Friday, 1 December 2017

మోహ ముద్గరమ్ (భజ గోవిన్దమ్)

మోహ ముద్గరమ్ (భజగోవిన్దమ్)
---------- (ఆట వెలదులలో...) ---------
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
ఓమ్ నమో శ్రీ భగవతే వాసుదేవాయ
ఓమ్ శ్రీ గణేశాయ నమః
ఓమ్ శ్రీ వాగ్దేవ్యై నమః
ఓమ్ శ్రీ ఆది శంకరాచార్యవే నమః
----------------------------------
నేపథ్యమ్...
----------
ప‌రివ్రాజ‌కులుగా దేశ‌ప‌ర్య‌ట‌న చేస్తూ ధ‌ర్మ‌స్థాప‌న‌లో నిమ‌గ్న‌మ‌యిన ఆదిశంక‌రులు ఒక‌నాడు కాశీన‌గ‌రంలో శిష్య‌గ‌ణంతో తిరుగాడుతున్న స‌మ‌యంలో, వ‌య‌సుమ‌ళ్ళినా ధ‌న‌సంపాద‌న‌పై మ‌క్కువ త‌గ్గ‌ని పండితుడొక‌డు, త‌న వ్యాక‌ర‌ణ ప్ర‌తిభ‌కు ముగ్ధులై శిష్యులుగా చేరుతారేమోన‌నే ఆశ మోహ పీడితుడై, నాలుగు వీధుల కూడ‌లిలో నిల‌చి, డుకృఞ‌క‌ర‌ణే సూత్రాల‌ను వ‌ల్లిస్తుండ‌డం చూసి, మ‌నఃక్లేశానికి గురియై, ఆగ్ర‌హంతో ప‌ద‌మూడు శ్లోకాల‌ను ఆశువుగా వ‌దిలారు. జీవ‌న గ‌మ‌నంలో అవ‌సాన‌ద‌శ‌కు చేరుకున్న త‌రుణంలోకూడా, మోహ‌ము, లోభ‌ము మ‌నిషిని ఎలా దిగ‌జార్చుతాయి, గోవింద‌నామ స్మ‌ర‌ణ‌చేస్తూ ఉత్త‌మ‌గ‌తుల కొర‌కు ఆలోచించ‌వ‌ల‌సిన స‌మ‌యంలో మ‌నిషి ధ‌న‌సంపాద‌న మార్గాల‌కోసంఎందుకు వెంప‌ర్లాడతాడు అనేది వారి మ‌నసున ఖేద ప‌రిచింది. అటువంటి వ్య‌క్తుల జీవ‌న స‌ర‌ళిని స‌రిచేసేందుకై మార్గ‌ద‌ర్శిలా ఈ భ‌జ‌గోవింద స్తోత్రం అందించారు. ఇది ఒక చెర్నాకోల‌, ప్ర‌తి శ్లోకం ఒక శ‌రం! ఇది చూసిన వారి శిష్యులు ప‌దునాల్గుమంది ప్ర‌తిస్పంద‌న‌గా, త‌లా ఒక శ్లోకం చెప్పి, ఈ స్తోత్ర‌రాజానికి పూర్ణ‌త్వాన్ని ప్ర‌సాదించారు. కొస‌మెరుపుగా శంక‌రులు మ‌రో నాలుగు శ్లోకాల‌ను చెప్పి దీన్ని ప‌రిపూర్ణం చేశారు. మొత్తం 31 శ్లోకాలు క‌లిగిన ఈ మంజ‌రి మాన‌వ‌జాతికి మ‌హోప‌కారంగా అందిన జీవ‌న మార్గ‌ద‌ర్శి.
                   ---------------------ఇక ముందుకు సాగుదాం........................................
.
మూలం :
 భజగోవిన్దం భజగోవిన్దం గోవిన్దంభజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే॥1॥

పద్యం.
1. కాలుడేగినేని కాపాడ రెవ్వరూ
తెలియ వలయు నిదియు తెలివి కలిగి
వ్యాకరణముతోటి వదలునా పాపాలు
భజన సేయ వలయు భక్తి కలిగి ॥

పద్యం
2. మోక్ష మార్గమునకు మూఢుడ! ఇకనైన
'వాని' కొలువు సేయి వదలకుండ
తావు గణన లేదు, గోవింద నామమే
స్మరణ సేయ లేద సాధ్య మిలను ॥

(భావం : కాలం సమీపిస్తే (అంగవిస్తే)కాపాడేవారెవరూ లేరు. వ్యాకరణాలూ, కావ్యాలూ ఔపోశన పట్టినంత మాత్రాన పాప ప్రక్షాళన కాదు. కనుక ఓ మూఢుడా ! గోవింద నామ స్మరణం ద్వారానే మోక్షం పొందగలరని గ్రహించు.. దీనికి అనగా ఈ నామ స్మరణకు కాలం, స్థలం వంటి వేవీ పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. గోవింద నామ స్మరణను మించినదేమీ లేదు !!

మూలం :
 మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్
యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్ || 2 ||
పద్యం
 3 : మూటపైన దృష్టి మూఢుడ వదలుమూ
మనసు రాగ రహిత మైన మేలు
స్వార్జితంబె యెపుడు సత్యమైనది చూడు
మదియు నింపు కొనుము ముదము నీవు ||
భావం : ఓ మూర్ఖుడా! ధనసంపాదనపై ఆశవదులుము. వైరాగ్య భావనను మనసులో నింపుకొనుము. అదే మేలు చేస్తుంది. స్వశక్తిచే సంపాదించిన ధనమే నిజమైనది. ఆ భావనతోనే ఆనందించుము.
మూలం : నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్
ఏతన్మాంసవసాదివికారం మనసి విచింతయ వారం వారమ్ || 3 ||
పద్యం 
4. గంటు వక్షములను గనుచు పదే పదే
ముదిత పైనె తగని మోహమేల
మరువ కెపుడు నివియు మాంసపు ముద్దలే
మనన మెపుడు సేయి మరల మరల ||
భావం : యువతుల స్తనములను, నాభి(గంటు)ని పదే పదే చూస్తూ మోహావేశం పొందకుము. అవన్నీ మాంసపుముద్దలే అని మరల మరల మనసులో తలచుము.

మూలం: 
నలినీదలగత జలమతితరలం తద్వజ్జీవితమతిశయచపలమ్
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్ || 4 ||
పద్యం 
5. తామరాకు పైన తామరంబు పగిది
చంచలమ్ము బతుకు ఎంచి చూడ
వ్యాధి వెంట వ్యాధి వదలదు లోకాన
వ్యాకులతనె పెంచ వ్యాజమెపుడు ||
భావం : తామరాకుపై నీటి(తామరపు)బొట్టువలే జీవితము మిక్కిలి చంచలమైనది.లోకమంతా వ్యాధులతో దురభిమానముతో నిండి శోకించుచున్నదని తెలుసుకొనుము.
(పెంచు + అవ్యాజము + ఎపుడు)

మూలం :
యావద్విత్తోపార్జన సక్తస్తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే || 5 ||
పద్యం 
6. ఆర్జనున్న దనుకె యైనవారి మమత
అదియె మృగ్యమైన నడుగరెవరు
వయసు పెరిగి పిదప వడలిన దేహమే
అడుగరెవరు నజయె యవసధమున ||
భావం : ధనము సంపాదించునంతవరకే తన వారు ప్రేమ చూపుదురు. శరీరం కృశించినప్పుడు ఇంటిలో ఎవడూ నీ విషయమడుగడు.
(అజ ... భోగట్టా, సమాచారం, సంగతి, అవసధము .. ఇల్లు)

మూలం :
 యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ఛతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మింకాయే || 6 ||
పద్యం 
7. ప్రాణమున్న వరకె బ్రశ్నింత్రు కుశలము
ఇంటిలోన నంతె యింతియైన
పవనమంత పోయి పాడె చేరే కట్టె
భయము గొల్పు చుండు భార్యకైన ||
భావం : శరీరంలో ప్రాణములున్నంతవరకే కుశలమునడుగుదురు. ప్రాణములు పోయిన పిదప ఆ శవమును చూచి భార్య కూడా భయపడును.

మూలం :
 బాలస్తావత్క్రీడాసక్తః తరుణస్తావత్తరుణీసక్తః
వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోఽపి న సక్తః || 7 ||
పద్యం
 8. అరయ బాలలకును నాటలపై మోజు
యువతి పైనె మనసు యువకులకును
వయసు మీరినపుడు వదలదింకొక చింత
స్రష్ట పైన మనిషి దృష్టి పోదె ?!
భావం : బాల్యమంతా ఆటల్లో, యౌవనం స్త్రీవ్యామోహంలో వార్ధక్యం వేరే చింతలతో సాగుతుంది. పరబ్రహ్మపై మాత్రం ఎవడూ మనస్సు పెట్టడు.

మూలం :
 కా తే కాంతా కస్తే పుత్రః సంసారోఽయమతీవ విచిత్రః
కస్య త్వం కః కుత ఆయాతః తత్త్వం చింతయ తదిహ భ్రాతః || 8 ||
పద్యం 
9. నీదు పెండ్ల మెవరు నీ పుత్రుడెవ్వరూ
కాపురంబె యెపుడు కడు విచిత్రము
ఎచటి వాడ వీవు యెచట నుండీ రాక
తత్త్వ మెరుగు భ్రాత తరుణ మిదియె ||
భావం : నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము చాలా విచిత్రమైనది. నీవెవడివాడవు? ఎక్కడినుండి వచ్చావు? ఓ సోదరుడా! తత్త్వమునాలోచింపుము.
మూలం :
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || 9 ||
పద్యం
 10. సజ్జనులను జేర సడలును బంధాలు
బంధములతొ మోహ పాశములును
అన్ని తొలగ కలుగు నసలైన జ్ఞానమూ
అదియె కలిగినపుడె యసలు ముక్తి ||
భావము : సత్పురుషసాంగత్యము వలన భవబంధాలు తొలగును. బంధములు తొలగినచో మోహము నశించును. మోహము నశించగా స్థిరమైన జ్ఞానమేర్పడును. స్థిరజ్ఞానమేర్పడగా జీవన్ముక్తి కలుగును.

మూలం :
వయసిగతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః
క్షీణేవిత్తే కః పరివారః జ్ఞాతే తత్త్వే కః సంసారః || 10 ||
పద్యం
 11. వయసె మీరి నపుడు వాంఛలెక్కడ నుండు
నీరు లేని చెరువ ? నిజము భ్రాంతి !
పైస లేని చోట బంధువు లెక్కడ
' తెలివి ' యున్న కట్లు తొలగి పోవు ||
భావము : వయస్సు మళ్ళినచో కామవికారమెక్కడ? నీరెండిపోగా చెరువెక్కడ? సంపదక్షీణించినచో బంధువులెక్కడ? తత్త్వజ్ఞాన(తెలివి)మేర్పడగా సంసార బంధాలు (కట్లు) ఎక్కడుంటాయి అనగా తొలగిపోతాయి...

మూలం :
మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్
మాయామయమిదమఖిలం బుధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||11||

పద్యం 
12. జవ్వనంబు, ధనము, జనమె నిత్యము కాదు
గర్వపడకు పోవు క్షణములోన !
మాయతోటి నిండె మరి విడు జగతిని
జ్ఞాని వగుచు పొందు ఘన పదంబె ||
భావము : ధనము - జనము - యౌవనము చూచి గర్వపడకుము. వీటన్నిటినీ కాలము ఒక్కక్షణములో హరించును.
మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము.

మూలం : 
దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః || 12 ||
పద్యం 
13. పవలు, రాత్రి మరియు ప్రాతః సమయమైన
సంధ్య, శిశిర మన వసంతమేని
కరిగి తిరిగి వచ్చు, కాలమాటాడుచూ
ఆయువావిరైన యాశ పోదె !?
భావము : పగలు - రాత్రి , సాయంకాలము - ప్రాతఃకాలము , శిశిర ఋతువు - వసంత ఋతువు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వచ్చును.
కాలము ఆటలాడుచున్నది. ఆయుష్షు క్షీణించుచున్నది. అయినా ఆశ విడవకున్నది.
--------------------
ఈ 12 శ్లోకాలే ముందుగా ఆచార్యులవారు ఆశువుగా పలికినవి. ఇది ద్వాదశ మంజరీక స్తోత్రమని ప్రసిద్ధి.
----------------------

మూలం : కాతే కాన్తా ధన గతచిన్తా
వాతుల కిం తవ నాస్తి నియన్తా .
త్రిజగతి సజ్జనసం గతిరైకా
భవతి భవార్ణవతరణే నౌకా || 13 ||

పద్యం

14. నీదు భార్య యెవరు? నీ చింత ధనమేన?
దారి పెట్టు వారె ధరణి లేర ? !
సకల లోకములలొ సాధు సాంగత్యమే
తీరమునకు చేర్చు తీరుగాను... ||

భావము : 

నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడును ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింతలేదా? నిన్ను సన్మార్గమున నడిపింప చేయగలవారెవ్వరు లేకపోయారా? నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము.

మూలం : జటిలో ముండీ లుంఛితకేశః కాషాయాంబరబహుకృతవేషః
పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదరనిమిత్తం బహుకృతవేషః" ||14 ||

పద్యం 
15. జుట్టు పెంచుకొనును, కట్టు మార్చుకొనును
గుండు చేసుకొనును గూర్మితోడ
కావి వస్త్రములును కంజరమునకేగ
ఎరిగి యుండి మూఢుడెరుగనట్లె ||

భావం : జడలు ధరించినవాడై - గుండు కొట్టించుకున్నవాడై - జుట్టు కత్తిరించుకున్నవాడై - చివరకు కాషాయవస్త్రములు ధరించినవాడైనా పొట్ట(కంజరము)నింపుకొనుటకు వివిధ వేషములు ధరించు మూర్ఖుడు ... అట్టివాడు " వాస్తవాలను " చూస్తూ కూడ చూడనట్లుండును.


మూలం : 
అంగం గలితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండమ్
వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండమ్ || 15 ||

పద్యం 

16. తనువు డస్సిపోయె, తలయు నెరసిపోయి
ముదిమి మీద పడగ కదలుటకును
కర్ర లూతమాయె కాని యా మనిషిలో
ఆశ చావదాయె ... అభవమెటులొ ?!

భావము : శరీరం క్షీణించినది , తలనెరసినది , దంతములు ఊడినవి, ముసలివాడై కర్రపట్టుకు నడుచుచున్నాడు. అయినా ఆశ వదులుటలేదు. (ఇంక ఆ మనిషికి మోక్షము(అభవము) ఎట్లా లభిస్తుందో కదా..).



మూలం :
 అగ్రే వహ్నిః పృష్ఠేభానుః రాత్రౌ చుబుకసమర్పితజానుః
కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః || 16 ||
పద్యం 
17. శిఖకు రవికి మధ్య చేరి సెగను పొందు
గౌద చేరు రాత్రి కాళ్ల మధ్య
కరము జాచు కడికె, తరు నివాసియె గాని
ఆశ లడగిపోవె లేశమైన !?

భావం : ముందు అగ్నిని వెనుక సూర్యుని ఉంచుకొని చలి కాచుకొనుచూ, రాత్రులలో మోకాలుపై గడ్డమునుంచి , చేతులతో భిక్ష స్వీకరించుచూ , చెట్టు కింద నివసించువానిని కూడా ఆశాపాశం వదులుటలేదు.

మూలం : 
కురుతే గంగాసాగరగమనం వ్రతపరిపాలనమథవా దానమ్
జ్ఞానవిహినః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన" || 17 ||

పద్యం 
18. గంగ సాగరంబు గలియుచోట మునుగు,
వ్రతము, దానములును వదలకుండ
చేయి, తత్త్వ మెరిగి చేయకున్న భజన
జన్మలెత్తు వంద, జన్మ పోదు ||

భావము : గంగా - సముద్ర సంగమములలో స్నానంచేసినా , వ్రతములను ఆచరించినా , దానం చేసినాకూడా
తత్త్వజ్ఞానం లేనివాడు వంద జన్మలైనా ముక్తి పొందడు.
(దిడ్డు అనగా ఆచరించు అనే అర్థమూ ఉన్నది కదా)



మూలం : 
సుర మందిర తరు మూల నివాసః శయ్యా భూతల మజినం వాసః
సర్వ పరిగ్రహ భోగ త్యాగః కస్య సుఖం న కరోతి విరాగః || 18 ||

పద్యం 
19. గుడిని చెట్టు కిందె గూడుగా వసియించు
కటిక నేల నిదుర, కట్టజినము
భోగములకు నెపుడు భోక్త గాకుండుట
విముఖ మెవడి కెపుడు వేడుకవదు ?

భావము : గుడిలో చెట్టుకింద నివాసము , నేలపై నిద్ర, తోలును వస్త్రంగా ధరించుట, దేనినీ స్వీకరించకపోవుట, భోగముననుభవించకపోవుట అను వైరాగ్యము ఎవడికి సుఖమివ్వదు?
(రెండో పాదంలో కట్టు అజినము...అనగా చర్మ ధారి కావడం, విముఖము అనగా వైరాగ్యము, వేడుక అనగా సుఖానికి పర్యాయపదమే..కదా)


మూలం :
 యోగరతో వాభోగరతోవా సంగరతో వా సంగవీహినః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ || 19 ||

పద్యం 

20. యోగి యైన నేమి, భోగియైతే నేమి
పెంచుకొన్న పొత్తు తెంచు కున్న
పరమ బ్రహ్మ మందె పదిలమైన మనసు
సంతసంబు పొందు శాశ్వతముగ ||

భావం : యోగమును ఆచరించువాడుకానీ - సుఖములను అనుభవించువాడుకానీ, బంధములు పెంచుకొనువాడుకానీ - తెంచుకొనువాడుకానీ, ఎవడి మనస్సు పరబ్రహ్మయందు లగ్నమగునో వాడు ఆనందించుచునే ఉండును.


మూలం : 
భగవద్గీతా కించిదధీతా గంగా జలలవ కణికాపీతా
సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా ||20||


పద్యం 

21. ఇచ్ఛ కలిగి గీత యించుకైన పఠించి,
కొసరి గంగ జలమె గ్రోలి యింత,
విష్ణు పూజ సేయ వీడక నొకపరి
కాలుడైన వాని కదపలేడు ||
( కొసరి అనగా ...కోరి)
భావం: కొంచమైనా భగవద్గీత చదివి, ఒక కణమైనా గంగాజలం త్రాగి,
ఒక్కసారైనా విష్ణువును పూజించినవానిని యముడైనా ఏమియు చేయగలడు? (చేయలేడనే భావము కదా...)


మూలం : 
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్
ఇహ సంసారే బహుదుస్తారే కృపయాఽపారే పాహి మురారే || 21 ||

పద్యం 

22. జన్మ, మిత్తి తిరిగి జనని గర్భమె ప్రాప్తి
మరల మరల యింతె మరువలేము
సంకటములె చూడ సంసారమంతయూ
కావుమయ్య కృష్ణ కరుణ తోడ ||

భాువం: మరల పుట్టుక మరల మరణము మరల తల్లిగర్భంలో నివాసము అను దాటలేని అపారమైన సముద్రం నుండి ఓ కృష్ణా! దయతో రక్షించుము.
(సంసారమే దుఃఖ సాగరం, దుస్తరమైన అంటే సంకటప్రాయమైన, మిత్తి అనగా మృత్యువు అనే కదా)


మూలం :
 "రథ్యా చర్పట విరచిత కంథః పుణ్యాపుణ్య వివర్జిత పంథః
యోగీ యోగనియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ || 22||

పద్యం 

23. వీధులందు దొరకు పేలికలే గొప్ప
వస్త్రములుగ గట్టు వదలకుండ
పాప పుణ్యములతొ బంధమే లేనట్టి
కర్మలాచరించు కర్మ జీవి ....
(తదుపరి పద్యంతో అన్వయం....)

24. నేర్చి యోగ విద్య, నేర్పుగా చిత్తమే
అదుపు సేయు చుండు నతడె యోగి
ఊయలైన దిగని యున్మత్త బాలుడై
ముదము పొందు వాని యెదయె నిజము...||

భావం : కూడలిలో దొరికిన పీలిగుడ్డలను కట్టుకుని, పాపపుణ్యములంటని కర్మలనాచరించుచూ, యోగముచే చిత్తవృత్తులను నిరోధించు యోగి 
బాలునివలే ఉన్మత్తునివలే ఆనందించుచుండును.

మూలమ్ : 
కస్త్వం కోఽహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః
ఇతి పరిభావయ సర్వమసారమ్ విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్ ||23||

పద్యం
 25. " ఎవరు నీవు, నేను ఎట నుండి వచ్చితి
మాత యేరు నాదు తాత యెవరు
సార రహిత మాయె సంసార మ"నుచును
స్వప్న రీతి చింత సాగ నిమ్ము !

భావం : నీవెవరు?నేనెవరు? ఎక్కడినుండి వచ్చావు? నాతల్లి ఎవరు? నాతండ్రి ఎవరు? స్వప్నమువలే కనబడు ఈ ప్రపంచమును విడిచి అంతా నిస్సారమే అని భావించుము.



మూలమ్ :
 త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః
సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదజ్ఞానమ్ ॥24॥

పద్యం
 26. నువ్వు, నేను మరియు నెవ్వరెచటనైన
విష్ణు మూర్తి దక్క వేరు కారు !
అసహనమ్ము వీడుమది వృధాయే కదా
వేరు భావమేల ? వేల్పు చూడు!!

భావం : నీలో, నాలో, వేరేచోట ఉన్న పరమాత్మ ఒక్కడే.అసహనంతో నాపై వ్యర్థంగా కోపించుచున్నావు. అంతటా పరమాత్మనే చూడుము.విభేదమును విడువుము.

మూలమ్ :
 శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధౌ
భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్యచిరాద్యది విష్ణుత్వమ్ ॥25॥

పద్యం
 27. వేగముగనె నీవు విష్ణు పదము గోర
శత్రు, మిత్ర, పుత్ర, స్వజనుల యెడ
నిగ్రహించి సంధి, విగ్రహ భావమూ
సమత భావముననె సాగవలయు ॥

భావము : శీఘ్రంగా పరమాత్మను పొందదలచినచో శత్రు - మిత్ర - పుత్ర - బంధువులపట్ల
విరోధ - స్నేహములకై ప్రయత్నించక సర్వసమానభావనను పొందుము.

మూలమ్: 
కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాఽత్మానం పశ్యతి కోఽహమ్
ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తే పచ్యంతే నరకనిగూఢాః "|| 26 ||

పద్యం 
28. మదము, కామ, క్రోధ, మాత్సర్య, లోభము,
మరులె యరులు వీడు మెరుగు నిన్ను 
ఆత్మ జ్ఞాన మేమి యరయని మూఢుడే
నరకమందు నందు నాశనంబె ||

భావం :కామ - క్రోధ - లోభ - మోహములను వదలి నిన్ను నువ్వు తెలుసుకో. ఆత్మజ్ఞానం లేని మూఢులు నరకంలో పడి పీడింపబడెదరు.
(మొత్తం అరి షడ్వర్గాలనూ వదలడం మంచిది కదా.. మోహమునకు పర్యాయపదమే అతిగా మరులు గొనడం, అరయు...తెలుసుకోవడం.)

మూలమ్: 
గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్
నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తమ్ || 27 ||

పద్యం
 29. విష్ణు నామములను వీడక గీతయు
గాన మెపుడు చేయి, ధ్యానమందు
వెన్నుడుండ వలయు, విజ్ఞుల నెయ్యమూ,
దాన ధర్మములను తప్పరాదు ||

భావం : భగవద్గీత - విష్ణుసహస్రనామములను గానం చేయుము.. ఎల్లప్పుడు విష్ణువుని ధ్యానించుము.మనస్సును సత్పురుష సాంగత్యమునందుంచుము.దీనజనులకు దానం చేయుము.

మూలమ్:
 సుఖతః క్రియతే రామాభోగః పశ్చాద్ధంత శరీరే రోగః
యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణమ్ ||28||

పద్యం 
30. శోభనంబు సుఖమె, శుష్కించు దేహము
కడకు మరణ మొకటె గమ్య మదియె !
తెలిసి మానవులును తెలియనట్లె యెపుడు
పాపములనె సేయు ఫలితమేమొ ?!

భావం : స్త్రీతో సుఖించవచ్చును. కానీ తరువాత రోగం వచ్చును.లోకంలో మరణమే శరణమని తెలిసినా మానవుడు పాపం చేయుట మానడు.


మూలమ్: 
అర్థమనర్థం భావయ నిత్యం నాస్తితతః సుఖలేశః సత్యమ్
పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః || 29 ||
పద్యం 
31. ధనము వలన యెపుడు దారుణ ఫలితమే
సొమ్ములెన్ని యున్న సుఖము రాదు
నిత్య సత్య మిదియె నిధులున్న వానికీ
సంతు జూడ భయమె సంశయమున ||
భావం : అర్థమే(ధనము) అనర్థమని ఎల్లప్పుడూ భావించుము. .నిజంగా డబ్బు వలన సుఖం లేదు. ఇది సత్యము. ధనవంతుడు పుత్రుని నుండి కూడా భయపడును. (ఇదే కదా లోక రీతి)



మూలమ్:
 ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేకవిచారమ్
జాప్యసమేత సమాధివిధానం కుర్వవధానం మహదవధానమ్ || ౩౦ ||
పద్యం 
32. నేర్చి యోగ విద్య నిరసించు మింద్రియం
నిత్య మేదొ మరి యనిత్యమేదొ
జప సమాధి స్థితులు చక్కగా నెరుగుచూ
ఆచరించ వలయు నాస్థ తోడ ||
భావం: ప్రాణాయామము - ప్రత్యాహారము - నిత్యానిత్యవస్తువివేకము జపంతో కలిసిన సమాధిస్థితి - ఏకాగ్రత వీటిని శ్రద్ధగా ఆచరించు. 

వివరణ...ప్రాణాయామము అంటే యోగవిద్యలో భాగమే, ప్రత్యహారం అంటే ఇంద్రియాలను నిరోధిం(నిరసి)చడం, ఆస్థ అంటే ఆసక్తి, శ్రద్ధ ...


మూలమ్ : 
గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాదచిరాద్భవ ముక్తః
సేంద్రియ మానస నియమా దేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్ ||31||

పద్యం 
33. గురువు పాదములనె గొల్వుము భక్తితో
బాము నుంచి త్వరగ బయటపడుము
మనసు, నింద్రియముల మరలక బట్టితే
మనము లోని దైవ మగపడునుగ ||
భావం : గురువుగారి పాదపద్మములపై భక్తినుంచి తొందరగా సంసారంనుండి బయటపడుము.
ఇంద్రియములను - మనస్సును నియమించినచో నీ హృదయంలో ఉన్న దేవుని చూడగలవు.


=============================
సమాప్తమ్ =
=======================

No comments:

Post a Comment