చదివి మేము పోణిమి యెంతో
అందిన మాకా భాగ్యమె
అందుగదా నిక్కమైన యరుసము హనుమా...!
(పోణిమి ... సంతోషము)
-- -- -- -- -- -- -- -- -- -- -- --
108. కం. తప్పులు తెలియక దొర్లిన
తప్పనుకొనరాదు నీవె తండ్రివి మాకున్
ఒప్పుదల తోడ హృదినే
తిప్పలు తప్పించి సేయి తిన్నన హనుమా...!
 == == == == == శుభమ్ == == == == ==