Wednesday, 15 November 2017



శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రమ్ 


-----------------

(ఆట వెలదులలో ....భావార్థాలతో...)

----------------------

.........................ధ్యానమ్............................

కాంతులీను మణులు కలిగిన యిసుకచే

ప్రభలు వెలుగునట్టి పాలకడలి

ముత్యములును జేరి మురిపించు నగలతో

శేషశయనుడాయె శ్రీహరిపుడు !!



అడుగు లవని యయ్యె ఆ నాభి గగనమే,

గాలి వాయువాయె, గనులు నెపుడు

సూర్య, చంద్ర భంగి సూడు నీ జగతినీ,

దిశలు చెవులె, యగ్ని దేవ ముఖము !!

శౌరి శిరసు జూడ స్వర్గమై భాసిల్లు

సకల ప్రాణులచటె సంచరించు

దివ్యమందిరంబె దేవ దేవుని మేను

ముక్తి గోరి నేను మోకరింతు !!

మానవులును మరియు దానవులైనను

వాసవునిలొ యెపుడు వాసముండ్రు

మూడు లోకములును మాడెములన్నియు

అచటె యుండు గాన యంజలింతు !!

(మాడెము యనగా దేశము, మండలము విశ్వమంతయూ)

శాంత రూపుడతడు, సర్ప రాజ శయన

నీలమేఘ శ్యామ, నిఖిల జగతి

ప్రాపుగొనును పద్మనాభ సురేశుడే

 వేల వందనాలు వెన్నునికిని !!

(భావము : కళ్ళు మిరుమిట్లు గొలిపే మణులున్న ఇసుక తిన్నెలతో నిండిన పాల కడలి. అందులో ఆదిశేషునిపై శ్రీహరి. ఆయన అడుగులే భూమి. నాభి ఆకాశం.నేత్రాలు సూర్యచంద్రులు. దిశలే కర్ణాలు. ఆయన ముఖమే అగ్ని. శిరసు స్వర్గ సమానమే. శరీరం నిండా ముల్లోకాలూ ఉంటాయి. విశ్వమంతా వ్యాపించి యుండే ఆ దివ్య కాయమే సమస్త ప్రాణికోటికి ఆరామం. ఆ భగవానుడే శాంతి స్వరూపుడు. సర్వ వ్యాపి. నీలమేఘ శ్యాముడు. చరాచర జగత్తును ఏలే సురేశుడు. పద్మ నాభుడు. విశ్వమంతా ఆయననే ఆశ్రయించి ఉంటుంది. అట్టి శ్రీహరినే ముక్తి కోరి ప్రార్థిస్తున్నాను.)



.............ఓమ్. నమో భగవతే వాసుదేవాయ...........

-----------------------స్తోత్రమ్-----------------------------

శ్లోకము: విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ||1||

----------------------(నామాలు 1 నుంచి 9 వరకు)

పద్యం. 1. విశ్వ వ్యాపకుండు, విశ్వమంత యతని

వశమునందె యుండు వదల కుండ

మూడు కాలములకు జూడ దానధిపతి

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: విశ్వం ... చరాచర జగత్తు, విష్ణు ... అంతటా వ్యాపించి ఉన్నవాడు, వషట్కార ... వశమునందుంచుకున్నభూత భవ్య భవత్ప్రభు ... మూడు కాలాలకు అదిపతి.

భావము: విశ్వమంతటా వ్యాపించి దానిని తన అదుపులో ఉంచుకున్నవాడు, భూత, వర్తమాన, భవిష్యత్కాలాలు మూడింటికీ అధిపతియూ నైన ఆ స్రీహరికి శత సహస్ర వందనాలు.]

1ఎ. కర్త, భర్త గానె కలిగి సమత్వము

అన్ని భూతములకు నాత్మ తాను

కాంతి నిచ్చు మరియూ గల్పించు శుభములు

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: భూత కృత్ ... భూతములను సృష్టించినవాడు, భూత భృత్ ... భూతాలను భరిస్తున్నవాడు, భావ ... భూతాలపట్ల సమ భావం, భూతాత్మ ... భూతాలన్నిటా ఆత్మయై ప్రకాశిస్తున్నవాడు, భూత భావన ... భూతాలకు శుభం కల్పిస్తున్నవాడు.

భావము: సమస్త చరాచర జగత్తుకు (సృష్టి)కర్తయై, తానుగా భరిస్తున్నవాడు, అన్నిటా సమభావం కలిగి, అన్నిటికీ వెలుగు, శుభములు కల్పిస్తున్నవాడు అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు.]

------------------------------------
శ్లో. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః

అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞోక్షర ఏవ చ ||2||

----------------------(నామాలు 10 – 17)

2. పావనంబె యాత్మ, పరమాత్మ చూడగా

తనను చేరు జనుల దరిని జేర్చు

అంత మెరుగడతడె యసలైన పురుషుడే

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: పూతాత్మ ... పవిత్రమైన ఆత్మ, పరమాత్మ ... గొప్పదైన ఆత్మ, ముక్తానాం ... మోక్షమొసగు, పరమాం గతి ... గొప్పదైన గమ్యం, అవ్యయ ... వ్యయముకాని, పురుష ... పురుషుడు.

భావము: పవిత్రమూ మరియూ గొప్పదీ అయిన ఆత్మ గలవాడు, తనను నమ్ముకున్నవారికి మోక్షం ప్రసాదిస్తూ తగిన గమ్యం చేర్చువాడు, ఆద్యంతములు లేని అసలైన పురుషుడు అనగా ధర్మం దాటనీయకుండా కాపాడేవాడు వాడు అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]

3. కర్మ సాక్షి యతడె కాయమందుండునూ

ఆది యంత మనగ నేది లేదు

అక్షరుండె యతడు నాదుకొనును చూడు

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: సాక్షి ... చూచువాడు, క్షేత్రజ్ఞ ... క్షేత్రము అనగా శరీరము(కాయము)నందుండువాడు, అక్షర ... క్షరము అనగా నాశము లేనివాడు.

భావము: జీవకోటి శరీరములందన్నిటా ఉంటూ వాటి కర్మలకు ప్రత్యక్ష సాక్షి అయినవాడు, నాశమే లేనివాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.]
----------------------------------
శ్లో. యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః
నారసింహవపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ||3||

-------------------------(నామాలు 18 – 24)

4. యోగమనగ తానె యోగ విద్యకు నేత

ప్రకృతి జీవమునకు ప్రాణమతడు

నారసింహుడతడె క్రూరత్వ మణచునూ

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: యోగో ... యోగము అనగా మహర్దశ, యోగ విదాం నేత ... యోగవిద్యకు అధినేత, ప్రధాన పురుషేశ్వర ... ప్రకృతి(ప్రధాన), పురుషులకు ప్రభువు, నారసింహవపు ... నరసింహావతారుడు.

భావము: యోగవిద్యకు అధిపతియై మహర్దశ కల్పించువాడు, ప్రకృతి పురుషులకు అధిపతి, నరసింహావతారియై క్రూరత్వాన్ని అణచువాడు అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు. ]

5. నల్ల వేల్పుగాను నలినె బంచునతడు

పొగులుపుచ్చు దలవ పూర్తిగాను

పూజలందుకొనును పురుషోత్తమునిగాను

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: శ్రీమన్ ... శ్రీపతి పర్యాయ పదం నల్లవేల్పు, కేశవ ... క్లేశము(పొగులు) హరించు(పుచ్చు)వాడు, పురుషోత్తమ ... పురుషులలో ఉత్తముడు.

భావము: శ్రీపతియై కష్టాలను అనగా క్లేశములను హరించువాడు, పురుషులలోకెల్లా ఉత్తముడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.]

-------------------------------------
శ్లో. సర్వశ్శర్వ శ్శివ స్ధాణుః భూతాది ర్నిధి రవ్యయః
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ||4||
--------------------------(నామాలు 25 – 36)

6.సర్వమతడె మరియు శర్వుడు దానెగా

శస్తకరుడు మరియు స్థాణువతడె

సకల భూతములకు సరియైన మూలము

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: సర్వ ... సర్వము, శర్వ ... హరించు, శస్త కరుడు అనగా శుభంకరుడు అనగా శివుడే, స్థాణువు ... దేనికీ చలించనివాడు,భూతాది ... భూతాలకు మూలము.

భావము: బ్రహ్మాది దేవతలు మొదలు సకల చరాచర జీవకోటి తానే అయినవాడు, సకల దోషాలను శమింపజేసేవాడు, శుభంకరుడూ అయిన శివుడు కూడా శ్రీహరియే. దేనికీ చలించనివాడు అనగా కాలాతీతుడు, సకల భూతాలకూ ఆధారము, మూలమూ తానే అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]

7. నిఖిల జగతి కతడు నిధియె వ్యయముగాడు

యుగయుగాలు తానె యుద్భవించు

భావనొకటి యున్న భర్తయై గాచును

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: నిధి రవ్యయ ... వ్యయము కాని నిధి, సంభవో ... సంభవామి యుగే యుగే, భావన ... భావము చేతనే, భర్త ... భరించువాడు.

భావము: పునరపి జననం, పునరపి మరణం సాధారణ ప్రాణకోటికేగాని శ్రీహరికి కాదు గదా. కనుక ఆయన మన పుణ్య కార్యాలన్నిటికీ తరగని నిధియై ప్రళయానంతరం తదనుగుణమైన సృష్టి చేస్తూ ఉంటాడు. అలాగే అవసరం అనుకున్నపుడు తనకు తానుగానే అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ప్రాణకోటి తన ఉనికిని గుర్తిస్తూ తనకై ప్రార్థనలు చేసీ చేయగానే ఆ భావ మాత్రముననే రంగంలోకి దిగి భారం వహించి కాపాడుతుంటాడు. కనుకనే అట్టి యా శ్రీహరికి శత సహస్ర వందనాలు.]

8. సాధు జనులకెపుడు సంరక్షగా తాను

ప్రభల నిచ్చుటకును ప్రభవ మందు

ప్రభువు లక్షణమెగ పాలించ లాలించ

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: ప్రభవ ... పుట్టుక, ప్రభు ... పాలకుడు, ఈశ్వర ... ఆలించి పాలించువాడు(రాజులేదా తండ్రి), ప్రభలు ... వెలుగులు.

భావము: సాధు జనుల రక్షణకై వెలుగులు ప్రసరించే అనగా జ్ఞాన జ్యోతులను అందించే నిమిత్తం తనకు తానుగానే అవతరించువాడు, పాలన, పోషణ వంటి బరువు బాధ్యతలను నిర్వర్తించువాడు అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]


--------------------------------------------
శ్లో. స్వయంభూశ్శంభు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః
అనాది నిధనో ధాతా విధాతా ధారురుత్తమః ||5||

--------------------------(నామాలు 37 – 45)

9. సొంత నిర్ణయమున సూత్రధారిగ తానె

అవతరించుచుండు నవని యందు
శంభువనగ తానె యంబర రత్నమే

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: స్వయంభూ ... స్వంతముగా ఉనికి ప్రదర్శించు, శమ్భూ ... శివుడు(శంభు అనగా శుభము. అది కలుగజేసేవాడే శమ్భుడు), ఆదిత్య ... సూర్యుడు (అంబర రత్నమే).

భావము: అవసర సమయాలలో ఎవరి ప్రమేయమూ లేకనే తానే స్వయముగా అవతరించువాడు, శుభములను కలగజేయువాడు, సూర్యుడు కూడా అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]

10. కమలములను బోలు కనులు గల్గినవాడు

ప్రణవ నాదమునకె ప్రతినిధాయె

ఆది రహితుడతడె, అంతమె యెరుగడు

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: పుష్కరము అనగా కమలము కనుక పుష్కరాక్ష అనగా కమలాక్షుడే, మహాస్వన ... గొప్ప ధ్వని, అనాది నిధన ... ఆది, నిధనములు అనగా జనన మరణములు లేనివాడు.

భావము: కమలముల వంటి కనులు కలవాడు, తానే ఓంకార నాదమైనవాడు, జనన మరణములు లేనివాడు అనగా ఆద్యంత రహితుడు అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]

11. సృజన కర్త తానె నిజ ఫలములకును

కారకుండు నతడె కనగ నెపుడు


ధాతువులకు గొప్ప ధాతువు తానెగా

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: ధాత ... సృష్టి కర్తయైన బ్రహ్మ, విధాత ... విలేఖించు ధాత(అనుకోవచ్చు) అనగా నొసటి వ్రాత వ్రాయువాడు, ధాతురుత్తమ ... ధాతువులలో కెల్ల ఉత్తముడు.

భావము: సృష్టించేది అతడే. విధాతగా కర్మ ఫలాలకు కారకుడూ అతడే. శరీరంలోని వేలాది ధాతువులన్నిటా వ్యాపించియున్న ఉత్తమ ధాతువు కూడా తానే అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]

--------------------------------------------------------------
శ్లో. అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః
విశ్వకర్మా మనుస్త్వష్టా స్ధవిష్ఠః స్ధవిరో ధ్రువః ||6||

------------------------ (నామాలు 46 – 54)
12. అప్రమేయు డతడె యనగ హృషీకేశ,

పద్మ నాభు డమర ప్రభువు గాను

విశ్వకర్మ మరియు వినగ మనువు కాదె

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : అప్రమేయ ... ఊహలకందనివాడు, హృషీ కేశ ... హృషీ అంటే ఇంద్రియాలు, కేశ అంటే కేశములు, పద్మనాభు డు ... నాభి యందు పద్మము గలవాడు, అమర ప్రభు ... మరణమెరుగని లేదా దేవతలకు ప్రభువు, విశ్వ కర్మ .. విశ్వాన్ని రచించేవాడు, మనువు ... మననము చేసే(చేయదగిన)వాడు.

భావము : సామాన్య జనుల ఊహలకు అందకుండా కేవలం ఆత్మజ్ఞానంతోనే దర్శనమిచ్చేవాడు, ఇంద్రియాలను తన కేశ కిరణాలతో నియంత్రించేవాడు, పద్మము నందు నాభి గలవాడు, దేవతల(మరణమే యెరుగని) ప్రభువు, చరాచర జగత్తును రచించువాడు, మంచి ఆలోచనలను చేయువాడు అయినట్టి శ్రీహరికే శతసహస్ర వందనాలు.)

13. త్వష్ట గాను తానె సృష్టి నంతము జేసి

తిరిగి చేయుచుండు తీరుగాను

స్థూలమైన వాడె కాలమెరుగబోడు

వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : త్వష్ట ..విశ్వ కర్ముడు, సృష్టిని అంతము చేయువాడు, స్థవిష్ట ... స్థూల శరీరుడు, స్థవిరో ధ్రువ ... శాశ్వతమైన వాడు, సనాతనుడు.
భావము : ప్రళయకాలమునందు సృష్టిని అంతము చేసి అనగా తనలో కలుపుకుని తిరిగి సమయం రాగానే పునఃసృష్టి చేసేవాడు, కాలాలతో నిమిత్తం లేని సనాతనుడు అనగా పూర్వకాలం నుంచి ఉన్న శాశ్వతమైన వాడు ... అట్టి శ్రీహరికే శతసహస్ర వందనాలు.)

శ్లో. అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః

ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ !! 7 !!

------------------------(నామాలు...55--63)

14. గ్రాహ్యమేమి కాదు గణములకెప్పుడూ

నశ్వరుండు కాడు, నల్లనయ్యె

లోహితాక్షు డతడె, లోకేశ, శ్రీలుడు

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు: అగ్రాహ్య ... కనిపించనివాడు, శాశ్వత ... శాశ్వతమైన వాడు, కృష్ణ ... నల్లనయ్య, లోహితాక్షుడు అనగా ఎర్రని కన్నులు గలవాడు, ప్రతర్దన ... ఈశ్వరుడు, ప్రభూత ... సంపన్నుడు.

భావము : సామాన్యుల మామూలు ఇంద్రియ మనో బుద్ధులకు కనిపించని వాడు, సర్వకాల సర్వావస్థలందు శాశ్వతమై ఉండేవాడు(నశ్వరుడు), సచ్చిదానంద స్వరూపుడైన కృష్ణుడు, ఎర్రని కనులు కలిగి, ప్రళయాంతమున సమస్తమూ తనలో కలుపుకునే వాడు అనగా లయకారుడైన ప్రతర్దనుడు(శివుడు), జ్ఞాన గుణ సంపద కలిగిన ఉన్న (ప్రభూత) ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)

15. అష్ట దిక్కులతని యావాసమై యుండు

పరమ పురుషు డతడు పావనుండు

స్మరణ మాత్రముననె సర్వ శుభము లొసగు

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు : త్రికకుబ్ధాముడు ... ముల్లోకాలలోనూ ఉండువాడు, పవిత్ర ... పరిశుద్ధమైన వాడ, మంగళం పరమ్ ... మంగళ ప్రదమైన మూర్తి.
భావము : దశదిశలకూ ఆధార భూతమై, అంతటా తానే అయి ఉన్నవాడు, పరిశుద్ధమైన ఆత్మతో స్మరణ మాత్రముననే సకల శుభాలు అందించు శ్రీహరికే శత సహస్ర వందనాలు.)

-----------------------------------------------

శ్లో. ఈశాన ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః

హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధు సూదనః !! 8 !!

---------------------------------( నామాలు 64 ... 73 )

16. పాలనంబు సేయు ప్రాణ దాత యతడు

ప్రాణమతడె మరియు ప్రధముడతడె

పరమ పురుషుడైన పరమేశుడే వాడు

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు : ఈశానః ... పాలకుడు, ప్రాణదః ... ప్రాణము పోయువాడు, ప్రాణః ... ప్రాణములు, జ్యేష్ఠ ... పెద్దవాడు, శ్రేష్ఠ ... గొప్పవాడు, ప్రజాపతిః ... ప్రజలందరికీ అధిపతి.

భావము : సకల లోకాలకు పరిపాలకుడు, జవము, జీవమూ తానై అందరికీ తానే అందించే వాడు, దేవతలందరిలోకీ అగ్రజుడు, పరమ పురుషుడు, సర్వలోకాలకూ అధిపతి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)

17. పసిడి నందు బుట్టె బ్రహ్మ గాగ నతడు

పుడమి దాచి గాచె కడుపు నందు

మాధవుడును యతడె మధుసూదనుడాయె

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు : హిరణ్య గర్భో ... స్వర్ణమయమైన గర్భము నందు జన్మించిన వాడు, భూగర్బో ... భూమిని గర్భము నందు దాచుకున్నవాడు, మా ధవుడు ... లక్ష్మీపతి, మధుసూదనః ... మధు అనే రాక్షసుని చంపిన వాడు.

భావము : స్వర్ణమయమైన గర్భము నందు జనించిన చతుర్ముఖుడు అనగా బ్రహ్మ, తల్లి మాదిరి భూమిని గర్భము నందు దాచి కాచిన వాడు( కడుపులో పెట్టుకుని దాచడం), మా అనగా లక్ష్మి ధవ అనగా భర్త ... కనుక మాధవుడనగా శ్రీదేవి భర్త అయిన శ్రీహరియే, మధుకైభులలో ఒకరైన మధును చంపిన వాడు శ్రీహరి.అట్టి శ్రీహరికే శత సహస్ర వందనాలు.)



-------------------

శ్లో. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమ క్రమః

అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ !!9 !!

.............................(నామాలు 74 ... 64)

18. సర్వ శక్తులుండె, సామర్థ్యమది మెండు

విల్లు ధూర్తు నడచు, విద్వతుండు

శౌర్య వంతుడతడు సక్రమ పథగామి

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు : ఈశ్వరః ... శక్తి సంపన్నుడు, విక్రమీ ... విశేష సామర్థ్యము గలవాడు, ధన్వీ ... శార్జ్ఞమను ధనుస్సు గలవాడు, మేధావీ ... జ్ఞాన గుణ సంపన్నుడు, విక్రమః ... పక్షి వాహనంపై నుంచే విశ్వ సంచారం చేయగల సమర్థుడు, క్రమః ... నియమ బద్ధత పాటించేవాడు మరియూ పాటింపజేసేవాడు.

భావము : సకల ప్రాణకోటిని పోషించగల సమర్థుడు, ఘటనాఘటన సమర్థుడు, విశ్వ రక్షణకై శార్జ్ఞమను ధనుస్సు ధరించినవాడు, జ్ఞాన గుణ సంపన్నుడు, గరుడుడినే వాహనంగా చేసుకుని విశ్వమంతా విహారం చేయగలవాడు, తాను పద్ధతిగా ఉంటూ చరాచర జగత్తును గీత దాటకుండా నడిచేట్లు చూసేవాడు ఐన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)

19. సాటిలేని సుగుణి, సరిలేరు పోరులో

కర్మ చేయుచుండు, కర్మ కతడె

ఆధరవును మరియు నాత్మవాననవలె

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : అనుత్తమః ... సాటిలేని ఉత్తముడు(సుగుణి యనునది ఇకారాంత పుంలింగమే ననేది నిఘంటు ప్రమాణం), దురాధర్ష ... ఎదురులేని వాడు, కృతజ్ఞః ... ప్రాణులు చేయు కర్మలు తానే చేయువాడు, కృతి ఆత్మవాన్ ... ఆత్మల యందు సుప్రతిష్టుడు.

భావము : సుగుణాలలో సాటిలేనివాడు, రాక్షసులు సైతం ఎదుర్కోలేని యోధుడు, తనపట్ల నమ్మకముంచుచూ కృతజ్ఞతతో మెలిగేవారి కర్మలు తానే చేసేవాడు, సకల ఆత్మలయందు సుప్రతిష్ఠుడై ఉండువాడు అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు.)

------------------------

శ్లో. సురేశః శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః

అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః !! 10 !!

-------------------------------(నామాలు 85--94)

20. స్వామి దేవతలకు సంరక్షఁ దానెగా

ముదము గూర్చు, మూల పురుషు డతడె

జన్మ కారకుడును, జగతికి జీవమూ

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు : సురేశః ... సురలకు అంటే దేవతలకు ఈశుడు అంటే స్వామి లేదా దేవుడూ అనవచ్చు, శరణః ... దుఃఖాలను పోగొట్టేవాడు అంటే రక్షకుడే, శర్మః ... ఆనంద కారకుడు అంటే ముదము గూర్చువాడు, విశ్వరేతా ... సకల ప్రపంచం పుట్టుకకూ కారణమైనవాడు, ప్రజాభవః ... ప్రజోత్పత్తికి కారణభూతుడు, అహః ... జీవము.

భావము : దేవతలకు సైతం ప్రభువు, శరణన్న వారిని సంరక్షించేవాడు, పరమానంద స్వరూపుడు, ప్రజలను పుట్టించడానికి సాధనమైనరేతస్సూ, దాని ఆధారంగా జరిగే పుట్టుకలకు కారణమైన వాడూ, పగలు మాదిరి వెలుగు ప్రసాదించేవాడు లేదా పగలే ప్రజలకు జీవము గనుక జీవమూ తానే అయిన వాడు అయిన ఆ శ్రీహరికి శతసహస్ర వందనాలు.)

21. కాల పురుషు డనగ, కాల నాగను తానె

పట్టు వీడబోని పరమ పురుష

ప్రజ్ఞ యున్న వాడు, పారవ గలవాడు

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు : సంవత్సరః ... కాలపురుషుడు, వ్యాళః వాసుకి (మహానాగు), ప్రత్యయః ... ప్రజ్ఞా ధురీణుడు, సర్వ దర్శనః ... సకలమూ వీక్షించువాడు ... పారవ అంటే వీక్షణ, చూపు అనే అర్థమూ ఉన్నవి కదా...

భావము : భూతభవిష్యద్వర్త మానాలన్నీ తానే అయిన వాడు, తన పట్టు నుంచి భక్తులెవరూ జారిపోకుండా చూడగలవాడు, ప్రజ్ఞా ధురీణుడు, తన దృష్టి పథం నుంచి ఏదీ తప్పించుకు పోలేకుండా సర్వమూ వీక్షించువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)

----------------------

శ్లో. అజః సర్వేశ్వర స్సిద్దః సిద్ధిః సర్వాది రచ్యుతః

వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్మృతః !!11!!

--------------------------(నామాలు 95 .. 103)

22. జనన మనగ లేదు, జగదీశ్వరుడె తాను

పొంద తగిన దంత పొంది యుండె!

మోక్ష దాత యతడు, మూలమన్నిటికినీ

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు : అజః ... పుట్టుక లేనివాడు, సర్వేశ్వరః ... ఈశ్వరులకే ఈశ్వరుడు, సిద్ధః ... పొందవలసినదంతయూ పొందియున్న వాడు, సిద్ధిః ... ఫలరూపుడు, సర్వాది ...అన్నిటికీ మూలకారకుడు.

భావము : జననం అంటూ లేనివాడు,ఈశ్వరులకే ఈశ్వరుడు (జగదీశ్వరుడన్నా అదే అర్థం కదా), ఈ విశ్వంలో పొంద దగినదంతా (కర్మ ఫలము అనుకోవచ్చు) పొంది యున్నవాడు, మోక్షప్రదాత (ఆంగ్ల భాష్యం ప్రకారం కైవల్య ప్రదాత అని కూడా ఉన్నది), అన్నిటికీ మూలకారకుడు అయిన శ్రీహరికే శత సహస్ర వందనాలు.)

23. అచ్యుతుడును, తానె ఆది వరాహపు

రూపు దాల్చె, నెన్నొ రూపులుండె!

బంధములును లేవు, భవబంధములు దెంచు

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు : అచ్యుతుడు ... పతనం లేనివాడు, వృషా కపిః ... అర్థాలు రకాలుగా ఉన్నాయి. సమీపంగా ఉన్న అర్థం ఆది వరాహమనే, అమేయాత్ః ... అనేక రూపాలున్నవాడు, సర్వయోగ వినిస్మృతః ... అన్నిరకాల సాంగత్యాలను వదిలించుకున్నవాడు.

భావము : స్వరూప, సామర్థ్యాలలో ఏ విధంగానూ లోటు పాట్లు లేనివాడు, ఆది వరాహమై ధర్మాన్ని ఉద్ధరించినవాడు, అనేకానేక రూపాలున్నవాడు, తానుగా భవబంధాలను తెంచుకుని, భక్తులను సైతం వాటికి దూరం చేసేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)

----------------------

శ్లో. వసు ర్వసుమనాః స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః

అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః !!12!!

-------------------(నామాలు 104 ... 113)

24. వాసముండు జీవ రాశులన్నిటి యందు

విరస, రాగములకు విముఖు డతడు

సత్యమైనవాడు, సముడె, సమ్మితుడెగా

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు : వసుః ... సర్వ భూతములందునూ వసించువాడు, వసుమనాః ... రాగ ద్వేషములు లేని పరిశుద్ధాత్ముడు, సత్యః ... సత్యమైనవాడు, సమాత్మా ... సమతా భావము కలవాడు, సమ్మితః ... భక్త సులభుడు (ఆంగ్ల భాష్యం ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన వాడు).

భావము : సకల జీవ రాశులలో నివసించేవాడు, (కొన్ని భాష్యాల ప్రకారం అష్టవసువులలో ఒకరైన అగ్ని అని ఉంది. ఆ ప్రకారంగా చూసినా అన్ని జీవులలోనూ అంతో ఇంతో వేడిమి ఉంటుంది కదా), రాగ ద్వేషాలకు అతీతమైనవాడు, సత్యమైనవాడు, సమతా భావం కలవాడు( సౌమ్యుడు, ఉదారుడు అనే నానార్థాలు కూడా ఉన్నవి కదా), భక్త సులభుడై అందరికీ ఆమోదయోగ్యమైనవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)

25. సముడు నతడె, జూడు సత్ఫలములొసగు

హృదయ పద్మ వాసి, యుదజ దళాక్షుడే

ధర్మ కర్త దానె, ధర్మమే యాకృతి

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు : సమాః ... సర్వ సమానుడు (లక్ష్మీ పతి కూడా కావచ్చును), అమోఘః ... సరియైన ఫలితములనిచ్చువాడు, (ఆంగ్ల భాష్యం ప్రకారం ఉపయోగకారి), పుండరీకాక్షః ... పుండరీకము (ఉదజము) అంటే పద్మము కనుక పద్మము (రేకల)వంటి కనులు గలవాడు అని ఒక పాఠం, కాగా భక్తుల హృదయ పద్మములో నివసించువాడు అని ఇంకొక భాష్యం, వృష కర్మః ... ధర్మ బద్ధమైన కర్మలు చేయువాడు, వృషాకృతిః ... ధర్మమే ఆకారమైనవాడు( రామో విగ్రహవాన్ ధర్మః అనడంలో భావం అదే కదా...).

భావము : సకల భూతముల పట్ల సమానంగా వ్యవహరించువాడు,( స మా ... అంటే లక్ష్మితో ఉండువాడు అనే భాష్యమూ ఉన్నది), సరియైన ఫలితములనిచ్చువాడు, భక్తుల హృదయ పద్మము లందు నివసించువాడు, (లేదా పద్మముల వంటి కనులు కలవాడు అనే భావమూ ఉన్నది), ధర్మమైన కార్యక్రములనే నిర్వర్తించే, ధర్మమే ఆకారముగా గలవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)

-------------------------

శ్లో. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వ యోని శ్శుచి శ్రవః

అమృత శ్శాశ్వత స్థాణుర్వరారోహో మహా తపాః !!13!!

--------------------( నామాలు 114 ... 122)

26. శివుడె కాని చూడ శిరసులెన్నో యుండు

విశ్వ పాలకుండు, విశ్వయోని

శుభ్రమైన చెవులు, సురసేవితుడతడు

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు : రుద్ర ... శివుడు, బహుశిరా ... వేలాది శిరస్స లున్నవాడు, బభ్రుః ... పాలకుడు, విశ్వయోని ... సృష్టి యంతటికీ జన్మస్థానం, శుచిశ్రవాః ... పరిశుద్ధమైన చెవులున్నవాడు, అమృతః ... మరణము లేనివాడు.

భావము : దుఃఖములను హరించి శుభములిచ్చువాడు, వేలాది శిరస్సులున్నవాడు( సృష్టిలోని చరాచర జీవులన్నిటా ఉంటూ అన్నీ తానే ఐన వాడు గనుక వేలాది చెవులున్నట్లే కదా), మంచి పాలకుడూ, మరణములేని(అమృతం అనగా సుర) తాగిన వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)



27. నశ్వరుండు కాడు నయముగా జేర్చునూ

జ్ఞాన గమ్యమునకు గమము చూపు

తాపసులలొ జూడ తనకు సాటియె లేదు

వందనాలు హరికి వంద వేలు !!

(అర్థాలు : శాశ్వత స్థాణుః ... శాశ్వతంగా నిశ్చలమైన (నాశము లేని)వాడు, వరా రోహః ... జ్ఞాన మార్గము చేర్చువాడు (గమము అంటే దారి అనే యర్థమూ ఉన్నది కదా) లేదా తానే గమ్యం అయినవాడూ కావచ్చు, మహా తపాః ... అద్భుతమైన జ్ఞానం కలవాడు. తాపసి అంటే తాప త్రయాలను జయించిన మునీశ్వరుడు కదా.

భావము : శాశ్వతమైన వాడు, దేనికీ చలించని వాడు, జ్ఞానానికి చివరి మెట్టు లేదా దారి చూపేవాడు, తాపసులలో యెన్న దగిన వాడు లేదా విశేష జ్ఞానము కలవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)



----------------------------

శ్లో. సర్వగః సర్వ విద్భానుః విష్వక్సేనో జనార్దనః

వేదో వేద విదవ్యంగో వేద విద్కవిత్కవిః !!14!!

-----------------(నామాలు ... 123...132)

28. లేని చోటు లేదు, జ్ఞానులలో జ్ఞాని

ఎదురు లేదు తనకు, ముదము గూర్చు

వేద రూపు వాడె, వేద విద్వాంసుడే

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : సర్వగః ... సర్వత్రా జొచ్చుకుని పోగలవాడు, సర్వ విద్భానుః ... సర్వమూ తెలిసిన వాడు, విష్వక్సేనః ... దేవతలు సైతం తేరిపార జూడలేని వాడు, జనార్దనః ... ఆనందింపజేయువాడు, వేదః ... వేద రూపుడు, వేద విత్ ... వేదములను ఔపోశన పట్టినవాడు.

భావము : గమ అంటే వెళ్ళడం, ముందుకు సాగడం, (చొచ్చుకుపోవడం కూడా కావచ్చు) కదా...ఆ ప్రకారంగా సర్వగ అంటే అంతటా తానై ఉన్నవాడు అనుకోవచ్చు, స్రవమూ తెలిసిన వాడు (జ్ఞానులకెల్లా మహా జ్ఞాని), దేవతలను సైతం అవలీలగా ఎదుర్కోగలవాడు, గొప్ప శక్తిమంతుడు, జనులకు ఆనందం కలగజేయువాడు, వేదరూపుడూ, వేదాలను ఔపోశన పట్టిన వాడూ ఐన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }









29. వ్యంగ కాడు, వాని యంగాలె వేదాలు,

వేద సారమంత విస్తృతముగ

ఎరుక గలిగి యెరుక బరచు కవి యతడె

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : అవ్యంగః ... అ + వి + అంగ ... వి అంగ కానివాడు అనగా ఏవిధమైన లోపాలు లేనివాడు, వేదాంగః ... వేదాలే అంగాలైనవాడు, వేదవిత్ .... వేదాల లోతుపాతులను క్షుణ్ణంగా తెలిసిన వాడు, కవి ... సర్వ ద్రష్ట.

భావము : ఏ విధమైన లోపాలు లేని మనోహరమైన రూపం గలవాడు, వేదాలే తన అంగాలు కాగా, వాటి లోతుపాతులు క్షుణ్ణంగా ఎరిగినవాడు, సర్వమూ తెలిసిన మునీశ్వరుడు(" నాన్ ఋషి కురుతే కావ్యం " ... అనే పెద్దల వాక్కును బట్టి కావ్యం వ్రాయగలవాడు అనగా కవి ఐనవాడు ఋషి తుల్యుడే ఇక్కడ ఆంగ్ల పాఠంలో కూడా కవిః అంటే మునీశ్వర అనే అర్థం కనబడుతూండటం గమనార్హం కదా!) అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు. }

------------------

శ్లో. లోకాధ్యక్ష, సురాధ్యక్షో, ధర్మాధ్యక్ష, కృతా కృతః

చతురాత్మా, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్రా, చతుర్భుజః !!15!!

--------------------------(నామాలు 133...140)

30. అధిపతె జగమునకు, అరసు నాకమునకు,

అరయ గల్పములకు నతడె బతియు,

కార్య కారణములు కనగ యాతనిలోనె

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : లోకాధ్యక్ష ... లోకాలకు అధిపతి, సురాధ్యక్ష ... స్వర్గాధిపతి, ధర్మాధ్యక్ష ... ధర్మాలకు అదినాథుడు, కృతా కృతః ... కార్య కారణ రూపుడు, వ్యక్తా వ్యక్త స్వరూపుడు.

భావము : లోకాలకు అధిపతి, స్వర్గానికి (నాకమునకు) అధినాథుడు(అరసు అంటే రాజు, ప్రభువు అనే అర్థాలూ ఉన్నాయి కదా), ధర్మాలకు( కల్పము అంటే న్యాయము, ధర్మము అనే అర్థాలూ ఉన్నాయి కదా) అధిపతి (పతి అంటే కూడా ప్రభువు అనే అర్థం ఉందికదా), వ్యక్తా వ్యక్త స్వరూపుడు(కృతము అంటే చేసినది, అకృతము అంటే చేయనిది...చేసేదీ చేయించేదీ వాడే . కనుక చేయించేటపుడు తాను అకృత రూపుడే కదా) అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.}

31. చనుగ జూడ చతురాత్మయై తానె

నాల్గు వ్యూహములతొ నయముగాను

నాల్గు కోరలుండు, నాలుగే భుజములు

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : .చతురాత్మా ... విభూతి చతుష్టయం, చతుర్ వ్యూహ ... నాలుగు వ్యూహాలు, చతుర్ దంష్ట్ర ... నాలుగు కోరలు, చతుర్భుజః ... నాలుగు భుజాలు.

భావము : పరమాత్ముడైన శ్రీహరి రజోగుణ స్వరూపమై సృష్టి కార్యక్రమంలో పరబ్రహ్మ, ప్రజాపతులు (కశ్యపాదులు), కాలము, సృష్టి, స్థితిలో విష్ణువు, మనువులు, కాలము, పాలన, తమోగుణ ప్రధానమైన లయములో రుద్రుడు, అగ్ని, కాలము, లయము...( దీనినే విభూతి చతుష్టయం అంటున్నారు)లై ప్రసిద్ధికెక్కుతున్నాడు(చను అంటే ప్రసిద్ధికెక్కు అనే అర్థమూ ఉంది కదా). ఇక నాలుగు వ్యూహాలంటే వాసుదేవ. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే వ్యూహాలు... (బహుశా ఆ అవతారాలే వ్యూహాత్మకం కావచ్చునేమో), నాలుగు కోరలంటే ... ధర్మార్థ కామ మోక్షములు, నాలుగు వేదాలు, చతురాత్మలూ, వ్యూహాలు... (వీటితోనే సందర్ఙానుసారం రక్కసి గుణాలను అణచివేస్తుంటాడా శ్రీహరి,) నాలుగు భుజాలు ... శంఖు, చక్ర, గదా, ధనువులు వీటిని ధరించడానికీ, జగత్తులోని తన భక్తులను భవసాగరం నుంచి దాటించడానికి తగినంతగా విశాలమూ, దృఢతరమూ అయిన భుజాలు... ఇన్ని విశిష్టతలున్న ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

---------------------

శ్లో. భ్రాజిష్ణు ర్భోజనం భాక్తాః సహిష్ణు ర్జగదాదిజః

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః !!16!!

----------------------------(నామాలు 141...150)

32. వెలుగులకును తానె వెలుగు నిచ్చుచు నుండు

భోజనంబు మరియు భోక్తఁ దానె

సహన శీలి యతడె, సకల సృష్టికి యాది

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : భ్రాజిష్ణు ... అద్వయ ప్రకాశకుడు (Light of Lights), భోజనం ... భుజింప దగిన వాడు(భోజ్యము), భోక్త...భుజించువాడు, సహిష్ణు ... సహనశీలి, జగదాదిజ ... జగత్తుకు ముందు నుంచీ ఉన్నవాడు.

భావము : సూర్య చంద్రులకు, అగ్నికి సైతం వెలుగు ప్రసాదిస్తూ తానే స్వయం ప్రకాశకుడైనవాడు (ఆంగ్ల భాష్యంలో కూడా Light of Lights అనే ఉన్నది కదా) , భుజింప దగిన వాడు లేదా భోజ్యము అనగా అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం (అలాగే సర్వత్రా ఆయనే ఉన్నప్పుడు ఫలాదులలోనూ ఉన్నట్లే కదా) కనుక భోజ్యమే, అంతే గాక, జ్ఞానేంద్రియాలకు జీవం(ఆహారం) తానే అంటాడు కనుక ఆ ప్రకారంగానూ శ్రీహరిని భోజ్యమనవచ్చునేమో కదా, కాగా ... ఫలం, తోయం, రకరకాల ఆహారాలను నివేదిస్తుంటాం కనుక ఆయనను భోక్తగానూ వ్యవహరించ వచ్చు. భక్తులు యెన్ని ఎలా మాట్లాడినా సహనంతో ఉంటూ వారిని కాపాడుతుంటాడు కనుక సహిష్ణువే అనవచ్చు. సృష్టికి పూర్వం నుంచీ ఉన్నవాడు గనుక జగదాదిజ అనీ వ్యవహరించ బడుతున్న ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

33. అనఘు డనగ నతడె, అద్భుత విజయుడు,

జయమె శీల మాయె, జగతికంత

కారకుండు, మరియు కనగ పునర్వసు

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : అనఘ .. పాపరహితుడు, విజయ ... శ్రేష్ఠమైన విజయం సాధించినవాడు, జేతా ... జయుడు (సంస్కృత నిఘంటువు ప్రకాంర జయశీలి), విశ్వయోని ... విశ్వం పుట్టుకకు కారణమైనవాడు, విశ్వం వల్లనే పుడుతున్నవాడు. పునర్వసు ... పదే పదే పుడుతున్నవాడు, క్షేత్రజ్ఞుడవుతున్నవాడు.
భావము : కర్మలు చేయనివాడు, వాటి ఫలాలు కూడా అంటని వాడు గనుక పాపాలు పుణ్యాలు కూడా అంటని వాడే కదా, అసురులపై అద్భుతమైన విజయాలు సాదించిన వాడు, అంతేగా పార్థుని ద్వారా కూడా ధర్మ సంస్థాపనలో విజయం సాధింపజేసినవాడు(ఆంగ్ల పాఠం ప్రకారం విజయుడంటే పార్థుడే అనీ ఉంది) చెడుపై గెలుపు సాధించడమే తన తత్త్వంగా గలవాడు (సంస్కృత నిఘంటువులో జేతా అంటే జయస్వభావుడు అనే అర్థం ఉన్నది కదా), విశ్వం పుట్టుకకు కారకుడు, మరో పాఠం ప్రకారం విశ్వమే తన పుట్టుకకు కారణమైన వాడు, పదే పదే పుడుతూ( ఏదో ఒక జీవరాశిలో వసించి) యుండేవాడు (సంభవామి యుగే యుగే అన్నది ఆయనే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }

------------------------

శ్లో. ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘః శుచి రూర్జితః

అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః !!17!!

----------------------------------(నామాలు 151 ... 162)

34. ఇంద్రుడికిని చూడ నితడె సోదరుడుగా

అనుజుడైన మరియు నధికుడైన !

వటువె, యంబరమున వరలె నమోఘుడై

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : ఉపేంద్ర ...ఇంద్రునికి సోదరుడు లేదా ఇంద్రునికంటే అధికుడు (అర్థాలు రెండు రకాలుగానూ ఉన్నాయి కదా), వామన ... వామనావతారుడు, ప్రాంశుః ... ఉన్నతమైన శరీరం కలవాడు, అమోఘః ... గొప్ప ప్రయోజనాత్మకమైనవాడు.

భావము : ఇంద్రుని సోదరుడు, ఇంద్రుని కంటే అధికుడు అని రెండు అర్థాలు స్ఫురిస్తున్నాయి. (వీటిలో సోదరుడు అనే అర్థమే తీసుకుంటే వామనుడే అనే పాఠాంతరమూ కనిపిస్తున్నది.) వామనావతారుడు... దీనికే మరో భాష్యం ... అహంకారం అణగదొక్కేవాడు (బలి చక్రవర్తి విషయంలో ఇది నిజమయినది కదా), ఉన్నతమైన శరీరం కలవాడు ... (వామనావతారంలో ... " ఇంతింతై... నభోరాశి కంతై "....అనే పద్యం ఈ సందర్భాన మననార్హం కదా), గొప్ప, అనూహ్య ప్రయోజనం కలిగించువాడు ...( శిక్షించినా దాని పర్యవసానం జ్ఞానం చేకూర్చడమే కదా ) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.

35. వంక పెట్టలేము, వంక తీయు తానె,

ఎదురు లేని శక్తి, యెరుక మిన్న,

సర్వమెపుడు తానె సంగ్రహించుచు నుండు

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : శుచిః ... పరిశుద్ధుడు, భక్తులనూ పరిశుద్ధులుగా చేయువాడు,

ఊర్జితః ... ఎదురు లేని శక్తి గలవాడు, అతీంద్రః ... ఇంద్రుని మించిన జ్ఞాన బలం కలవాడు, సంగ్రహః ... సర్వమూ తనలో లీనం చేసుకునేవాడు.

భావము : తాను పవిత్రంగా ఉంటూ,తనను నమ్మి కొలిచిన వారిని పావనులుగా మలచేవాడు, ఇంద్రుని మించిన (జ్ఞాన) బలం గలవాడు, ప్రళయ కాలమున సర్వమూ తనలో లీనం చేసుకునేవాడు( ఒక్కచోటకు చేర్చి సం గ్రహించేవాడు) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }

36. సృష్టి కర్త తానె, సృష్టిలో యాదరువు

కచ్చుకొనడు, తానె కట్టుబాట్లు

పెట్టుచుండ గలడు, పిదప యముడు తానె

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : సర్గ ... సృష్టి కర్త, ధృతాత్మా ... ఆత్మలకు ఆధారము, నియమ ... నిమాలు నిర్దేశించువాడు, యమ ... యముడు.

భావము : సృష్టి చేసేది తానె, ఆ కార్యక్రమంలో గానీ, స్థితి, లయాలలో గాని తానుగా ఎవరిపై ఆదారపడని సర్వస్వతంత్రుడు( ఆదరువు అంటే ఆధారము, కచ్చుకొనుట అంటే అపేక్షించడం లేదా స్వీకరించాలనుకోవడం), వివిధ జీవరాశులను, దేవతలను సైతం తానే సృష్టిస్తూ వారికి తగిన పదవులూ, విధి విదానాలూ నిర్దేశించవాడు, వాటిని ఉల్లంఘిస్తే తగిన రీతిలో శిక్షించేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)

------------------------

శ్లో. వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః

అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహా బలః !!18!!

-----------------------------(నామాలు 163 ... 172)

37. తెలియ దగిన వాడు, తెలిసిన వాడెగా

యోగి పుంగవుండు, యాగ త్రాత,

అతడె మాధవుడును యతడెగా యమృతము

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : వేద్యః ... తెలుసుకోదగినవాడు, వైద్యః ... విద్యలన్నీ తెలిసినవాడు, సదాయోగిః ... యోగిపుంగవుడు, వీరహా ... ధర్మరక్షకుడు, మాధవః ... లక్ష్మీపతి మరియూ విద్యాపతి, మధుః ... అమృతము.

భావము : తన (తత్త్వం) గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకో (వలసిన) దగిన వాడు, విద్యలన్నీ తెలిసిన వాడు (వైద్యమే అనుకున్నా మానసిక రుగ్మతలను ఆధ్యాత్మిక పరమైన చికిత్సతో నయం చేసేవాడు అనుకోవచ్చు కదా) యోగ విద్యలన్నీ యెరిగినవాడు (జీవాత్మ, పరమాత్మతానే అయి స్వస్వరూపాన ఉండేవాడు), ధర్మరక్షకుడు (ధర్మానికి యాగము అనే పర్యాయ పదమూ, రక్షకునికి త్రాత అనే పర్యాయ పదమూ ఉన్నాయి కదా), లక్ష్మీ (మా అంటే లక్ష్మియే కదా) పతి , పరమేశ్వరునికి చెందిన పరా విద్యను కూడా మా అంటారని మరొక పాఠం. కనుక ఆ ప్రకారంగా కూడా మాధవుడే, కాగా, భక్తుల పాలిటి అమృతమయుడై వ్యవహరించేవాడు అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు.)

38. ఇంద్రియములకెపుడు నితడు గన్పట్టడు

మాయలకును పెద్ద మాయ యతడె !

భక్త జనుల గాచ బర్వులెత్తు, బలుడు

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : అతీంద్రియః ... ఇంద్రియములకు గ్రాహ్యం కానివాడు, మహా మాయః ... మాయలకే మాయావి, మహోత్సాహ ... ఉత్సాహం ఉరకలు వేసేవాడు, మహాబలః ... ఎదురులేని మహా బలసంపన్నుడు.

భావము : సాదారణ ఇంద్రియాలకు గోచరించని వాడు, (ఆత్మ జ్ఞానంతో మాత్రమే దర్శనమీయగలవాడు), మాయామేయమైన ఈ చరాచర జగత్తు నంతటా తన మాయలనే ప్రసరించిన వాడు (తన లీలలు తెలియనివ్వరానివాడు), భక్తులను రక్షించడానికి సదా ఉత్సాహం ఉరకలు వేసేవాడు(సిరికిం జెప్పడు.... పద్యం ఈ సందర్భాన మననార్హం కదా), ఎదురులేని మహా బలసంపన్నుడైన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. )

-------------------

శ్లో. మహాబుద్ధి ర్మహా వీర్యో మహాశక్తి ర్మహా ద్యుతిః

అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రి ధృక్ !!19!!

-----------------------------(నామాలు 173 ... 180)

39. జ్ఞాని యనగ నతడె, గాంచ త్రిమూర్తుల

శక్తి యున్న మేటి, శక్తి యుక్తి

మెండు గానె యుండె నిండుగా వెలుగుగా

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : మహా బుద్ధిః ... మహా జ్ఞాని, మహా వీర్యః ... సృష్టి స్థితి లయ శక్తి సంపన్నుడు, మహా శక్తిః ... మహిమాన్విత శక్తి పరుడు, మహా ద్యుతిః ... గొప్ప ప్రకాశం గలవాడు.

భావము : సకల కళా వల్లభుడైన మహా జ్ఞాని, త్రైమూర్త్యాత్మకమైన అంటే సృష్టి, స్థితి, లయ కార్యాలను తానే అయి నిర్వహించగల సామర్థ్యము గలవాడు, మహిమాన్విత శక్తి (ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి) సంపన్నుడు, సూర్య చంద్రులను, అగ్నిని సైతం మించిన పరమాద్భుతమైన తేజస్సు గలవాడు ఐన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. )

40. నిర్వచింప లేము, నిథులకె నిథి తాను

అంచనాకు రాదు అతని యునికి

వీపుపైన కొండ, వేలుపై గిరినెత్తె

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : అనిర్దేశ్యవపుః ... నిర్వచనాలకు అందని రూపం గల వాడు, శ్రీ మాన్ ... ఐశ్వర్య వంతుడు, అమేయాత్మా ... అంచనాలకు అందని ఉనికి గల ( సర్వత్రా వ్యాపించి ఉండు) వాడు, మహాద్రి ధృక్ ... గొప్ప పర్వతాలను పైకెత్తినవాడు.

భావము : సాధారణ నిర్వచనాలకు అందని రూప సంపద గలవాడు, గొప్ప ఐశ్వర్య వంతుడు (శుభప్రదుడు కూడా), మహా పర్వతాలను అవలీలగా ఎత్తి ధర్మాన్ని, ఆశ్రిత భక్త గణాలను ఆదుకున్నవాడు( కూర్మావతారంలో వీపుపై మందర గిరినీ, కృష్ణావతారంలో వేలుపై గోవర్ధనమునూ ఎత్తిన వాడు కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. )



------------------------

శ్లో. మహేష్వాసో మహీ భర్తా శ్రీనివాసః సతాంగతిః

అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః !!20!!

-----------------------------(నామాలు 181...188)

41. కార్ముకము ధరించు, కాశ్యపి నాథుడు,

లక్ష్మిపతియె, చూడ లక్షణముగ

సాధు సంతులకును శ్రయము నిచ్చుచునుండు

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : మహేష్వాసః ... మహేష్వాసో అంటే గొప్ప బాణప్రయోగము కలవాడు, మహీ భర్తా ... మహీభర్త అనగా భూమిని భరించువాడు, శ్రీనివాసః ... లక్ష్మీపతి, సతాంగతిః .. సాధుసంతులకు సమాశ్రయం కల్పించువాడు.

భావము : సారంగమను గొప్ప విల్లు (మహా ఇష్వాసం అనగా కార్ముకము అనగా విల్లు అనే యర్థాలూ ఉన్నవి గదా) ధరించిన,మరియూ దానిని గొప్పగా ప్రయోగించగల వాడు(ఎంత గొప్పగా బాణాలు ప్రయోగించగలడో, రామాయణంలో మనకు కొన్ని చోట్ల కనబడుతుంది. ), భూమికి భర్తయై సదా కాపాడు వాడు(కాశ్యపి అంటే భూమి అనే అర్థమూ ఉన్నది కదా), లక్ష్మి నివాసముగా గలవాడు లక్ష్మీపతి, సాధు సంతులకు సజ్జనులకు కూడా ఆశ్రయమిస్తూ తనలో కలుపుకునేవాడు(శ్రయము అన్నా ఆశ్రయము అన్నా ఒకటే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)

42. ఎదురు లేని వాడె, యదితిజుల వరుడు

గోవు నెపుడు గాచు గోపతిగను

వేదములను కాయు వేద వేద్యుడతడె

వందనాలు హరికి వంద వేలు !!

{అర్థాలు : అనిరుద్ధః ... ఎదురు లేనివాడు, సురానందః ... దేవతలకు ఆనందము చేకూర్చువాడు, గోవిందః ... గో సంరక్షకుడు, గోవిదాం పతిః ... వేద సంరక్షకుడు.

భావము : తన కార్యక్రమాలలో ఏ విధమైన అడ్డంకులు ఎదురుకానివాడు, దేవతలకు (అదితిజులు అనగా అదితి పుత్రులే కదా) ఆనందం చేకూర్చేవాడు (వరుడు అనగా వరింపదగినవాడు... కోరదగిన వాడు), గోవు అంటే భూమి, వాక్కు, ఆవు, వేదములనే నానార్థాలున్నవి కనుక వాటిలో దేనికైనా అధినాథుడు, గోవిదాంపతి అనగా వేదములు తెలిసినవారిని రక్షించువాడు అని, వేదములు తెలిసినవారిలో మేటి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)

------------------------

శ్లో. మరీచి ర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః

హిరణ్య నాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః 21

----------------------------(నామాలు 189 ... 197)

43.కాంతి మంతుడతడు, కటుకుల దమనుడె

హంస యనగవచ్చు, నరయ రెండు

ఆత్మ లన్న నతడె, ఆదిశేషుడు గాగ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : మరీచి ... కాంతిమతుడు, దమన .. దండించువాడు, తద్వారా దారిలో పెట్టువాడు, హంస ... జీవాత్మ, మరియూ పరమాత్మ, సుపర్ణ ... అందమైన రెక్కలు అవియే ఆత్మ పరమాత్మ, భుజగోోోత్తమ ...అనంతుడు.

భావము : సూర్య చంద్రులకు సైతం వెలుగు నందించే కాంతిమంతుడు, కటుకులను అనగా దుష్టులను దండిస్తూ, జన హృదయాలలోని చెడు గుణాలను పారద్రోలి దారిలో పెట్టేవాడు, ప్రాణులలో జీవము అయిన వాడు( ప్రాణం పోగానే హంస యెగిరిపోయందనడం మానవ నైజం కదా) లేదా " అహం బ్రహ్మ" అనీ అనుకోవచ్చు అలా అనుకున్నా బ్రహ్మమే జీవం కదా, జీవాత్మ పరమాత్మ అనే రెండు అందమైన రెక్కలున్నవాడు( ఆ రెక్కలే భక్తి, జ్ఞానం అనీ వాటిని చాపుతూ తన భక్తులను కాపాడుతుంటాడని మరొక భాష్యం), భుజంగాలలో అనగా పాములలో ఎన్నదగినవాడు అంటే ఆదిశేషుడు లేదా అనంతుడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. )

44. పసిడి యైన నాభి, పరమహంస యతడె,

పద్మమంటి నాభి, పరమ పురుష

స్వామి యతడె చూడ సకల జగతికిని

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : హిరణ్య గర్భ ... బంగరు నాభి, సుతపా ... ఉత్తమ తాపసి, పద్మనాభ ... పద్మము వంటి నాభి గలవాడు, ప్రజాపతి ... ప్రజలకు అధిపతి.
భావము : బ్రహ్మ దేవునికి జన్మనిచ్చిన స్వర్ణమయమైనటువంటి నాభి గలవాడు, తాపసులలో మిన్నయైనవాడు అనగా పరమహంసలాంటివాడు, పద్మము వంటి నాభి గలవాడు, సకల జగత్తుకు (ప్రజలకు) అధినాథుడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. )



------------------------

శ్లో. అమృత్యుః సర్వ దృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః

అజో దుర్మర్షణః శాస్తా విశృతాత్మా సురారిహా 22

-----------------------------------( నామాలు 198 ... 208 )







45. మరణ మెరుగ డతడు, మహిని సర్వము జూడు,

సటల మెకమె చెడుగు సంహరింప

కర్మ ఫలము లెంచి కలిగించు నాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అమృత్యు ... మరణం లేనివాడు, సర్వ దృక్ ... సర్వమూ వీక్షించువాడు, సింహ ... సంహారము చేయువాడు, సంధాతా ... సంధాన కర్త,

భావము : మరణం అనేదే లేనివాడు, మహిని అంటే భూమి అనగా సృష్టిలోని అణువణువూ నిశితంగా పరిశీలించేవాడు, సటల మెకము అంటే సింహం అనగా మృగరాజు కనుక రాజు మాదిరే జీవులలో చెడుగును తొలగించి ధర్మమార్గాన నడిపిస్తాడు, జీవులకు వారు చేసే కర్మలను బట్టి తగిన ఫలాలను అందించేవాడు(జీవులనూ కర్మ ఫలాలనూ అనుసంధానం చేసేవాడు) అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు. )

46. భక్త గణము నెపుడు బాయకుండెడివాడు,

నిశ్చలుండె యెపుడు నిజముగాను

జేజె పెద్ద యతడు జితుడు కాడెప్పుడూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సంధిమాన్ ... కలసి యుండువాడు, స్థిరః ... స్థిరమైనవాడు, నిశ్చలుడు, అజః ... పుట్టుక లేనివాడు(సృజన కర్త అనగా బ్రహ్మ), దుర్మర్షణ ... ఎదురులేని, అంతము చేయలేని వాడు.

భావము : సంధి అంటే కలిసి ఉండటం ఆ ప్రకారంగా భక్తులతో అవినాభావ సంబందం కలిగి ఉండువాడు, ఎప్పటికీ స్థిర(నిశ్చల)త్వం కలిగి ఉన్నవాడు, అజ అంటే పుట్టుక అనేదే లేని బ్రహ్మ దేవుడే (చతుర్ముఖుడికి పర్యాయపదమే జేజె పెద్ద అంటే వేల్పులలో పెద్దవాడు అని అర్థం కదా), రాక్షసులతో సహా ఎవరి చేతులలోనూ ఓటమి పొందని (నాశములేని) వాడు అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు.}









47. శాసకుండు తానె సకల జగత్తుకూ

శ్రవణపేయమైన చరితలెన్నొ

దేవతలకు వైరి నోవు తొలగ జేయు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : శాస్తా ... శాసకుడు, విశృతాత్మ ... వినసొంపైన లేదా విస్మయకరమైన గాథలున్నవాడు లేదా ప్రశస్తమైన ఆత్మ గల వాడు, సురారిహా ... దేవతల శత్రువులకను సంహరించువాడు.

భావము : సకల జగత్తుకూ ప్రభువుగా శాసకుడై ఆలనా, పాలనా చూచువాడు, వినసొంపైన లేదా విస్మయ కరమైన గాథ(దశావతారాల వంటివి)లున్నవాడు, మరొక అర్థంలో ప్రశస్త మైన ఆత్మ గలవాడు, దేవతలకు శత్రు బెడద(నోవు అంటే బెడద లేదా బాధ) తొలగించువాడు అయిన ఆ శ్రీహరికి శతసహస్ర వందనాలు. }

------------------------

శ్లో. గురు ర్గురుతమో దామ సత్యః సత్య పరాక్రమః

నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీః !!23!!

---------------------------------- ( నామాలు 209 ... 217)

48. ఆత్మ విద్య నేర్పు, నసలైన గురువాయె

జీవి కెపుడు నదియె చివరి యిల్లు

సత్య రూపుడతడె, సత్య పరాక్రమ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : గురు ... ఆత్మ విద్యా బోధకుడు, గురుతమ ... గురువులకే గురువు, ధామ ... ఇల్లు, ఆరామం, సత్య ... సత్యరూపుడు, సత్య పరాక్రమ ... నిజ నిరూపణలో పరాక్రమవంతుడు.

భావము : ఆత్మ (ఆధ్యాత్మికమైన కూడా కావచ్చు) విద్య నేర్పువాడు, గురువులకే గురువైనవాడు, ఉత్తమ జీవులకు అసలైన చివరి గమ్యం (ఆయన నిలయమే ....కదా), సత్యమే తానైన వాడు, ఆ విషయం నిరూపించడంలో నిజమైన పరాక్రమం గలవాడు ( ప్రహ్లాద గాథ తెలియజెప్పినదిదే కదా) అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు. }

49. తెరచి యుంచు కనులు, తెరవడే నాటికీ

వాడనట్టి మాలె వీడకుండు

వాక్కునకును బతియె వదల డుదారత

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : నిమిష ... మూతబడిన కనులు, అనిమిష ... సదా తెరచి యుండు కనులు, స్రగ్వి ... పూమాల ధరించినవాడు, వాచస్పతి రుదారధీ ... ఉదారహృదయుడైన వాక్పతి (వాచస్పతి + ఉదారధీ).

భావము : ఆలోచనా మగ్నుడై, అంతర్ముఖుడైన వాడు (అలాంటి వాని కనులు ఎప్పుడూ మూతబడి ఉన్నట్లుగానే కనిపిస్తాయి...కదా), భక్తులనూ, విశ్వాన్నీ కాచుకుంటూ ఉండాలనే సదాశయంతో ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండువాడు( అలాంటి వాడు రెప్ప పాటు కాలం కూడా కనులు మూయడు ....కదా), ఎన్నటికీ వాడిపోని వైజయంతీ మాలను మెడలో ధరించి యుండువాడు(వనమాలి అనడం అందుకే....కదా), ఉదారహృదయుడైన వాక్పతి(బృహస్పతీ కావచ్చు) యైన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. అగ్రణీ ర్గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః

సహస్ర మూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్ర పాత్ !!24!!

----------------------------------- (నామాలు 218 ... 227)

50. అగ్రగామి యతడె, యందర నడిపించు

నిక్కమైన కాంతి, నేయ మూర్తి

పంక్తి కతడె నేత, పంచ ప్రాణంబులూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అగ్రణి ... అగ్ర భాగాన నిలచి దారి చూపువాడు, గ్రామణి ... నలుగురినీ నడిపించు నాయకుడు, శ్రీమాన్ ... ఉన్నతమైన కాంతి గలవాడు, న్యాయ ... సత్యమైన జ్ఞానం అందించువాడు, నేత ... జగత్తును నడిపించేవాడు, సమీరణ ... జవనానికి కావలసిన పంచప్రాణాలు తానే అయినవాడు.

భావము : అగ్రభాగాన నిలచి అందరినీ మాయకు దూరంగా నడిపించువాడు, ధర్మరక్షణకై పరిశ్రమించే వారినందరికీ (సమీకరించి) నాయకత్వం వహించేవాడు}, దివ్యమైన తేజస్సు (శ్రీ అంటే కాంతి అనే అర్థమూ ఉన్నది కదా) కలవాడు, తన భక్తులయందు న్యాయ(నేయ అనేది కూడా న్యాయ అనే పదానికి పర్యాయమే కదా) దృక్పథము గలవాడు, జగత్తు అనే యంత్రాన్ని సవ్యంగా నడిపించేవాడు (పంక్తి అంటే పుడమి, జగత్తు అనే అర్థాలూ, తిరిగి జగత్తుకు సంసారం అనే అర్థమూ ఉన్నవి కదా), జీవికి అవసరమైన పంచ ప్రాణాలు, వాయువు కూడా తానే అయిన ఆ స్రీహరికే శత సహస్ర వందనాలు. }

51. వేయి శిరసులుండె, విశ్వానికే యాత్మ

వేయి కనులు లోక వీక్షణముకె

వేయి పాదములును విశ్వ శ్రేయస్సుకే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సహస్ర మూర్ధా ... వేయి శిరస్సులు, విశ్వాత్మ ... విశ్వానికే ఆత్మ, సహస్రాక్ష ... వేయి కనులు, సహస్ర పాత్ ... వేయి పాదాలు.

భావము : ప్రాణకోటులన్నీ తానే, తనవే అయినందున వేలాది కన్నులూ తనవే అయినవాడు, వేన వేల కన్నులతో విశ్వాన్ని పరిశీలిస్తూ ఉండేవాడు, వేనవేల పాదాలున్నవాడు...(ఒక భాష్యం ప్రకారం కన్నులు వీక్షణ మరియూ అవగాహనకూ, తదుపరి శిరములు తగిన ఆలోచనకూ, పాదాలు ఆ యొక్క కార్యాచరణకు ప్రతీకలు.) కనుకనే అతడు విశ్వానికే ఆత్మయై భాసిల్లుతున్నాడు. అట్టి శ్రీహరికే శతసహస్ర వందనాలు. }

--------------------------------------------

25.ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః

అహః సంవర్తకో వహ్ని రనిలో ధరణీ ధరః !!25!!

------------------------------(నామాలు ... 228 ... 235)

52. మాయనందె జగతి మరి మరి దిప్పునూ

తాక బోడు మాయ తాను, చూడ

మాయ కింద నుండి మరి గోచరింపడూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఆవర్తన ... సంసార చక్రం తిప్పేవాడు, నివృత్తాత్మా ... ప్రపంచంతో సంబంధం లేనివాడు, సంవృత ... మాయలో కప్పబడిన వాడు.

భావము : సృష్టినంతటినీ మాయలో ముంచి జననం, వృద్ధి, వార్థక్యం, వ్యాధి, మరణం ... తిరిగి జననం ప్రసాదిస్తూ సంసార చక్రం(వలయంలో) తిప్పేవాడు, మాయతోనే కప్పబడి ఉండి, తాను ఏ మాయకూ అందకుండా జగతికి అంత తేలికగా కన్పట్టని ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

53. దౌష్ట్యములను తానె దండించు, వెలుగుతో

దినము నడుపుచుండు, దివ్య వహ్ని,

ప్రాణ వాయువతడె, ప్రాణేశుడవనికీ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సంప్రదన ...సంహారకుడు, అహ సంవర్తక ... సూర్యుని మించిన కాంతితో రోజులను (కాలాన్ని) దేదీప్యం చేయువాడు, వహ్ని ... హోమకుండపు అగ్ని, అనిల ... వాయువు, (ప్రాణం కూడా), ధరణీ ధర .. భూమిని ధ(భ)రించువాడు.

భావము : జీవులలోని రాక్షసత్వాన్ని అనగా దుష్టత్వాన్ని పరిహరించి (మర్దించడం అంటే చంపడమే కదా) దారిన పెట్టువాడు, సూర్యుని మించిన కాంతితో కాలాన్ని (జగతిని కూడా అనుకోవచ్చు) నడిపించువాడు, యజ్ఞ యాగాల సందర్భాన హోమ కుండాలలో వ్రేల్చే పవిత్రమైన అగ్ని వంటివాడు, జీవులకు ప్రాణవాయువు, భూమిని భరిస్తూ, అవసర సమయాలలో ధరించడం కాపాడుతున్న వాడు(భర్త అంటే ప్రాణేశుడు అనగా సర్వకాల సర్వావస్థలందు భారం భరిస్తూ కాచేవాడే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ దృగ్విశ్వ భుగ్విభుః

సత్కర్తా సత్కృతః సాధు ర్జహ్ను ర్నారాయణో నరః !!26!!

----------------------------- (నామాలు 236 ... 246)

54. దండనందె చూపు దయగల హృదయమూ

రాగ, విరస రహిత రవణ మాత్మ

విశ్వమునకు పాదు, విశ్వమే సంగమం

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సుప్రసాద ... తేలికగా అనుగ్రహించువాడు, ప్రసన్నాత్మ ... ప్రసన్నమైన ఆత్మ గలవాడు, విశ్వ దృక్ ... విశ్వానికి ఆధారం, విశ్వ భుక్ ... విశ్వాన్ని విలీనం చేసుకునేవాడు.

భావము : ఎలాంటి వారినైనా కొద్దిపాటి భక్తి లేదా నామ స్మరణతోనే కరిగి కైవల్యము చేర్చువాడు( కంస, పూతన, శిశుపాలాది దుష్టుల వృత్తాంతాలు తెలియజేస్తున్నదీ ఇదే కదా), రాగ ద్వేషాలు లేకుండా అందరి పట్లా సమానమైన ప్రేమ చూపే గొప్ప ఆత్మ గలవాడు (రవణము అంటే గొప్ప, కాంతిమంతమైన అనే అర్థాలూ ఉన్నాయి కదా) చిరు భక్తికే ప్రసన్నమయ్యేవాడు, విశ్వానికి ఆధారమైన(పాదు అంటే ఆధారము అనే అర్థమూ ఉన్నది కదా) వాడు, ప్రళయ కాలంలో సృష్టినంతటినీ తనలో విలీనం(సంగమం) చేసుకునే వాడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }

55. విభుడె కాని దోచు విబుధ జనులకును

రూపులెన్నొ, కాదు రూపులన్ని!

సత్కరించుచుండు సత్కారమే పొందు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : విభుః ...బ్రహ్మ, సత్కర్త .. సత్కరించువాడు, సత్కృత ... సత్కారము పొందువాడు.

భావము : విభుడే అనగా బ్రహ్మయే కాని, విబుధ జనులకు అనగా తనను కొలిచేవారికి కోరిన రూపంలో కనిపించే అనేకానేక రూపాలున్నవాడు, సాధు సజ్జనులైన భక్తులను సమాదరించువాడు, వివేకశీలురు, యోగ్యులునైన భక్తుల సత్కారము అనగా పూజాదికాలు అందుకునేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }

56. సాధు వర్తనుండు సజ్జనులకెపుడు

కర్మ బట్టి చూపు గమ్యమొకటి

తత్త్వమెరిగినపుడు ధామమే చేర్చుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సాధు ... సాధు వర్తనుడు, జహ్ను ... కర్మానుసారం తగిన ఫలాలు అందిచే చేర్చువాడు, నారాయణ ... నీడ, నీరు (తత్త్వ సారం) ఇచ్చువాడు, నర ... నాయకుడు.

భావము : సత్ప్రవర్తన కలవారి పట్ల సాధువర్తనుడై మెలగేవాడు, కర్మానుసారం జీవులకు తగిన ఫలాలను అందించువాడు, అనగా తత్త్వం యెరిగిన సజ్జనులకు ఉత్తమ యోగమున్నూ, కానివారికి తగిన దండన మార్గమున్నూ చూపేవాడు, ఆ ఫలాల వద్దకు చేర్చే నాయకుడు ( అంటే వీలైనంత వరకూ మంచి మార్గాన నడిపించి సత్ఫలాల వైపు దారిచూపేవాడే నరుడు) అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.

( నర నారాయణులు అంటే కృష్ణార్జులేననీ, ఋుషి ద్వంద్వ మనీ కూడా కొన్ని భాష్యాలున్నాయి. అదలా ఉంచితే నార శబ్దానికి నీరు అనే మరో అర్థం ఉంది. శ్రీ హరి నివాసమే నీరు కదా అదే పరమ దామము కూడా. ఇక స్వర్గ నరకాలు అంటే దండ, దండనలే. అవీ ఆయన సృష్టియే కదా..... తెలుసుకోవలసిన తత్త్వమూ అదే కదా).}

------------------------

శ్లో. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్ఛుచిః

సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః !!27!!

------------------------------ (నామాలు 247 ... 255)

57. ఎన్న నామ రూపు లెన్నొన్నొ యున్నవి

అప్రమేయుడతడె, యధికుడనగ

శాసనములు చేయు, శౌచమునకె గుర్తు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అసంఖ్యేయ ... లెక్కకు అందనివి, అప్రమేయం ... అంచనాలకు అందని, విశిష్ట ... మిక్కిలి గోప్ప, శిష్ట కృత్ ... శాసనములు చేయు, శుచి ... శుభ్రమైన.

భావము : అనంతమైన నామ రూపాలు గలవాడు, (కనుకనే) సాధారణ కొలతలూ, ప్రమాణాలతో నిర్వచింప సాధ్యం కానివాడు, ఉన్నతులలో కెల్లా ఉన్నతమైన(గొప్ప)వాడు, జీవులకు విధి విధానాలు నిర్దేశించువాడు, నిర్మలుడు, నిరంజనుడు( శుచి, శౌచము సమానార్థక పదాలే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }



58. పూర్ణ కాముడతడు, పూర్తి సిద్ధిని పొందె

ఫలములందజేయు భక్తులకును

సకల సిద్ధులకును సాదన మాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సిద్ధార్థ ... పురుషార్థములన్నియూ సాధించినవాడు, సిద్ధి సంకల్ప ...సంకల్ములన్నియు సిద్ధింపజేసుకున్నవాడు, సిద్ధి ద ... ఫలములిచ్చివాడు, సిద్ధి సాధన ... సిద్ధి పొందుటకు సాధనము.

భావము : ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థములనూ పూర్తిగా స్వంతం చేసుకున్నవాడు, తన సంకల్పములన్నియూ తానుగా సిద్ధింపజేసుకున్నవాడు, సిద్ధి అనగా కర్మఫలములు ద అనగా ఇచ్చువాడు, సిద్ధి పొందుటకు తానే సాధనమైనవాడు అనగా ఆయనను త్రికరణ శుద్దిగా నమ్మి కొలుచుట ద్వారానే సిద్ది పొందగలుగునట్లు చేయువాడు ... అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. వృషాహీ వృషభో విష్ణుర్వృష పర్వా వృషోదరః

వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతి సాగరః !!28!!

--------------------------(నామాలు 256 ... 264)

59. పనులు చూపుచుండు, ఫలితాలనందించు

సకల శుబములిచ్చు, సర్వ వ్యాపి

ధర్మ పర్వములతొ దరిజేర్చు జనులను

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : వృషాహీ ... కర్మలను నియంత్రిస్తూ, ఫలితాలు నిర్దేశించువాడు, వృషభ ... శుభాలిచ్చువాడు, విష్ణు ... సర్వ వ్యాపి, వృష పర్వ ... ధర్మ సోపానాలు.

భావము : కర్మలను నియంత్రిస్తూ ఫలితాలు నిర్దేశించువాడు(మరొక భాష్యం ప్రకారం వృష అంటే ధర్ము అహ అంటే దినము గనుక ధర్మబద్ధమైన దినముల ద్వారా సేవింపబడువాడు), నిష్కల్మష హృదయాతో కొలిచే భక్తులకు సర్వ శుభాలనిచ్చేవాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, భక్తులు తనను చేరడానికి బ్రహ్మ చర్యము,గృహస్థాశ్రమం,వాన ప్రస్థం, చివరగా సన్న్యాసము అను నాలుగు ధశల సోపానాలు సమకూర్చినవాడు అయన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

60. ఉదర మందె సృష్టి, యుద్ధరించు జనుల

వర్ధమానుడతడె, వదలకుండ

మాయ రూప మదయె, మరి వేదముల నిథి

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : వృషోదర ... వర్షించు ఉదరము, వర్ధన ... వృద్ధిచేయువాడు, వర్ధమాన ... ప్రపంచం రూపంలో వృద్ది పొందువాడు, వివిక్త ... మాయారూపి, శృతి సాగర ... వేదములకు నిథి.

భావము : మేఘాల మాదిరి ప్రళయ కాలమందు సృష్టి నంతటినీ తనలోకి తీసుకుని తిరిగి సమయం రాగానే వర్షించేవాడు(మరొక భాష్యం ప్రకారం వృషా అంటే ధర్మాలు గనుక ధర్మాలను తన కడుపులో పెట్టుకుని కాపాడేవాడు అనీ అనుకోవచ్చు), తనను త్రికరణ శుద్ధిగా విశ్వసించి కొలిచేవారిని సర్వవిదాలా వృద్ధిలోకి తెచ్చేవాడు(మోక్షమూ అందించేవాడు), మాయా రూపుడై ఉండువాడు, వేదాలకు నిథి( సాగరమంటే జలనిథే అయినే కేవలమూ జలంతోనే కాదాగ, కరుణా సముద్రుడు అనే భావంలో తీసుకుంటే శృతి సాగరుడు గనుక వేదాలకు నిలయం అనుకోవచ్చు) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }

------------------------

శ్లో. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః

నైక రూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః !!29!!

------------------------------ (నామాలు 265 ... 274)

61. బాహువులును దృఢము, బహు దుర్ధరుండుగా

వేద విదుడు మరియు వేల్పు రేడు

సకల మిచ్చు తాను, సకలము తానెగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సుభుజ ... సుందరమైన మరియూ దృఢమైన భుజములు లేదా బాహువులు, దుర్ధర ... సహ్యము కానివాడు, భూమిని ధరించినవాడు, యోగ్యులకు సైతం అంత సులభంగా గ్రాహ్యము కానివాడు (రకాలుగా ఉన్నా భాష్యాలివి), వాగ్మి ... వేద జ్ఞానం తెలిసినవాడు, మహేంద్ర ... దేవేంద్రనునికన్నా అధికుడు, వసు ద ... సకలమూ ఇచ్చువాడు, వసు ... సకలమూ.

భావము : భక్తులకు ఆశ్రయమివ్వడానికీ, వారిని కష్ఠాల నుంచి కాచుకోవడానికీ తగినట్లుగా సువిశాలమూ, సుదృఢమూ అయిన భుజాలు గలవాడు, శతృ మూకలకు సహించరాని అనగా భరించరానివాడు, యో(గు)గ్యులకు సైతం సులభ గ్రాహ్యం కాని మేధస్సు గలవాడు, భూమిని ధ(భ)రించువాడు, వేదజ్ఞానం తెలిసినవాడు, సకలమూ తానై, భక్తులకు సకలమూ అందించేవాడు(వసు అంటే సకలము, ద అంటే ఇచ్చు....కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

62. ఏక రూపి గాడు, యెనలేని రూపసి,

ఇనుడి కిరణములకు నితడె సాటి

ఇందునికిని నైన యితడె శక్తిని యిచ్చు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : నైకరూపో ... ఒకే రూపం ఉన్నవాడు కాడు, బృహద్రూపి ... బ్రహ్మాండమైన రూపం గలవాడు(ఎనలేని అంటే సాటి లేని కదా), శిపివిష్ట ... సూర్య సమానుడు, ప్రకాశన ... సూర్య చంద్రులకు కూడా వెలుగునిచ్చువాడు.

భావము : అనేకానేక రూపాలున్నవాడు(రూపాలున్నట్లు తోచువాడు అనీ అనుకోవచ్చు కదా), బ్రహ్మాండమైన విశ్వాన్నే అదిగమించిన రూపం గలవాడు, తన కిరణాలతో నీటిని పీల్చివేయ గల సూర్యునితో సమానమైన తేజస్సు గలవాడు, సూర్య చంద్రులను సైతం తానే ప్రకాశింప జేస్తున్నవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. ఓజస్తేజో ద్యుతి ధరః ప్రకాశాత్మా ప్రతాపనః

ఋద్ధః స్పష్టాక్షరో మంత్ర శ్చంద్రాంశు భాస్కర ద్యుతిః !!30!!

---------------------------------- (నామాలు 275...282)

63. దీప్తి, కాంతి, ద్యుతియు తేజరిల్లెడి యాత్మ

కలిగి, తాపములనె కలగ జేయు

జ్ఞాన సంపదందు గణుతి కెక్కినవాడు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఓజస్సు ... పటుత్వం (దీప్తి పర్యాయ పదం కదా), తేజస్సు ... వెలుగు, ద్యుతి ... కాంతి, ప్రకాశాత్మా ... ప్రకాశవంతమైన ఆత్మ గలవాడు, ప్రతాపనః ... తాపము కలుగ జేయువాడు, ఋద్ధః .. వృద్ధి పొందినవాడు.

భావము : దుష్ట శక్తులనూ, దుర్గుణాలనూ అదుపు చేసి లోకాలను ప్రకాశవంతం చేయడానికి తగిన శక్తీ, దీప్తులతో ప్రకాశవంతమైన ఆత్మ కలిగి, సూర్యునితో సమానమైన వేడిమితో దుష్టులను తపింపజేస్తూ, సజ్జనుల పరితాపాలను ఉపశమింపజేసే వాడు, ధర్మ, జ్ఞాన, వైరాగ్యాది సంపదలకు అధిపతి అయిన ఆ శ్రీ హరికే శత సహస్ర వందనాలు.

(ఓజస్సు, తేజస్సు, ద్యుతి వీటన్నిటికీ స్థాయీ భేదంతో వెలుగు, కాంతి, వంటి పర్యాయ పదాలున్నాయి. వీటిలో ఓజస్సుకు పారమార్థి కంగా దీప్తి, ఉత్సాహం అనే అర్థాలున్నట్లు తెలుస్తున్నది.) }

64. ప్రణవ నాద మతడె, పరికింప మంత్రమే

జగతి స్వస్థ పరచు చందమామ

వెలుగులిచ్చు పగటి వేలుపు నాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : స్పష్టాక్షరః ... ఓం కారం, మంత్రః మననము చేయు(యవలసి)నది, చంద్రాంశు ...చంద్ర కిరణాలు, భాస్కర ద్యుతి ... సూర్య కాంతి.

స్పష్టమైన అక్షరానికి అంటే ఓంకార నాదానికి అసలైన రూపమే యతడు, మంత్రము అంటే మననము చేయవలసినది చేసేది.. అదీ ఆ శ్రీ హరి రూపమే కదా,తన చల్లని కిరణాలతో జగతిని స్వస్థత పరచే చందమామవంటి వాడు, అలాగే లోకానికి వెలుగులు ప్రసాదించే సూర్యునికీ తానే వెలుగులిచ్చేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.

(వేలుపు అంటే దేవుడు, ప్రభువు. భానుడు పగలు మాత్రమే కానవచ్చే వేల్పు. కనుక ఆయనను పగటి వేల్పుగానూ నిర్వచించవచ్చు గదా...}

శ్లో. అమృతాంశూద్భవో భానుః శశ బిన్దుః సురేశ్వరః

ఔషధం జగతస్సేతుః సత్య ధర్మ పరాక్రమః !!31!!

--------------------------- (నామాలు 283 ... 289)

65. ఇందునికిని తండ్రి, ఇనుడనగ నతడె

చెవుల పిల్లి వంటి సిద్మమొకటి

కలిగె యెదను మరి సురులకు తా నధిపతి

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అమృతాంశూద్భవ ... చంద్రుని (ఇందుడు అనిననూ చంద్రుడే కదా) ఉద్భవింపజేసిన వాడు, భాను ... సూర్యుడు, శశ బిన్దు ... కుందేలు వంటి మచ్చ గలవాడు, సురేశ్వర ... దేవాధిదేవుడు.

భావము : మొక్కలకు, ఫలాలకు జీవకారకమైన రసాన్ని సంస్కృతంలో అమృతం అంటారు. అదియునూ క్షీర సాగర మథనంలో జనించినదే కదా.. కాగా చంద్రుడు జనించినదీ క్షీర సాగర మథనంలోనే. శ్రీ మహా విష్ణువు సదా శయన రూపంలో నివసించేదీ (దర్శనమిచ్చేదీ) క్షీర సాగరంలోనే. కడకు తానే ఆ సాగరం అన్నదీ ఆయనే ... కనుక చంద్రుని తండ్రిగానూ ఆయనను అభివర్ణించవచ్చు కదా... కాగా, తానే చెప్పుకున్నట్లు సూర్య భగవానుడూ తానే. శశ బిన్దు అనగా కుందేలు వంటి మచ్చ. చెవుల పిల్లిని వాడుకలో కుందేలు అనీ, సంస్కృతంలో శశ అనీ వ్యవహరిస్తున్నాము కదా, అలాగే బిందు అంటే మచ్చ. దీనికే సిద్మము అనే పర్యాయ పదమూ ఉన్నది కదా. కనుక కుందేలు వంటి మచ్చ .. అదే శ్రీవత్సము... తన వక్షమున కలిగియున్నవాడు, దేవాదిదేవుడు (సురలకే ఈశ్వరుడు అంటే ప్రభువు, అధినాథుడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }

66. మమత రాగములనె మరిపించు యౌషధం

సాగరమును దాటు సాధనంబు

సర్వ సత్య, ధర్మ శక్తులాతని యందె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఔషధం ... మందు, జగత సేతు ... జగానికి వారథి, సత్ ధర్మ పరాక్రమ ... నిజమైన ధర్మ పరాక్రముడు.

భావము : మమత,రాగ, ద్వేషాలనే రుగ్మతల నుంచి కాపాడేది ..., సాగరం అంటే సంసార సాగరం దాటడానికి సేతువు అనగా వారథి కూడా నారాయణ స్మరణమే...( ఆ రెండూ ఆయనే ) కదా, కాగా, మరియూ సత్య, ధర్మ,జ్ఞాన, వైరాగ్యాది మహాశక్తులన్నిటికీ అధిపతి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. భూత భవ్య భవన్నాథః పవనః పావనో నలః

కామహా కామ కృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః !!32!!

---------------------------- (నామాలు 290 ... 299)

67. కాలమేది యైన కాంతుడు తానెయై

పావనంబు సేయు, పావనుండె !

ప్రాణమిచ్చు నగ్ని, పరిహరించును కోర్కె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : భూత భవ్య భవన్నాథః ... త్రి (భూత, భవిష్యద్వర్తమాన)కాలాధినాథుడు, పవనః ... పరిశుద్ధం చేసే వాయువు, పావనః ... పావనం చేయించేవాడు, అనలః ... అగ్ని, కామ హా ... కోర్కెలను హరించేవాడు.

భావము : భూత, భవిష్య ద్వర్తమానాలకు అధినాథుడు (కాంతుడు అంటే నాథుడనే అర్థమే స్ఫురిస్తుంది కదా... కాగా,, కొన్ని చోట్ల త్రికాల జ్ఞాని అనీ మూడు కాలాలందున్నూ ప్రార్థనలు పొందువాడనీ కూడా ఉన్నది), ధూళిని పోగొట్టే వాయువు మాదిరి హదయాన్ని ఆవరించి యుండే మాయను కడిగి పావనం చేసేవాడు, అలా పావనం చేసే వాయువుకు సైతం తానే శక్తి ప్రసాదించేవాడు (వాస్తవానికి మాయ కూడా తానే కదా అంటే ముందుగా మాయ అది గ్రహించి కొలిచేవారికి తానే పవనమూ, పవనానికి శక్తీ కూడా అయి హృదయాలను పవిత్రం చేస్తాడని అనుకోవచ్చు ... కదా), ప్రాణకోటికి అవసరమైన జవజీవాలు అగ్ని వల్ల కూడా అంటే వేడిమి వల్ల కూడా లభిస్తాయి గనుక అదీ తానే అయినవాడు, తుచ్ఛమైన ప్రాపంచిక కోరికలను పరిహరించేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

68. కామములను దీర్చు, కామనుడాతడు

భక్తులకును ప్రియుడు, భద్రముగను

బాళి తీర్చగలడు ప్రాణేశు డాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : కామకృత్ ... కోర్కెలు తీర్చువాడు, కాంతః ... దివ్య మంగళ స్వరూపుడు, కోమ ... కోరదగిన అనగా ప్రియమైనవాడు, కామప్రదః ... కోరికలను తీర్చు సాధన సంపత్తి, ప్రభుః ... ప్రభువు, ప్రాణేశుడు.

భావము : ధర్మబద్ధమైన కోరికలను మాత్రమే తీర్చువాడు, దివ్యమంగళ (అందమైన కామనుడు అంటే అందగాడు అనే అర్థమూ ఉన్నది కదా) స్వరూపము గలవాడు, భక్తులందరికీ ప్రియమైనవాడు అనగా ఆరాధ్యుడు, కోరిక(బాళి) తీరడానికి తగిన భక్తి, జ్ఞానములను అందించు వాడు (వాస్తవానికి అవీ తానే) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. యుగాది కృత్యుగావర్తో నైకమాయో మహాశనః !

అదృశ్యో వ్యక్త రూపశ్చసహస్ర జిదనంత జిత్ !! 33 !!

---------------------------- (నామాలు 300 - 307)

69. యుగములకును గర్త, యుగముల కావర్త

మాయ జేసి చూపు మహిమలెన్నొ

సంలయమున దానె సర్వ భక్షకుడౌను

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : యుగాది కృత్ ... యుగాలకు కర్త, యుగావర్తో ... యుగాలను నడిపించేవాడు, నైకమాయ ... అనేకానేక మాయలు, మహాశనః ... మహా భోక్త.

భావము : కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలను తానే ప్రారంభిస్తాడు, తానే నడుపుతాడు అనగా నిర్వహిస్తాడు, అనేకానేక మాయలతో భిన్న రూపాలు ధరిస్తూ(ఉదాహరణకు ద్వాపరాన బృందావనంలో వేలాది గోపికలకు ఒకేసారి ప్రతివారూ అతడు తన చెంతనే ఉన్నట్లు భావించుకునేలా చేసేడు కదా) సకల కార్యాలూ సాధించువాడు, ప్రళయ( దీనినే సం లయము అని కూడా అనవచ్చు కదా) కాలంలో జీవ, నిర్జీవ రాశులన్నిటినీ తనలో కలుపునేవాడు (దానినే భక్షణ అనవచ్చునేమో...ఆశనుడు అంటే భోక్త అంటే భక్షకుడే . నారదుని కలహాశనుడు అంటున్నాము కదా) అయిన ఆ శ్రీహరికి శతసహస్ర వందనాలు.}

70. గ్రాహ్యమేమి కాడు, గ్రాహ్యుడెయైననూ

వేల యుద్ధములలొ విజయుడతడు

అతడి జయములెన్నొ యవి యనంతములుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అదృశ్యః ... కనిపించడు, వ్యక్త రూప ... భక్తుల హృదయాలలో మాత్రమే కొలువై ఉండేవాడు, సహస్ర జిత్ ... వేలాది యుద్ధాలలో విజయుడు, అనంత జిత్ ... లెక్కలేనన్ని విజయాలు సాధించిన వాడు.

భావము : సాధారణ ఇంద్రియలకు తన ఉనికిని తెలియనీయనివాడు(గ్రాహ్యం కాకపోవడం అంటే కనిపించకపోవడమే కదా), తగిన నిష్ఠతో తార్కిక, భక్తి, జ్ఞాన, వైరాగ్యాది విద్యలతో సాధు సజ్జనులకే తమ హృదయాలలో కొలువై ఉన్నట్లు కనిపించేవాడు, వేలాది రాక్షసులను జయించినవాడు, అనూహ్యమైన శక్తి సామర్ద్యాలతో లెక్కకు అందని విజయాలు సాధించిన వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }

------------------------

శ్లో. ఇష్టో విశిష్టః శిశ్టేష్టః శిఖండీ నహుషో వృషః !

క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహు ర్మహీధరః !! 34 !!

-------------------------------- (నామాలు 308 - 317)

71. ఇష్టుడతడె, చూడ నెచ్చటైనను గలడు

శిష్టులకును దానె యిష్ట సఖుడు

నెమలి పింఛ ధారి నెవరినైనను బట్టు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఇష్టః ... ప్రియమైనవాడు, విశిష్టః ... సర్వాంతర్యామి, శిష్టేష్టః ... శిష్టులకు ఇష్టుడు, శిఖండీ ... నెమలి పురి(పింఛము అని పాఠాంతరము) ధరించినవాడు, నహుషః ... సర్ప రాజు.

భావము : సర్వులకూ ఇష్టమైనవాడు, సర్వాంతర్యామియై ుండీ తన ఉనికిని అంత సులభముగా కన్పట్టనీయనివాడు, శిష్టులకు అనగా నిష్టగా ఉండే సాధిజనులకు మరింత ప్రియమైనవాడు, నెమలి పురి (పింఛము) తలపై ధరించువాడు, సకల ప్రాణులనూ పట్టి మాయావృత సంసార చక్రంలో బందింఛడంలో నహుషుని వంటి బలం గలవాడు ...అయిన ఆ శ్రీహరికి శతసహస్ర వందనాలు.}

వివరణలు ...1. నెమలి పింఛ ధారణకు కారణం ... నెమలి అస్ఖలిత బ్రహ్మ చర్యానికి ప్రతీక ... (విషయవాంఛలతో నిమిత్తం లేకుండానే సంతానోత్పత్తి చేస్తున్నది అంటే అది విషయాంతరం) కృష్ణునికీ గోపికలకూ మద్య ఉన్న సంబంధమూ కేవలం ఆద్యాత్మిక పరమైనదే కదా... ఆ విషయం సూచించడమే నెమలి ఫింఛ ధారణలో ఆంతర్యంగా గ్రహించవచ్చునేమో)...

2. నహుష ... ఇంద్ర పదవి పొందిన నహుషుడు గర్వాంధకారంతో ప్రవర్తించి శాప వశాన సర్పంగా మారాడు. అమితమైన బలం సంపన్నుడు. కూడా కావడంతో సర్పబంధానికి నహుషుని ప్రమాణంగా తీసుకుంటున్నారనుకోవచ్చు ...కదా!



72. ఆశ్రితులను గాచు, ఆగ్రహమణచును

దారి తప్ప నతడె దండధరుడు

విశ్వబాహుడతడు విశ్వమే ధరియించు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : వృష ... ధర్మం, వర్షం, క్రోధ హా ... క్రోధమును హరించువాడు, క్రోధ కృత్ కర్త ... ఆగ్రహం ప్రదర్శించువాడు, విశ్వబాహు ... విశ్వమంతా వ్యాపించిన బాహువులు గలవాడు, మహీ ధర ... భూమిని ధ(భ)రించినవాడు.


భావము : వృష అను పదానికి రెండు రకాల భావార్థాలున్నాయి కనుక, రెంటినీ సమన్వయ పరచుకుంటూ సాధు సజ్జనులపై కరుణామృతము వర్షించే ధర్మ స్వరూపుడు అనుకోవచ్చు కదా, భక్తులలోని ఆగ్రహావేశాలకు అడ్డు కట్ట వేసేవాడు, అయినప్పటికీ దిగిరావడానికి ఇచ్చగించని దుర్జనులను నిర్జించడానికైనా వెనుకాడనివాడు, విశ్వమంతా తన భుజాలను అనగా బాహువులను విస్తరింపజేసేవాడు( బాహువులనగా కార్యాచరణకు ప్రతీకలుగా భావించ వలెను కదా), విశ్వమంతటినీ భ(ధ)రించువాడు. (విశ్వంభర అనడంలో భావమూ అదే కదా) అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.

శ్లో. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః

అపాం నిధి రధిష్ఠాన మప్రమత్త ప్రతిష్ఠితః !!35!!

-------------------------- (నామాలు 318 – 326)

73. నిత్యమైన వాడు, సత్య ప్రసిద్ధుడు

ప్రాణమిచ్చు చుండు, ప్రాణమతడె

అరయ వాసవునికి యాతడు తమ్ముడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అచ్యుత ... నాశనము లేనివాడు, ప్రథిత ... ప్రసిద్ధుడు, ప్రాణ..ప్రాణము, ప్రాణద ... ప్రాణము ఇచ్చువాడు, వాసవానుజ ... వాసవుని తమ్ముడు.

భావము : నిత్యము, సత్యము అయినవాడు అనగా శాశ్వతమైనవాడు(చ్యుతము అంటే నాశనము అది లేనివాడు అంటే శాశ్వతుడే కదా), ఎప్పటికీ ప్రసిద్ధుడైనవాడు, ప్రాణము తానే, అదిచ్చేదీ (ప్రాణ దా ...ప్రాణము ఇచ్చు అనే కదా) తానే అయిన వాడు, ఇంద్రుని సోదరుడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

( వివరణ : అదితి, కశ్యపులకు ఇంద్రుని (వాసవుని) తర్వాత వామనుని రూపంలో అవతరించిన వాడే శ్రీ మహా విష్ణువు కదా కనుకనే ఆయనను వాసవానుజుడు అంటున్నారు.)

74. జలధి యనగ నతడె, జగతి కాధారమూ

జగతి రక్షణందు జతన మెండు

తవిషి రక్షణకును తానె ప్రతిష్ఠితః

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అపాం నిథి ... సాగరుడు, అధిష్ఠానం ... ఆధార కేంద్రం, అప్రమత్తత ... అతి జాగ్రత్త, ప్రతిష్ఠిత ... స్వయంగా ప్రతిష్ఠితుడైనవాడు.


భావము : సర్వమూ తానైనవాడే గనుక సాగరుడే అనుకోవచ్చు లేదా దయా సముద్రుడూ అనుకోవచ్చ( అపాం అంటేనే నీరు కదా), సమస్త విశ్వానికి ఆధార కేంద్రమైన వాడు( అధిష్ఠానం అంటే ఆధారపడదగిన అనే కదా..), విశ్వాన్ని రక్షించేందుకు సదా అప్రమత్తుడై యుండువాడు( జతనము అంటే అప్రమత్తత అని కదా), తవిషి అంటే భూమి (అదే ప్రపంచం కూడా ) రక్షణకు తనకు తానుగా ప్రతిష్ఠితుడైనవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

శ్లో. స్కందః స్కంద ధరోధుర్యో వరదో వాయు వాహనః

వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురందరః !!36!!

---------------------------- (నామాలు 327 – 335)

75. కార్తికేయుడతడు, కైలాసపతియైన

మూడు ధర్మములకు మూల మతడె !

వరములిచ్చువాడె, వాయువాహనుడుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : స్కన్ద ... సుబ్రహ్మణ్య స్వామి(కార్తికేయుడు కూడా), స్కన్ద ధర ... సుబ్రహ్మణ్య స్వామి తండ్రి, ధుర్యః ... ధర్మాల నిర్వాహకుడు, వర ద ... వరములిచ్చు వాడు, వాయు వాహన ... వాయువులను నడిపించువాడు.

భావము : స్కన్దుడంటే సుబ్రహ్మణ్య స్వామియే, అదే శబ్దానికి అమృత మయుడనే భావార్థమూ ఉన్నది కదా, అలాగే మరో భాష్యం ప్రకారం దుర్లక్షణాలను(దుర్జనులను) నిర్వీర్యం చేసేవాడనీ చెప్పవచ్చును, అట్టి సుబ్రహ్మణ్య స్వామికి జన్మనిచ్చినవాడే పరమ శివుడు (కైలాసపతి). కాగా, స్కన్ద అనే శబ్దానికి గల భావార్థాల ప్రకారంగా చూస్తే కనుమరుగయ్యే దుర్లక్షణాలను నిర్జించి ధర్మాలను నిలబెట్టేవాడు అనీ అభివర్ణించుకోవచ్చును కదా.. సర్వమూ తానే గనుక కేవలం పరమేశ్వడేగాక, పరబ్రహ్మ, మహా విష్ణువు కూడా తానే. కనుక సృష్టి, స్థితి, లయ ధర్మాలు మూడింటికీ ఆయనే మూల పురుషుడు అనగా నిర్వాహకుడు కదా.. వరములిచ్చువాడు( వరములు అనగా ధర్మార్థ కామ మోక్షములుగానే అభివర్ణించుకోవాలి కదా ), సప్త వాయువులు వాటి ధర్మాలను నిర్వహించునట్లు చేయువాడు( వాహనుడు అంటే రౌతు అనగా నడిపించువాడే కదా)అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

వివరణ : సప్త వాయువులు అనగా ఆహవ (భూమికీ, మేఘాలకూ మద్య), ప్రవహ (మేఘాలకూ,,సూర్య మండలానికీ మధ్య), అనువహ (సూర్య, చంద్ర మండలాలకు మధ్య), సంవహ (చంద్ర ,నక్షత్ర మండలాలకు మధ్య), వివహ (నక్షత్ర, గ్రహ మండలాలకు మధ్య), పరావహ (గ్రహ, నక్షత్ర మండలాలకు మధ్య), పరావహ ( సప్తర్షి, గ్రహ మండలాలకు మధ్య), పరీవహ ( ధ్రువ, సప్తర్షి మండలాలకు మధ్య) వాయువులు. వీటికి అధిపతులైన సప్త మరుత్తులను నడిపించేవాడే ఆ శ్రీ మహా విష్ణువు...కదా !

76. వాసుదేవుడతడె, వర్ణింప భానుడే

తానె యెపుడు మొదటి దైవమనగ !

మట్టిలోన గలిపె మరి మూడు పురములు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : వాసుదేవ .... వసుదేవుని సుతుడు, లేదా జీవరాశులన్నిటా వసించువాడు, బృహద్భాను ... మహా తేజ స్వరూపుడు, ఆది దేవ ... మొదటి దైవం, పురందర ... పురములను కూల్చిన వాడు.

భావము : వసుదేవుని కుమారుడే వాసుదేవుడు, మరో భావార్థం ప్రకారం సృష్టిలోని 84 కోట్ల రకాలైన జీవరాశులన్నిటా వసించి ఉన్నవాడు, భానుడు అంటే సూర్యుడే అయినా వెలుగు కిరణాలు ప్రసరించువాడు అనే భావమూ ఉంది కదా... ఆ ప్రకారంగా చూస్తే విశ్వమంతటా తేజస్సు(వెలుగు)ను ప్రసరించ జేసేవాడు అనుకోవచ్చును కదా, మొదటి దైవం అనగా సృష్టి జరిగినదే తన వలన గనుక ఆయనే ఆదిదేవుడు కదా, పురములను కూల్చినవాడు... త్రిపురాసుర సహారం ఒక భావం కాగా, ప్రాణులలోని జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలనే మూడు పురాలనూ తన అదుపులో ఉంచుకున్నవాడు అనుకోవచ్చును కదా.......అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. అశోకస్తారణరస్తారః శూరః శౌరిర్జనేశ్వరః !

అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః !!37!!

-------------------------(నామాలు 336 ... 345)

77. శోకముల దహించు లాగించు సాగరం

జనన, మరణ భయము జాఱ్చివేయు

శూరుడనగ నతడె, శౌరి వంశీయుడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అశోక ... శోక రహితుడు, తారణ ... దాటించు,తార ... తరింపజేయు, శూర ... పరాక్రముడు, శౌరి ... శూరసేన వంశీయుడు.

భావము : శోకములను దహింప జేసేవాడు(ఆయనకు ఎలానూ శోకం ఏదీ ఉండదు గనుక తనను నమ్ముకున్నవారిని శోకానికి దూరం చేస్తాడనుకోవచ్చు), సంసార సాగరం దాటించే(లాగంచు అంటే దాటించు అనే అర్థమూ ఉన్నది కదా)వాడు, జనన, మరణ భయం నుంచి తరింప చేసే(ఒడ్డున వేసే)వాడు (జాఱ్చు అంటే పోగొట్టు అనే అర్థమూ ఉన్నది కదా), భక్త జనులనూ, పుడమినీ కూడా కాపాడటంలో అంతులేని పరాక్రమము గలవాడు, శౌరి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

(వివరణ ...శూరసేనుని కుమారుడే వసుదేవుడు. శూరసేనుని వారసులను శౌరి వంశీయులనవచ్చు కదా... ఆ ప్రకారంగా వాసుదేవుడు కూడా శౌరి వంశీయుడే అనుకోవచ్చు కదా...)

78. ప్రజల ప్రభువు, మరియు ప్రజకనుకూలుడూ

అవతరించు నతడె యనవరతము

పద్మహస్తుడతడె, పద్మాక్షుడతడెగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : జనేశ్వర ... జనులకు ప్రభువు, అనుకూల ... అనుకూలుడు, శతావర్త ... శతాబ్దులపాటు వర్తించేవాడు, పద్మీ ... పద్మ హస్తుడు, పద్మ నిభేక్షణ ... తామర పువ్వుల వంటి కన్నులు గలవాడు.

భావము : లోకంలోని జనులందరికీ ప్రభువు, ప్రజలందరికీ అనుకూలమైనవాడు (తప్పులు చేసినా దాసుడి తప్పు దండంతో సరి అన్నట్లు కావవే అంటే చాలు కరిగిపోతాడాయన), ధర్మరక్షణ కోసం పదే పదే ఎన్ని శతాబ్దులు(యుగాలైనా) అవతరిస్తూనే ఉండేవాడు, జ్ఞాన సూచిక అయిన పద్మాన్ని హస్తమందు గలవాడు, తామర పువ్వుల( మరి యొక భావార్థం ప్రకారం పువ్వుల రేకలు అంటే దళాల) వంటి కన్నులు గలవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. పద్మనాభోరవిందాక్షః పద్మ గర్భః శరీరభృత్ !

మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః !!38 !!

----------------------------------(నామాలు 346 ...354)

79. గంటు నందె పువ్వు కమల దళాక్షుడే

ఎదల యందె నుండు నెటకు బోక

కాయములకు దానె కావలసినదిచ్చు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : పద్మనాభ ... నాభి యందు పద్మము గలవాడు, అరవిందాక్ష ... పూ(రేక)ల వంటి కన్నులు గలవాడు, పద్మగర్భ ... హృదయ పద్మము నందు వసించువాడు, శరీరభృత్ ... శరీరములందు వసించువాడు.

భావము : నాభి యందు బ్రహ్మ దేవుని జన్మ స్థలియైన పద్మము గలవాడు, తామర పూవుల (ఒక భాష్యం ప్రకారం వాటి రేకల) వంటి నేత్రములు గలవాడు, హృదయపద్మమునందు వసించువాడు, శరీరాలకు కావలసిన ఆహార పానీయాదులు సమకూర్చువాడు అనగా పోషింటువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

(వివరణలు ...1 తామర పూవులు ఉదయం విప్పారి రాత్రి వేళల ముడుచుకుంటాయి. విప్పారేదీ తిరిగి ముడుచుకునేది రేకలే అయినా వ్యావహారికంలో పూవులే కదా.. కనుక నేత్రాలను వేటితోనైనా పోల్చవచ్చునేమో. విషయానికి వస్తే ... ఆ యెక్క కన్నులు కూడా పగలు అనగా జగతిలోని మంచి పనులను విప్పార్చుకుని చూస్తూ, చీకటి పనులను చూడలేక ముడుచుకుంటూ ఉంటాయి. అనగా ఆ పరమాత్ముడు తాను చూసిన వాటికి సానుకూల ప్రదంగానూ, చూడ దలచుకోని వాటి పట్ల కఠినంగానూ వ్యవహరిస్తాడని చెప్పుకోవచ్చు...కదా..

2. ప్రతి హృదయంలోనూ సహస్ర దళ పద్మం ఉంటుంది. దాని మద్య ఆధార (కేంద్ర) బిందువునందే శ్రీ హరి వసించి ఉంటాడు. అందుకే ఆయనను పద్మ గర్భ అంటున్నారనుకోవాలి...కదా)

80. సర్వ శక్తులుండె, సర్వమూ వ్యాపించె

అంచనాల కంద దాత్మ వయసు

కనులు గొప్పవాయె గరుడ ధ్వజుండునూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : మహర్థి ... సర్వ శక్తి సంపన్నుడు, ఋద్ధ ... విశ్వాకారం, వృద్ధాత్మ ... వయోధికాత్మ, మహాక్ష ... గొప్ప కనులు గలవాడు, గరుడ ధ్వజ ... పతాకమందు గరుడుని చిహ్నము గలవాడు.

భావము : సర్వశక్తులున్నవాడు, (అనగా సృష్టి, స్థితి, లయ వంటి కార్యములను మరెవరి సహాయమూ లేకుండానే నిర్వహించగలవాడు) సర్వత్రా, సర్వమూ వ్యాపించి ఉన్న వాడు కనుక విశ్వాకారుడే, ఆయన ఆత్మకు ప్రాయం అనేది లేదు, ఆది నుంచీ ఉన్నవాడే కనుక వృద్ధాత్ముడు, విశ్వమంత(టి) ఆకారం కలిగి ఉన్నవాడు గనుక ఆయన కన్నులూ విశాలమైనవి అనగా గొప్పవిగానే పేర్కొనదగినవి కదా, పతాకమందు గరుడ చిహ్నం కలవాడు( ఆయన వాహనమే గరుడుడు అయినప్పటికీ గరుత్మంతుడు జ్ఞాని కనుక అందుకు ప్రతీకగా శ్రీహరి ధ్వజముపై ఉంటాడు. అట్టి యా శ్రీహరికి శత సహస్ర వందనాలు.)

------------------------

శ్లో. అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః !

సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః !!39!!

--------------------------- (నామాలు 355--362)

81. సాటిలేనివాడు, శరభ తత్త్వ మదియె

భీతి గొల్పునట్టి భీమ బలుడు

కాల నియమమెరిగి కర్తవ్యములు దీర్చు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అతుల... తూచ సాటిలేనివాడు, శరభ ... సర్వప్రాణులలో అంతర్లీనంగా ఉంటూ ప్రకాశింపజేయువాడు లేదా తన మాట వినని వారిని అణచివేయువాడు, భీమ ... భీమమైన బలము గలవాడు, సమయజ్ఞ ... సమయ వివేచనము గలవాడు.

భావము : సాటి లేనివాడు(అ తుల అంటే తులతూగేవారు లేకపోవడమే కదా), నశ్వరమైన శరీరాలలో కూడా ఉండి వాటిని ప్రకాశింపజేసేవాడు,(మరొక భాష్యం ప్రకారం తన ఆజ్ఞలు పాటించనివారిని శరభునిలా శిక్షించిన వాడు( పరమ శివుడే ఒకానొక దశలో శరభ పేరిట అష్ట పాద దుప్పి అవతారం ధరించినట్లు తెలుస్తున్నది.), శతృ సంహారానికి తగిన భీకరమైన రూపమూ, బలము కలిగయున్నవాడు, సమయానికి తగినట్లు కార్యములు సాదించువాడు అనగా కాల నిర్ణయం (చేసేదీ ఆయనే కదా) ప్రకారం సృష్టి, స్థితి, లయ వంటి కార్యాలను సాదించేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

82. వాజమందు కలడు, వదలక వరమిచ్చు

వక్షమనగ లక్ష్మి వాస మాయె

విజయలక్ష్మితోడ విలసిల్లుచుండుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : హవిర్హరి ... హవిస్సును అందుకొను వాడు లేదా ఆరగించువాడు, సర్వ లక్షణ లక్షణ్య ... సర్వులకూ వరములు ప్రసాదించువాడు, లక్ష్మీవాన్ ... లక్ష్మికి వాసస్థానమైనవాడు, సమితిం జయ ... నిరంతరం విజయలక్ష్మి చెంతనే యుండువాడు.

భావము : యజ్ఞాలలో(వాజము అంటే యజ్ఞము అనే అర్థమూ ఉన్నది కదా) హవిస్సును అనగా నెయ్యని స్వీకరించువాడు(హరీ అంటే హరించువాడు అనే అర్థమూ ఉన్నది కనుక హరాయించుకొనువాడు అంటే ఆరగించు అనే కదా), ఆ ప్రకారముగా ఆయనే యజ్ఞ స్వరూపుడనుకోవచ్చును కదా, కాగా ఎటువంటి వారికైనా కొద్దిపాటి భక్తితో సేవిస్తే పద్ధతులతో నిమిత్తం లేకుండా అట్టివారిని కూడా వరములిచ్చి సంతృప్తి పరచువాడు, తన వక్షమే లక్ష్మీదేవికి ఆవాసముగా గలవాడు, ఐశ్వర్య లక్ష్మితో పాటు నిరంతరం విజయలక్ష్మి కూడా చెంతనే ఉన్నవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః !

మహీధరో మహాభాగో వేగవానమితాశనః !! 40 !!

--------------------------- (నామాలు 363--372)

83. శాశ్వతుండు మరియు శకులియు నాతడే

మార్గమనగ నతడె, మూలమతడె

ఉదరమునకు దామ మోర్పులోనే మిన్న

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : విక్షర ... క్షరము(నాశము) లేనివాడు, రోహిత ... ఎఱ్ఱని చేప, మార్గ ... మార్గము, హేతు ... మూలము, దామోదర ... ఉదరమునందు లేదా ఉదరమునకు దామము కలవాడు, సహ ... సహనశీలి. (దామము + ఓర్పు= దామ మోర్పు)

భావము : నాశనము లేనివాడు (ఆది మద్యాంతములు ఏవీ లేని శాశ్వతుడు కదా), దశావతారములలో మొదటియైన మత్స్యావతారం (రోహిత అంటే ఎర్రని చేప కాగా దానికి పర్యాయపదమే శకులి కదా) ధరించి చతుర్వేదములను కాచినవాడు, ముముక్షువులకు మోక్ష మార్గము చూపువాడు (వాస్తవానికి ఆ మార్గమూ తానే కదా), సమస్త విశ్వ మునకూ మూలము, దామోదరుడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

(దామోదరుడు ...ఈ నామానికి చాలా అర్థాలు కనిపిస్తున్నాయి. దామము అంటే లోకము అనీ కనుక సమస్త విశ్వాన్నీ తన ఉదరమందు దాచినవాడు అని ఒక భావం. కాగా, దామము అంటే త్రాడు అనీ దానితో ఆయనను రోలుకు కట్టినారు కనుక దామోదరుడని మరో భావం. అలాగే పవిత్రత కలిగి స్వయం నియంత్రణ కలిగి ఉన్నాడనేది మరో భావం.)

84. అవనికాశ్రయంబు, నతడె మహాభాగ

రక్ష యనగ తరలు రయముగాను

అంత్య కాలమందు నమితాశనుండుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : మహీధర్ ... భూమిని ధరించినవాడు, మహాభాగ ... భాగ్యశాలి లేదా సింహభాగముకోరు(పొందు)వాడు, వేగవాన్... అత్యంత వేగముగా కదులువాడు, అమితాశన.. అమితముగా భుజించువాడు.

భావము : భూమిని అవసర సమయాలలో పైకెత్తి కాపాడినవాడు(భూదేవికి భర్త గనుక భ/ధ రించువాడు అనీ అనుకోవచ్చు కదా), ఆ ప్రకారముగా అవనికి ఆశ్రయమిచ్చువాడే కదా, యాగములలోనూ, వాటి ఫలాలందునా సింహభాగము పొందువాడు (అదీ తానే అయినవాడు), కాపాడుమని కోరినంతనే సిరికిం జెప్పక... తగిన సన్నాహాలైనా సేయక వేవేగంగా తరలువాడు, ప్రళయకాలమందునవిపరీతమైన ఆకలిగొన్నవాని మాదిరి సమస్తమూ ఆరగించు (తనలో కలుపుకొను) వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః !

కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః !! 41 !!

--------------------------- (నామాలు 373--383)

85. జగతి పుట్టుకకును, చైతన్యమునకును

కారకుండు, దేవ, గర్భ ధనుడు

ప్రభువులకును ప్రభువు, భరణికి కరణంబు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఉద్భవ ... పుట్టుక, క్షోభ ... కల్లోలం, దేవ ... లేదా క్రీడించువాడు, శ్రీగర్భ ... గర్భమునందు ఐశ్వర్యము గలవాడు, పరమేశ్వర ... ప్రభువులకు ప్రభువు, కరణం... జగదుత్పత్తి సాధనం.

భావము : చరాచర జగతి పుట్టుకకు, అందులో కలిగే చైతన్యానికి(చైతన్యం అంటే కదలికే గనుక కల్లోలాన్నే చైతన్యానికి ప్రతీకగా తీసుకోవచ్చునేమో), కారకుడు, ప్రాణుల కార్యకలాపాలను చూసి వినోదించువాడు (బిడ్డల చేష్టలు తండ్రికి క్రీడాసక్తమైనవిగానే ఉండునేమో కదా), గర్భములో ఐశ్వర్యము దాచుకున్నవాడు(సర్వమూ తనలోనే ఇముడ్చుకునేవాడైనప్పుడు ఐశ్వర్యమూ అంతే కదా) ... ధనుడు అంటే కూడా ధనికుడు అనే అర్థమున్నది కదా, ప్రభువులకే ప్రభువైనవాడు, భరణి అనగా భూమి మాత్రమే కాదు మొత్తం విశ్వమే కదా అది పుట్టడానికి తగిన సాధనం (చేసేదీ, చేయించేది, పనీ, పరికరమూ కూడా ఆయనే ....కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

86. క్షాంతి యనగ యతని కతన కావలెనుగా

కర్త యతడె, మరి వికర్త యతడె

గహనుడతడె మరియు గుహ యన నతడెగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : కారణం ... కారకుడు, కర్తా ... చేయువాడు, వికర్తా ... విభిన్న(మైన)సృష్టి చేయువాడు, గహనుడు ... కనిపించువాడు, గుహ ... అంతుపట్టనివాడు.

భావము : విశ్వం అతని కారణంగానే జనిస్తున్నది.( క్షాంతి అంటే కూడా విశ్వమే, కతన అంటే కారణం చేత అనే అర్థమూ ఉన్నది కదా), సృష్టికి కర్త యతడె, విభిన్న మైన ప్రాణుల సృష్టీ అతని లీలయే కదా, సులభమైన పద్ధతులలో కనుగొనలేనివాడు, అంతుపట్టని వాడు (గుహలో దాగిన వారిని కనుగొనలేనట్లే పరమాత్మ ఉనికినీ అంత తేలికగా కన్గొనలేము.. కనుకనే ఆయనను గుహ(లో ఉన్నవాని)తో పోలుస్తున్నామనుకోవాలి.. అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధృవః !

పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః !!42!!

-------------------------------- (నామాలు 384 -393)

87. కృషి యనంగ నతడె, కృషికె నేత యతడు

స్థానమిచ్చు నతడె, స్థానమతడె

మార్పు లేనివాడె, మంగళ రూపుడూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : వ్యవసాయ ... కృషి, యోగ సాధన, వ్యవస్థాన ... సకల వ్యవహారాలు నిర్వహించు, సంస్థానం ,,, గమ్యస్థానం, స్థానద ... స్థానం కల్పించు, ధృవ ... స్థిరమైన, పరర్థి ... మంగళకరమైన.

భావము : వ్యవసాయానికి వాడుక భాషలో సేద్యం,కృషి అనే అర్థాలున్నాయి కదా. వాటి ఫలాలు సర్వజన శ్రేయస్సుకే కదా. యోగ సాధన అంతిమ లక్ష్యమూ సర్వజన శ్రేయస్సే గనుక అది సాధించేవాడే పరమేశ్వరుడని భావించవచ్చునేమో...కాగా, అట్టి వ్యవసాయాన్ని సజావుగా సాగించేదీ ఆయనే గనుక వ్యవస్థాన అన్నారనుకోవచ్చు, కర్మలను బట్టి ఊర్ధ్వ లోకాలలో తగిన స్థానము కల్పించువాడూ, ఆ స్థానమూ తానే అయినవాడు ఆయనే. ఎటువంటి మార్పులకూ, ఉద్వేగాలకూ లోనుగాకుండా స్థిరముగా ఉండేవాడు, మంగళకరమైన విభూతులూ(విభూతికి ఐశ్వర్యము, బలము, భస్మము వంటి నానార్థాలున్నాయి ... భస్మ ధారణ సర్వసంగ పరిత్యాగానికీ, నిర్వికారానికీ సూచిక కదా) , గుణాలతో ఉత్కృష్టమైన వైభవ సంపన్నుడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

88. స్పష్టమైన రూపు, తుష్టుడనగ వాడె,

పూర్ణకాముడైన పురుషుడతడు

సర్వశుభము లిచ్చు సాక్షాత్కరించిన

ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

{ అర్థాలు : పరమస్పష్ట ... స్పషమైన, మంగళకరమైన రూపు, తుష్ట ... సంతుష్టుడు అనగా తృప్తి చెందినవాడు, పుష్ట ... పూర్ణ పురుషుడు, శుబేక్షణ ... శుభప్రదమైన వీక్షణము కలవాడు, చూపుతోనే సర్వశుభములిచ్చువాడు.

భావము : కేవలం ధర్మ వర్తన, ఆత్మ జ్ఞానము కలిగి సాధన చేసిన వానికే స్పష్టమైన రూపముతో గోచరించువాడు, సర్వమూ తనయుందే తను పొందవలసినది అంటూ లేనందను పూర్తిగా సంతృప్తి చెందినవాడు, పూర్ణపురుషుడు, తన సాక్షాత్కార మాత్ముననే కోరికలు నశింపజేయువాడు( ప్రాపంచికమైన కోరికలు నశిస్తే ఆధ్యాత్మిక శుభములు పొందినట్లే కదా...),దివ్య మంగళ స్వరూపుడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః !

వీరః శక్తిమతాం శ్రేష్ఠ ధర్మో ధర్మ విదుత్తమః !!43!!

-------------------------------- (నామాలు 394 - 404)

89. రాముడనగ యతడె, యారామమును జూపు

రాజసంబె లేని రాచబాట

దారి చూపు నతడు, దరి జేర్చు వాడుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : రామ ... చైతన్యానందంతో కూడియుండు వాడు, విరామ ... జీవులకు విరామ స్థలము, విరజ ... రజో గుణ రహితుడు, మార్గ ... ముక్తి మార్గం, నేయ ... దారి చూపువాడు, నయ ... నడిపించువాడు.

భావము : రామ అంటే అనేక భాష్యాలున్నాయి. రమ్యమైన మనసు గలవాడు, నిత్యచైతన్యానందంతో కూడి యుండువాడు, రామ శబ్దం స్త్రీ వాచకమనీ దానికి పుంలింగమే రాముడు అనీ ఒక భాష్యం. రమ్యమైన ఆడుదే రామ అంటే లక్ష్మి అనే అర్థమూ ఉన్నది. లక్ష్మీనాథుడు కనుకే అతడని రాముడంటున్నామని ఒక భాష్యంగా చెప్పుకోవచ్చనుకుంటాను. తన గుణములచే అందరినీ రమింప(ఆనందింప)జేయువాడు గనుక రాముడని మరో భాష్యం. కదా... కాగా, విరామ అంటే విశ్రాంతి (ఆరామ) స్థలమనుకోవచ్చును. కాలం తీరిన జీవులకు వారి కర్మానుసారం చివరగా విశ్రాంతి తీసుకునేదీ ఆ పరంధాముని చెంతనే కదా. మరో భాష్యం ప్రకారం మరణం లేకుండా వరాలు పొందే రక్కసులతో సైతం ఆ వరాల ప్రభావం నుంచి తప్పించే(విరమింపజేసే)వాడు. విరజ... (కొన్ని చోట్ల విరత అనీ ఉంది. ఎలా ఉన్నా) సుఖాలపై కోరికలు లేనివాడు, ఈ సుఖాలూ, కోరికలూ కూడా రజో గుణ ప్రేరితాలే గనుక విరజ అంటే రజోగుణం లేనివాడు అనవచ్చునేమో కదా, నాయకుడు మరియూ నడిపించే వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

వివరణ : పదిమంది కలసి ఒక ప్రత్యేక గుర్తుతెలియని ప్రాంతానికి యాత్రగా పోవునపుడు వారికి నాయకునిగా (Leader)ఒకరుండి ముందుకు నడిపిస్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వేరొకరు(Guide) వీరందరికీ అక్కడి విిశేషాలు తెలుపుతూ దారి (Way) చూపుతారు. కదా...ఆ ప్రకారం శ్రీహరియే మార్గదర్శి. నాయకుడు, ఆ మార్గమే ముక్తి మార్గం అదే తాను....కదా !

90. గామిడనగ యతడు, గండడే యాతడు

శక్తి మంతులకును శాస్త యతడు

ధర్మమూర్తి యతడు, ధర్మవిదుత్తమ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అనయ ... నాయకుని అవసరం లేనివాడు,వీర ...మహీ వీరుడు, శక్తిమతాం శ్రేష్ఠ ... శక్తిమంతులలో గొప్పవాడు, ధర్మ ... ధర్మమూర్తి, ధర్మ విదుత్తమ ... ధర్మాలు తెలిసిన వారిలో ఉత్తముడు.

భావము : గామిడి అనగా శ్రేష్ఠుడు అనగా ఒకరు నడిపించాల్సిన ఆగత్యమే లేనివాడు, అనగా శ్రేష్ఠుడైన వాడికే అటువంటి అవసరం ఉండదు కదా, గండర గండడు అన్నా గండడు అన్నా సమానార్థకాలే కదా ... వాటి భావమే వీరుడు కదా, శక్తిమంతులలో కెల్లా గొప్పవాడు, ధర్మ మూర్తి(విగ్రహవాన్ ధర్మః అనడంలో అంతరార్థం కూడా ఇదే కావచ్చు కదా), ధర్మాలను బాగా ఎరిగిన వారిలో ఉత్తముడు. అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః !

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః !!44!!

-------------------------------- (నామాలు 405 - 415)

91. పరమపదము నుండు పురుషుడు తానెగా

జీవ మనగ నతడె జీవ దాత

ప్రణవ నాద మతడె, పంక్తి యంత నతడు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : వైకుంఠ ... పరమ పదము, పురుష ... పూర్వం నుంచి ఉన్నవాడు, ప్రాణ ... జీవము(చైతన్యము), ప్రాణద ... జీవదాత, ప్రణవ ... ఓంకారం, పంక్తి ... పుడమి,విశ్వము.

భావము : వైకుంఠవాసి కాదు వైకుంఠమే అతడు, మరో భాష్యం ప్రకారం నింగీ, నేలా, నీరూ, నిప్పూ, వాయువు.... ఈ అయిదింటినీ సమన్వయ పరేవాడు లేదా సమ్మిళితం చేసేవాడు అనీ అనుకోవచ్చు, కాగా పూర్వం నుంచీ ఉన్నవాడు గనుక పురుషుడు, మరో భాష్యం ప్రకారం దేహమే దేవాలయం అనగా సమస్త జీవరాశుల లోనూ ఆత్మ రూపమున నెలకొనియున్నవాడు, ప్రాణము అనగా చైతన్యము ప్రసాదించువాడు మరియూ చైతన్యమే తానైనవాడు, ఓంకార(నాద) మూ తానే అయిన వాడు, (పృథిు పుంలింగం అయితే పృథ్వి స్త్రీ వాచకం అనుకోవాలి)పంక్తి అనగా భూమి అనగా విశ్వమంతటా తానై ఉన్నవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

92. ధాత తండ్రె యతడు, దనుజుల పరిమార్చు

సర్వ వ్యాపకుండు, శారమతడు

మార్పులెనివాడె,మార్పులెన్నియు నున్న

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : హిరణ్య గర్భ ... హిరణ్యమయమైన గర్భము గలవాడు, శత్రుఘ్న ... శత్రు సంహారకుడు, వ్యాప్త ... సర్వవ్యాపకుడు,వాయు ... గాలి, అధోక్షజ .. కిందికి జారిపోనివాడు.

భావము : బ్రహ్మదేవునికి జన్మనిచ్చిన గర్భము గలవాడు గనుక ఆ బ్రహ్మ(ధాత)కు ఈయనను తండ్రిగానే పరిగణించవచ్చును కదా, శత్రుఘ్నుడు అంటే తనను శత్రువుగా భావించే రక్కసులను సంహరించిన వాడు మరియూ జీవరాశులలోని కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే ఆరు దుష్ట శక్తులనూ అణచి మోక్షం ప్రసాదించేవాడు, విశ్వంలో ప్రళయంతో సహా ఎన్ని మార్పులు చోటుచేసుకుటున్నప్పటికీ తన స్థానం(స్థాయి) పదిలమైన వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః !

ఉగ్రః సంవత్సరో దక్ష విశ్రామో విశ్వ దక్షిణః !!45!!

-------------------------------- (నామాలు 416 - 425)

93. కాల మనగ యతడె, కనిపింప శుభములే

కాల పురుషుడతడు, కలడు యెదన !

భక్తి భావమున్న బాళి చూపుచు పొందు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఋతు .... కాలము, సుదర్శన ... శ్రీహరి చక్రము, శుభ వీక్షణము కూడా, కాల ... కాలపురుషుడు, కాలుడు, పరమేష్ఠి... క్షేత్రజ్ఞుడు, పరాపర భేదాలు పాటించనివాడు, పరిగ్రహ ... స్వీకరించువాడు. బాళి అనగా ప్రేమ, ఆదరణ.

భావము : ఋతువు అనగా కాలమే. అయితే దానిని వర్గీకరించి ఆ ప్రకారంగా నడుచుకునేట్లు చేసేవాడు ఆయనే. ఆ మాటకు వస్తే ఆ కాలమూ ఆయనే కదా. దుష్టులను సంహరించేదే శ్రీహరి చక్రం. సుదర్శనం. దీనికి మరో భాష్యం శుభ వీక్షణం అని. ఆ ప్రకారమే చూసినా, ఆయన చేతిలో ఆ చక్రం చూస్తేనే భక్త జనులకు శుభాలు చేకూరుతున్న అనుభూతి కలుగుతుంది కదా...కాలపురుషుడు. అన్నీ తానైనవాడు గనుక ప్రాణులలోని మంచి చెడులను గణన చేస్తూ తగిన రీతిలో శిక్షలు వేవాడూ ఆయనే. పరమేష్ఠి అంటే భక్త జనులకు పరమ ఇష్టుడు అని చెప్పుకున్నప్పటికీ వాస్తవ భాష్యంలో పర అపర విద్యా భేదములు అనగా బ్రహ్మ విద్య యెరిగినవారినీ, లేనివారినీ కూడా సమానంగా చూస్తూ తనను కొలిచే వారినందరినీ పరమపదం చేర్చువాడు, మరొక భాష్యం ప్రకారం జీవుల క్షేత్రము అనగా హృదయాలలో (క్షేత్రజ్ఞుడై) ఉండువాడు , భక్తితో సమర్పించే దేనినైనా (అనగా ఫలం, పుష్పం, తోయం లేదా హృదయమైనా) పరిగ్రహించే అనగా స్వీకరించేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

94. ఉగ్ర రూపి మరియు నుండు సకలమందు

దక్షతొకటి కలిగి దయయు జూపు

విశ్రమింపజేయు విశ్వ దక్షిణుడాయె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఉగ్ర ... ఆగ్రహరూపుడు, సంవత్సర .. సకలమందును వసించియున్నవాడు, దక్ష ... దక్షత గలవాడు, విశ్రామ ...విశ్రమింపజేయువాడు, విశ్వదక్షిణ ... విశ్వం యాత్తూ దక్షతతో నడిపించువాడు.

భావము : దుష్టుల (దుష్ట శక్తుల) పాలిట ఉగ్రముగా వ్యవహరించువాడు (నరసింహావతారమట్టిదే కదా), సర్వుల యందునూ వసించి యుండువాడు, దక్షత కలిగి సృష్టి, స్థితి, లయ కార్యక్రమాలను నిర్వర్తించువాడునూ, యావద్విశ్వంపై తన దయాదాక్షిణ్యాలను ప్రసరింపజేసేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

-----------------------

శ్లో. విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయం !

అర్థో నర్థో మహా కోశో మహా భోగో మహాధనః !!46!!

-------------------------------- (నామాలు 426 - 434)

95. విశ్రమించు జగతి, వెగడెరుండనివాడు

సకల శాస్త్రములకు సత్యమతడు

అండమొకటె తాను, నందరివాడుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : విస్తార ... లోకాలను తనలో విస్తరింపజేసుకున్నవాడు, స్థావర స్థాణు ... చలన రహితుడు, ప్రమాణం ...సత్య ప్రమాణం, బీజమవ్యయం ... నాశము లేని అండం, అర్థ ...అందరిచే అర్థింపబడుచున్నవాడు.

భావము : లోకాలన్నిటినీ తనలో విస్తరింపజేసుకున్నవాడు, మరొక భాషయము ప్రకారం యుగములను విస్తరింపజేస్తున్నవాడు, దేనికీ ఏనాటికీ చలించనివాడు, స్థిరమైనవాడు(వెగడు అనగా అస్థిరము అది లేనివాడే స్థిరమైనవాడు), సమస్త శాస్త్రాలకూ, తర్కాలకూ సత్యమైన ప్రమాణం అయినవాడు, ప్రళయానికి ముందూ, ప్రళయానంతరమూ కూడా సృష్టికి తానే బీజమైన(అండం)మైనవాడు (అనగా ఆ అండం ఎన్నటికీ నాశములేనిది), అందరిచేతనూ కోరబడేవాడు, మరో భాష్యం ప్రకారం చతుర్విధ పురుషార్థాల పరమార్థమైన వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

96. కోరికొకటి లేదు, కోశంబులును దానె

భోగులందు గొప్ప భోగి తానె

సంపదొసగు సకల సంపన్నుడే తాను

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అనర్థ ... కోరికలు(కోరాల్సినవి) లేనివాడు, మహాకోశ ... పంచ కోశములు కలిగియున్నవాడు, మహాభోగ ... భోగులలో గొప్ప భోగి, మహాధన .. సకల సంపన్నుడు.

భావము : తనకంటూ కోరాల్సినవేమీ లేనివాడు, పంచ మహా కోశములు అనగా అన్నము, ప్రాణము, మనము, విజ్ఞానము, ఆనందములు తానే అయినవాడు, భోగులలో మహా భోగి అనగా తన సృష్టి యావత్తూ తిరిగి ప్రళయకాలమున తానే తనలో సలుపుకునేవాడు(హరాయించుకునేవాడు) మరియూ/లేదా సృష్టిని సంపూర్ణంగా అనుభవించగలవాడు(అలాగే ఇక తాను అనుభవించాల్సినదేమీ లేనివాడు), గుణము, శక్తి, మహత్తు,పరాక్రమము, ధర్మార్థ కామ మోక్షము లనబడు సకల సంపదలనూ కలిగియుండి వాటిని అనువైన సమయములో అర్హులకు అందించే వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. అనిర్విణ్ణ స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః !

నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః !!47!!

-------------------------------- (నామాలు 435 - 444)

97. వేదనంబెరుగని విశ్వరూపి యతడు

జన్మమసలు లేని ధర్మ మూర్తి

ధర్మమనగ యతడె తారకలను దిప్పు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అనిర్విణ్ణ ... నిర్విణ్ణుడు కానివాడు అనగా వేదనే యెరుగని (అవసరం లేని)వాడు, స్థవిష్ఠ ... విరాడ్రూపి, అభూ ... పుట్టుక (జన్మము) లేనివాడు, ధర్మ యూప ... ధర్మము మూర్తీభవించినవాడు, మహామఖ ... యాగస్వరూపుడు, నక్షత్రనేమి ... గ్రహాలను, నక్షత్రాలనూ తన చుట్టూ తిప్పుకొనువాడు.

భావము : కోరికలకే అతీతుడైనందున ఆ స్వామి నిర్విణ్ణుడు అనగా వేదనాభరితుడు కావడం అంటూ జరగనే జరగదు కదా కనుకనే అనిర్విణ్ణుడు అంటున్నారు, విశ్వమంతా తానైన వాడు గనుక విరాడ్రూపి, పుట్టునేదే లేనివాడు( ఆంది నుంచీ ఉన్నవాడు కదా), యూప అంటే యాజ పశువును కట్టివేసే స్తంభం అని ఒక అర్థం. ఇక్కడ ధర్మాలను కట్టివేయబడిన స్తంభం అనే అర్్థం తీసుకోవాలి. కానీ, హరియే ధర్మాలకు మూలపురుషుడు, విగ్రహవాన్ ధర్మ కనుక ధర్మమే మూర్తీభవించినవాడు అనుకోవచ్చును కదా, మహా మఖ అంటే యాగ ప్రక్రియ నందు సర్వమూ తానైనవాడు(యాగమునకు మరో పదమే ధర్మము ... కనుక ధర్మమంటే ఆయనే కదా), తారలనూ, గ్రహాలనూ కూడా తన చుట్టూ తిప్పుకుంటున్నవాడు( అవన్నీ తిరగడం అనగా జ్యోతిష చక్రం తిరుగుతున్నట్లే గనుక శ్రీహరిని అలాగే సంభావించుకోవచ్చునేమో) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


98. శతమయూఖుడతడు, సహనశీలి యతడె

క్షామమెరుగడతడు, క్షయమె లేదు

సకల జనుల కెపుడు శస్తమె కోరుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : నక్షత్రీ ... చంద్రుడు, క్షమ ... సహనం, క్షామ ... క్షయ రహితుడు, సమీహన ... సర్వజన హితైషి.

భావము : శతమయూఖుడు అనగా చంద్రుడే(గీతలో సూర్యచంద్రులూ తానే అనిచెప్పుకున్నాడు కదా) , సహనశీలి అనగా భక్తుల దోషాలను సైతం ఓర్పు వహిస్తూ సరిదిద్దడానికి ప్రయత్నించేవాడు (భగవంతుడెప్పుడూ ఓర్పుగలవాడే కదా), క్షామముతో పనిలేనివాడు గనుక క్షామ అనుకోవచ్చును అంటే ప్రళయ కాలమందు కూడా క్షయము కానివాడు కనుకే క్షామ అంటున్నారనుకోవచ్చును కదా, సకల జనులకు శుభము (శాస్తము)లు కోరువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః !

సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ !!48!!

-------------------------------- (నామాలు 445 - 454)

99. యజ్ఞమనగ తానె యారాద్యుడాతడు

పూజ్యులందు పరమ పూజ్యుడతడె

క్రతువు తానె యగుచు కాపాడు జనులను

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : యజ్ఞ ... యజ్ఞ స్వరూపుడు, ఇజ్య ... ఆరాధ్యుడు, మహేజ్యశ్చ ... ఆరాధింపదగిన వారిలో గొప్పవాడు, క్రతువు ... యాగము, సత్రం ... సజ్జన సంరక్షకుడు.

భావము : యజ్ఞ యాగాదులలో ఆలోచననుంచి ఆచరణాంతం వరకుఅన్నీ తానే అయినవాడు, యజ్ఞముల ద్వారా ఆవాహన చేయబడువాడు, మరో భాష్యం ప్రకారం సకల జీవులతో సదా పూజింపబడువాడు, పూజితులలో కెల్లా గొప్ప పూజ్యుడు, సాధారణముగా యాగములలో బలులుండకపోవచ్చు కానీ క్రతువులలో బలి తప్పని సరి అంటారు. తత్సంబందిత పశువును కట్టివేసే స్తంభమే యూపస్తంభం. అట్టి క్రతువుల పరమార్థం కూడా తానే అగుచూ తద్వారా ఆత్మజ్ఞానం ప్రసాదించేవాడు,. సదా సజ్జనులను కాపాడేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}



100. ఆర్తులకు త్రాణమంతటా వీక్షించు

బంధనాలు లేని భాగ్యశాలి

సర్వమెరిగె నతడె సర్వోత్తమ జ్ఞాని

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సతాంగతి ... శరణు కోరినవారికి రక్షకుడు, సర్వదర్శి ... సర్వమూ చూడగలవాడు, విముక్తాత్మ .. విముక్తి పొందిన ఆత్మ గలవాడు, సర్వజ్ఞ ... సర్వమూ తెలిసినవాడు, జ్ఞానముత్తమమ్ ... ఉత్తమమైన జ్ఞాని, జ్ఞాన నిథి.

భావము : శరణు కోరిన వారిని శరవేగంగా వచ్చి కాపాడువాడు(ఆర్త త్రాణ పరాయణుడు) , విశ్వం అంతటా అన్నీ వీక్షించువాడు, సంసార(ప్రాపంచిక) బంధనాల నుంచి విముక్తి కల్పించేవాడు( నామార్థం ప్రకారం విముక్తి పొందిన వాడు కానీ, దైవం విషయంలో అది నప్పదు కదా), సర్వమూ తెలిసిన(తెలియజేయు)వాడు, సకల జ్ఞాన సంపన్నుడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ః !

మనోహరో జిత క్రోధో వీరబాహు ర్విదారణః !!49!!

-------------------------------- (నామాలు 455 - 464)

101. వ్రతము జనుల దరికి, వదనాన స్వచ్ఛత

సూక్ష్మ రూపధారి, సురస ఘోష

సుఖములిచ్చు నెపుడు, సుహృదయుడాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సువ్రత ... మేలైన లేదా స్వచ్ఛమైన వ్రతము, సుముఖ ... ప్రసన్న వదనము, సూక్ష్మ ... సూక్ష్మ రూప ధారి, సుఘోష ... వేదఘోష, సుహృత్ ... సహృదయుడు.

భావము : సజ్జన సంరక్షణే వ్రతముగా గలవాడు(దరి అంటే రక్షణ అనే అర్థమూ ఉన్నది), స్వచ్ఛమైన (ప్రసన్నతకు ఇదీ పర్యాయ పదమే) వదనము అనగా ముఖము గలవాడు, సూక్ష్మరూపంలో జీవరాశుల యందు అంతర్యామిగా ఉండువాడు, పవిత్రమైన(సురస యనగా పవిత్రమే) అనగా వేద ఘోష కూడా తానే అయినవాడు, సుఖములిచ్చువాడు అనగా నమ్మి కొలిచేవారికి సర్వ శుభములిచ్చేవాడు, స(సు)హృదయుడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

102. మనసు దోచువాడె, మడియు నాగ్రహమునూ

వీరబాహుడతడు, వెట్టములను

చీల్చి చెండ గలడు జీవదాని కొఱకు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : మనోహర ... మనసును హరించు అనగా దోచుకొనువాడు, జిత క్రోధ ... ఆగ్రహమును జయించిన(అణచిన)వాడు, వీరబాహు ... శక్తిమంతమైన భుజములు గలవాడు, విదారణ .. చీల్చి చెండాడు.

భావము : సకల జనుల మనములను దోచుకునేవాడు, జిత క్రోధానికి అర్థం క్రోధాన్ని జయించినవాడు అని... కానీ ఇది మామూలు మానవకోటికి మాత్రమే వర్తించేది గనుక శ్రీ హరి విషయంలో..క్రోధావేసాలను అణగదొక్కే(మడియు)వాడు అనుకోవచ్చు కదా, దుష్టశక్తులను నిర్వీర్యం చేయడానికి తగిన వీరత్వం సంతరించుకున్న బాహువులు అనగా భుజములు గలవాడు, శత్రువు(వెట్టము)లను అనగా ప్రాణకోటిలోని దుష్టశక్తులను చీల్చిచెండాడువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.

(జీవదాని అంటే విశ్వము. విదారణ అనగా చీల్చుట, చంపుట, విదారి అనగా చీల్చి చంపువాడు. నరసింహావతారములోనూ, వరహావతారములోనూ శ్రీహరి కోరలతో రక్కసులను చీల్చి మరీ చంపాడనేది గమనార్హము)}

------------------------

శ్లో. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మ కృత్ !

వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః !!50!!

-------------------------------- (నామాలు 465 - 474)


103. స్వప్నమందె యుంచు, స్వాధీనమందుంచు

వ్యాపి యనగ నతడె రూపు లెన్నొ

మూడు కర్మలెపుడు వీడక జేయుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : స్వాపన ... స్వప్నావస్థ యందుంచువాడు, స్వవశో ... స్వాధీనమందుంచుకొనువాడు, వ్యాపి ... సర్వ వ్యాపి, నైకాత్మా...అనేక ఆత్మలు అనగా రూపాలు కలిగి యున్నట్లు గోచరించువాడు, నైక కర్మ కృత్ .. అనేక కర్మలు చేయువాడు.

భావము : తన మాయా జాలంతో జీవులను స్వప్నావస్థ యందుంచువాడు, సర్వస్వమూ తన ఆధీనమందుంచుకొనువాడు, సర్వ వ్యాపి, తానే అనేక యాత్మలుగా అనగా అనేకానేక రూపాలుగా కన్పట్టువాడు, సృష్టి, స్థితి, లయాది విభిన్న కర్మలాచరించువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

104. జీవులందె యుండు, జీవులపై ప్రేమ

తండ్రి వోలె జూచు తవిషి నెపుడు

రత్నగర్భుడతడు, రయి యన తానెగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు :వత్సర ... వసించి యున్నవాడు, వత్సల .. వాత్సల్యము జూపువాడు, వత్సీ ... తండ్రి, (తవిషి ... విశ్వము), రత్నగర్భ ... గర్భమునందు రత్నాలున్నవాడు, ధనేశ్వర ... ధనికుడు (రయి).

భావము : సకల జీవ రాశులందు ఆంతర్యామియై యున్నవాడు, (మరొక భాష్యం ప్రకారం వత్సము అనగా ఆవు దూడలను పంచినవాడు ... కృష్ణుడు), సకల జీవరాశిపై ప్రేమ(వాత్సల్యము) చూపువాడు, సమస్త విశ్వాన్ని తండ్రిమాదిరి చూసుకొనువాడు, రత్నగర్భుడు, తనను కొలిచేవారికి తగిన సంపదలను ప్రసాదించుటకు తగిన ఐశ్వర్యము గలవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. ధర్మగుబ్ధర్మ కృద్ధర్మీ సదసత్ క్షరమ క్షరమ్ !

అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః !!51!!

-------------------------------- (నామాలు 475 - 485)

105. ధర్మములను గాచు, ధర్మ కర్త యతడు,

ధర్మ పీఠమతడు, తథ్యముగను

మార్పు లేనివాడె, మారు నట్లుండునూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ధర్మగుబ్ ... ధర్మరక్షకుడు, ధర్మ కృత్ ... ధర్మాచరణ, ధర్మీ ... ధర్మానికి ఆధారమైనవాడు, సత్ ... మార్పు (పరిణామం) లేనివాడు, అసత్ ... మార్పులున్న(ట్లు గోచరించు)వాడు.

భావము : ధర్మాలను రక్షించే(కాచే)వాడు, ధర్మబద్ధమైన కర్మలనే చేయు(చేయించు)వాడు, ధర్మాలకు ఆధారమైనవాడు, ఎన్నటికీ ఏ మార్పులేని (సత్యమూ, నిత్యమూ అయిన)వాడు, అవతారములు ధరిస్తూ వాటిని చాలిస్తూ ఉండడం ద్వారా తానూ మార్పులకు లోనవుతున్నట్లు క(అ)నిపించేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

106. శాశ్వతుండె గాని శాశ్వతత్వమె లేదు

జీవ యన్న నతడె, శిఖలు నెన్నొ

కావలమును మరియు గల్పించు లక్షణం

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : క్షరుడు .. అస్థిరుడు, అక్షరుడు .. శాశ్వతమైనవాడు, అవిజ్ఞాత .. జీవ(యాత్మ), సహస్రాంశు .. వేనవేల కిరణాలు(శిఖలు) గలవాడు, విధాతా ... సకలమునకు ఆధారమైన(కావలము)వాడు, కృతలక్ణణ ... సకల జీవులకు పదార్థ లక్షణములు కల్పించువాడు.

భావము : ప్రళయం తర్వాత కనబడకుండా పోవునట్లున్నవాడు, కాగా ప్రళయం సృష్టించేదీ, పునఃసృష్టి కర్తా కూడా తానే అయినందున శాశ్వతమైనవాడు కూడా తానే అయినవాడు, జీవాత్మగా ఏమీ తెలియనట్లుండేవాడు, సకలమునకు ఆదారమైన(కావలము అనగా ఆదారమే)వాడు, సకల జీవులకును పదార్థ లక్షణములు కల్పించువాడు ( మరొక భాష్యం ప్రకారం లక్షణం అనగా పవిత్ర గ్రంథం. అనగా వేద సంకలనం గావచ్చు. దానికీ తానే కర్త యైనవాడు). అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.} ( మరొక భాష్యం ప్రకారం లక్షణం అనగా పవిత్ర గ్రంథం. అనగా వేద సంకలనం గావచ్చు. దానికీ తానే కర్త యైనవాడు). అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


------------------------

శ్లో. గభస్తినేమి సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః !

ఆది దేవో మహా దేవో దేవేశో దేవ భృద్గురుః !!52!!

-------------------------------- (నామాలు 486 - 493)



107. కాంతి రుక్కులెన్నొ, కలడెదలన్నిటా

ప్రాణులకును ప్రభువు, భారి బలుడు !

ఆది దేవుడతడె అన్ని హరించునూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : గభస్తి నేమి .. వేలాది కాంతి కిరణాలు(రుక్కు అనగా కిరణం), సత్త్వస్థ ... సాత్వికుల హృదయాలందు వసించువాడు, సింహా ...సింహ బలుడు లేదా నరసింహుడే, భూత మహేశ్వర .. భూతములన్నిటికీ(ప్రాణులన్నిటికినీ) ప్రభువు, ఆది దేవ ... మొదటి దైవం మరియూ (మరో భాష్యం ప్రకారం) అన్నీ హరించువాడు.

భావము : వేలాది కాంతి కిరణాలతో జగతిని ప్రభావితం చేస్తున్నవాడు, మరొక భాష్యం ప్రకారం అదే సుదర్శన (మయూఖ) చక్రం. అందున్న చువ్వలే (spokes) కిరణాలు. కాగా, భక్తుల (సాత్త్వికుల) హృదయాలలో వసించి యుండేవాడు, సింహ (భారి అంటే కూడా సింహమే)బలుడు, సమస్కత భూతములకు(ప్రాణులకు) ప్రభువు, మొట్ట మొదటి దేవుడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

( వివరణ: మరో భాష్యం ప్రకారం ఆది అనగా తినడం, దేవ అనగా పరిణామం చెందడం కనుక అన్నిటినీ హరిస్తాడనుకోవచ్చు ... ప్రళయకాలంలో జరిగినదీ అదే కదా)

108. కరుణ, జాలి, మమత కల మహా దేవుడు,

లయమొనర్చు సృష్టి లక్షణముగ !

దేవతలకె ప్రభువు, దేవ భృద్గురువుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : మహాదేవ ... పరమ శివుడు, దేవేశ ... దేవతలకు ప్రభువు, దేవ భృద్గురువు ... దేవేంద్రుని గురువు.

భావము : కరుణ, జాలి, మమత వంటి సద్గుణాలెన్నో కలబోసి యున్న మహాదేవుడు, సృష్టిని లయం చేసే పరమ శివుడు, దేవతలకు ప్రభువు, దేవేంద్రునికే గురువు గా సంభావింపబడుతున్నవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞాన గమ్య పురాతనః !

శరీర భూత భృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః !!53!!

-------------------------------- (నామాలు 494 - 502)

109. గొప్ప యనగ తానె, గోపతి యతడెగా

చేరు జ్ఞాని కడకు చేదుకొనును

అతి పురాతనుండు ననగ యా స్వామియే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఉత్తర ... అందరికన్నా అధికుడు, గోపతి... గోవులకు ( భూమికి, వాక్కుకు, వేదాలకు సైతం) ప్రభువు, గోప్తా ... సర్వజన రక్షకుడు, జ్ఞానగమ్యం ... జ్ఞానులకు గమ్య స్థానం, పురాతన ... అతి ప్రాచీనుడు.

భావము : అందరికన్నా అధికుడు(గొప్పవాడు), గోవులకు (మరో భాష్యం ప్రకారం భూమికి, వాక్కుకు, వేదాలకు సైతం) ప్రభువైనవాడు, సర్వజన రక్షకుడే అయినా ప్రత్యేకించి జ్ఞానులకే అతి సులభంగా చేరువ కాగలవాడు అనగా గమ్యస్థానం అయినవాడు, అత్యంత పురాతనమైనవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

110. కాయమందె యుండి కాచు, వాడే భోక్త,

కపులలోన యతడె కపివరేణ్య

భూరి దక్షిణొసగు భూవరుడాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : శరీర భృత్ ... శరీరమందే ఉంటూ దానిని పోషించువాడు, భోక్త ...భుజించువాడు, కపీంద్ర ... కపులలో శ్రేష్ఠుడు, భూరి దక్షిణ .. భారీగా వితరణ చేయువాడు,.

భావము : మొత్తం 36 తత్వాలతో నిండిన ఈ శరీరంలోనే ఉంటూ దీని పోషణ భారం వహించువాడు, యజ్ఞ యాగాదులందునూ, ఇతర పూజాదికాలందునూ ... కడకు ప్రళయ కాలమందునూ భోక్తయై వ్యవహరించువాడు, వానరజాతిలో కెల్లా శ్రేష్ఠమైనవాడు( కపి పదానికే వరాహము అనే మరో యర్థమూ ఉన్నది కదా), యజ్ఞ యాగాదులందునూ, ఇతర క్రతువులందునూ నైవేద్యములనూ, భక్తినీ దక్షిణగా స్వీకరించువాడు, రామ, కృష్ణావతారాలందు తానే విరివిగా గోదానం, సువర్ణదానం, భూదానం వగైరాలు చేసిన వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

(వివరణ: 1. శరీర భృత్ కు సంబందించి ... మానవ శరీరము చర్మము, రక్తము, గుజ్జు, మాంసము మరియూ నవరంద్రాలు, నవనాడులు, జ్ఞానేంద్రియాలు, గుణాలు తదితర మొత్తం 36 తత్త్వాలతో నిండి ఉంటుంది. వీటన్నిటా ఆ శ్రీ హరి తానై ఉంటాడు. కనుకే మనకు సులభ గ్రాహ్యం కావడం లేదని జ్ఞానుల భాష్యం.

2. కపీంద్ర ... రామాయణంలో మానవావతారుడైన శ్రీహరికి అండగా నిలిచేందుకు పలువురు దేవతలు సైతం వానర రూపాలు ధరించారనేది మరో భాష్యం. ఆ వివరం ప్రకారం...

ఇంద్రుడు ... వాలి, సూర్యుడు ... సుగ్రీవుడు, వాయువు ... హనుమాన్, విశ్వ కర్మ ... నలుడు, అగ్ని ... నీలుడు, వరుణుడు ... సుషేణుడు, కుబేరుడు ... గంధమాదనుడు, పర్జన్యుడు ... శరభుడు. ఇత్యాదులు.... )



------------------------

శ్లో. సోమపోమృతపః సోమః పురుజిత్పురుసత్తమః !

వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాంపతిః !!54!!

-------------------------------- (నామాలు 503 - 512)

111. సోమ రసము త్రాగు, సుర పానమే జేయు

సోముడాయె నతడె యోషధులకు

పురుల గెలిచినట్టి పురుసత్తమతడుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సోమప ..సోమరసము త్రాగువాడు, అమృతప ... అమృతము (సుర) సేవించినవాడు, సోమ ...చంద్రుడు, పురుజిత్ ...పురులను అనగా రక్కసులను గెలిచినవాడు, పురుసత్తమ ... పురుషులలోకెల్లా ఉత్తముడు.

భావము : యజ్ఞయాగాదులలో సోమరసమును (అనగా జలము కావచ్చును, తిప్పతీగ రసమూ కావచ్చును, అభిషేకాదులలో ప్రధానంగా జలమును, పంచామృతములను వినియోగిస్తారు కదా) స్వీకరించువాడు, అమృతము సేవించినవాడు ( సాగర మధన సమయంలో అమృతమూ జనించగా దానిని తాగినవాడు శ్రీహరి. మరో భాష్యం ప్రకారం సాధ సజ్జనుల హృదయాలందలి భక్తి రసము గ్రోలువాడూ ఆ శ్రీహరియే....కదా), సోముడనగా చంద్రుడే. అతడే సకల ఓషధీ వృక్ష జాలానికి జీవము ప్రసాదించువాడు కూడా, వేలాది సంఖ్యలో శతృవులను అనగ రక్కసులను జయించిన వాడు( భక్తులలోని దానవ, దుర్గుణాలను అణచివేయువాడు), పురుషోత్తముడూ( ఉత్తమ పురుషుల హృదయాలలో కొలువైనవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

112. వినయ మొసగు నతడు, విజయుడు నాతడే

వాస్తవాలె పలుకు, వాసుదేవ

సాత్వతాంపతి యన సరియగు భావనే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : వినయ ... వినయశీలి (వినయ శీల ప్రదాత), జయ ... జయములు సాధించినవాడు, సత్యసంధ ... వాస్తవాలు మాత్రమే పలుకువాడు, దాశార్హ ... దానములకు, దక్షిణలకు అర్హమైనవాడు, యాదవ కులీనుడు, సాత్వతాంపతి ... సాత్విక జనుల హృదయాలలో వసించువాడు.

భావము : వినయ అనగా వినయ శీలి అనే అర్థమున్నప్పటికీ శ్రీహరికి వర్తింపజయవలసినప్పుడు వినయ శీలమును కలగ జేయువాడు అనే భావించాలి కదా, అనేకానేక విజయాలు సాధించిన వాడు, సదా వాస్తవాలు మాత్రమే పలుకువాడు (ఆయన మాటే వేదవాక్కు మరి), దాశార్హ అనగా యాదవ కులోద్భవుడైన వాసుదేవుడే, మరో భాష్యం ప్రకారం దానాలను ఇవ్వడానికీ, స్వీకరించడానికీ కూడా అర్హమైనవాడు, సాత్వికులైన భక్తుల ప్రభువు, వారి హృదయాలలో అధివసించి యుండేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}



------------------------

శ్లో. జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః !

అంభోనిథి రనంతాత్మా మహోదధి శయోన్తకః !!55!!

-------------------------------- (నామాలు 513 - 520)



113.జీవు డనగ వాడె, జీవుల వియ్యమె

వీక్ష సేయు మరియు విడుపు నిడును

అమిత విక్రముండు, అంభోనిధి యతడెగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : జీవ ... జీవుడు( పరమాత్మ), వినయితా సాక్షి ... వినయము(వియ్యము) చూచువాడు, ముకుంద ... విముక్తి (విడుపు) ప్రసాదించువాడు, అమిత విక్రమ ... బలాఢ్యుడు, అంభోనిధి ... అంభస్సులకు ఆవాసమైనవాడు.

భావము : జీవాత్మ తానే అయినవాడు,జీవులలోని అనగా భక్తులలోని వినయ శీలాన్ని (మాత్రమే) పరిగణనలోకి తీసుకొని ముక్తి ప్రసాదించువాడు, అమితమైన బలము గలవాడు, అంభస్సులు అనగా దేవతలు, రాక్షసులు, మానవులు, పితరులు అను నాలుగు వర్గాలవారికీ నిది అనగా నిలయమైన(ఆవాసము కల్పించు)వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

114. అంతులేని యాత్మ యా పరమాత్మదే

పాలసంద్రమందె పండుకొనును

ప్రళయ కాలమందు పరమ శివుడె గదా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అనంతాత్మ ... అనంతమైన ఆత్మ గలవాడు, మహోదధి శయ .. పాలకడలియందే పవళిస్తున్నట్లు దర్శనమిచ్చేవాడు, అన్తక ... అంతము చేసేవాడు.

భావము : అంతూ దరీ లేని ఆత్మ గలవాడు, పాలకడలిలోనే (ఆదిశేషునిపై పవళిస్తున్నట్లు గోచరించేవాడు, ప్రళయ కాలంలో పరమశివుడై సమస్తమూ లయం గావించువాడువాడు లేదా భక్తగణాలలోని దుర్లక్షణాలను అంతము చేయువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. అజో మహార్హః స్వాభావ్యో జితా మిత్రః ప్రమోదనః !

ఆనన్దో నన్దనో నన్దః సత్య ధర్మా త్రివిక్రమః !!56!!

-------------------------------- (నామాలు 521 - 520)

115. పుట్టుకనగ లేదు, పూజార్హులలొ మిన్న

తనదు శైలి యెపుడు తనకె యెరుక

రక్కసులను జంపు, రంజిల్లు, మోదమే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అజ ... జన్మయే లేనివాడు, మహార్హ ... అర్హులలో కెల్లా మిన్నయైనవాడు, స్వాభావ్య ... తన స్వభావం తనకు మాత్రమే తెలిసినవాడు, జితామిత్ర ... అమిత్రులను అనగా రక్కసులను జయించినవాడు, ప్రమోద ... సదా ఆనందిస్తూనే ఉండేవాడు, ఆనంద ... ఆనందమే తానైనవాడు.

భావము : పుట్టుకనేదే లేనివాడు, పూజార్హులలో కెల్లా మిన్నయైనవాడు, తన స్వభావమూ, శైలీ తనకు మాత్రమే తెలిసినవాడు(దైవ లీల ఎవరమూ చెప్పలేము అనగా తన పనులకు ఇదీ కారణం అని చెప్పలేము కదా), తనను సదా ద్వేషించేవారిని అనగా రక్కసులనే జయించువాడు(మానవకోటిలో తనకు వ్యతిరేకంగా ధర్మ విరుద్ధంగా సాగే ఆలోచనలను త్రుంచివేయువాడు), తనకు తానుగా ఎప్పుడూ చిద్విలాసుడై యుండేవాడు, అట్టి ఆనందమే తానైన వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

116. పంచు నానందమే, ప్రాపంచికములైన

ఒత్తిడులకు నెపుడు నొదగ బోడు

సత్య ధర్ముడతడె, శంఖపాణియు వాడె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : నందన ... ఆనందం పంచువాడు, నంద ... ప్రాపంచికములైన ఒత్తిడులకు లొంగని(అందని లేదా ఒదగని)వాడు, సత్యమైన ధర్మాలకే నిలయమైనవాడు, త్రివిక్రమ ... వామనుడు.

భావము : భక్త జనులకు (ఆధ్యాత్మికమైనట్టి) ఆనందం పంచువాడు, ప్రాపంచికములైన ఒత్తిడులకు (అనగా వాంఛలకు) లొంగని లేదా అందని లేదా అతీతమైన వాడు, సత్య మైన ధర్మమును ఆచరించువాడు లేదా ఆచరింపజేయువాడు ( అనగా యోగాకు అధిపతి యనీ దానిని అనుసరించే వారికే తాను అందుబాటులో ఉంటాడనీ బావించవచ్చు), వామన మూర్తి అనగా మూడడుగుల నేలనే కోరి అనంతంగా పెరిగినవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. శంఖపాణి అంటే కూడా విష్ణువు అనే అర్థమున్నది. వామనుడు విష్ణ్వావతారమే కదా....}

------------------------

శ్లో. మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీ పతిః !

త్రిపద స్త్రి దశాద్యక్షో మహా శృంగః కృతాన్త కృత్ !!57!!

-------------------------------- (నామాలు 531 - 537)



117.ఋషులలోన కపిల ఋషి యన నాతడే

కృతము నెరిగి మరి సుకృతము సేయు

మేదినీపతిగను వేదములను గాచె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : మహర్షి కపిలాచార్య ... మహర్షులలో కపిలాచార్య అయినవాడు, కృతజ్ఞో ... కృతజ్ఞతా భావం గలవాడు, మేదినీ పతి ... భూపతి.

భావము : మహర్షులలో కపిలుడైనవాడు, భక్తుల పట్ల కృతజ్ఞతా భావం కలవాడు, భూపతి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

(వివరణలు : 1. దేవహూతికి కర్దమ ప్రజాపతి వలన కపిలునిగా జన్మించినది శ్రీ మహా విష్ణువు అంశయే. తల్లికి జ్ఞానోపదేశం చేసినవాడు, సాంఖ్య యోగాచార్యునిగా ప్రసిద్ధి కెక్కినవాడే ఈ కపిల మహాముని.

2. కృతము అనగా చేయబడినది. జ్ఞ అంటే తెలుసుకోవడం. కనుక భక్తులు చేసిన సేవలనూ, కీర్తనలనూ అనగా భక్తి రసాన్ని స్వీకరించి తదనుగుణంగా మేలు చేయువాడు అనగా కోరికలు తీర్చడమో, మోక్షము ప్రసాదించడమో చేసేవాడు,

3. మేదిని అంటే భూమియే. వేదాలు అపహరణకు గురైనప్పుడూ, హిరణ్యాక్షుడు చెలరేగినప్పుడూ భూభారం వహించినవాడు శ్రీ మహావిష్ణువే కదా. కనుకనే ఆయన మేదినీపతి అయినాడు.)

118. మూడు పదములకును మూలమన నతడె

మూడు దశల కతడె నీడు నరయ

కిరముగాను బుట్టె కీడు తొలగ జేయు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : త్రిపద ... మూడు పదములు, త్రిదశ ... మూడు దశలు, మహా శృంగ ... భీకరమైన కొమ్ము గలవాడు, కృతాంత కృత్ ...విముక్తి కలగజేయువాడు.

భావము : (వామనుని కోరికగా చెప్పుకునే ...) మూడు అడుగులతో విశ్వము యావత్తూ ఆక్రమించుకున్నవాడు, మరొక వివరం ప్రకారం ... మూడు (సత్త్వ రజస్తమో )గుణాలకూ, మూడు కాలాలకూ, సృష్టి, స్థితి, లయాలకూ, కర్త, కర్మ, క్రియలకూ కూడా మూలమైనవాడు, అలాగే స్వప్న, జాగృత, సుషుప్త్యావస్థలకు అధిపతి(నీడు అనగా రాజు, అదిపతి) అయినవాడు, భీకరమైన కొమ్ముగలవాడు (వరాహస్వామి యని ఒక వివరం కాగా, మత్స్యమేనని వేరొక భాష్యం ... అయితే కొమ్ము లేదా కోరలను ప్రాతిపదికగా తీసుకుంటే కిరము అనగా ఆదివరాహమే సరైనదనిపిస్తున్నది), సంపూర్ణ విముక్తి కలగజేయువాడు ( మరియొక భాష్యం ప్రకారం యముడే...అలాగనుకున్నప్పటికీ యముడి లక్ష్యమూ విముక్తి కల్పనే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. మహా వరాహో గోవిన్దః సుషేణః కనకాన్గదీ !

గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః !! 58!!

--------------------------------(నామాలు 538--546)

119. సూకరముల యందు సూడగా మిన్నయె

వేదముపనిషత్తు లెరుకబరచు

వాని సేన నెపుడు వర్ణింపలేముగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : మహా వరాహో ... గొప్ప సూకరము, గోవిన్ద ... వేదాలు, ఉపనిషత్తుల ద్వారా తెలియగలవాడు, సుషేణ ... సుసంపన్నమైన సేన గలవాడు.

భావము : ఆది వరాహావతారుడు, వేదాలు, ఉపనిషత్తుల ద్వారానే తెలియగలవాడు (మరొక భాష్యం ప్రకారం గో అనగా ఆవులు, వేదాలు, వాక్కు, భూమి అనీ చెప్పవచ్చు ఆ ప్రకారంగా వాటికి అధిపతియై కాపాడేవాడు అనుకోవచ్చు), గెప్ప శోభస్కరమైన సేన గలవాడు.. (ఆ స్వామికి సేన అంటే సాధు సజ్జనాది అనుచర గణమే ... ఇందున్నది సదాచార తత్పరులు, దేవతలు, ఋషితుల్యులు, జ్ఞానులు ఇత్యాదులే...కనుక సేన యనగానే సమరాంగణంలో పాల్గొనేదే అనుకోనక్కర్లేదని ఒక భావంగా ఉన్నది. దీనిని వర్ణించడమూ అసాధ్యమే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

120. పసిడి నగలతోడి మిసి నిండ భుజములు

హృదయ గుహలొ నుండు నెదతొ చూడ

జ్ఞాన సంపదున్న గంభీరుడాతడు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : కనకాంగదీ ... స్వర్ణమయ భుజకీర్తులు గలవాడు, గుహ్య ... గోచరము కానివాడు, గభీర ... గంభీర స్వభావి.

భావము : స్వర్ణమయమైన నగలు, భుజకీర్తులతో వెలుగొందువాడు(మిసి అనగా కాంతి), జనుల హృదయాలలో ఉంటూనే అంత సులభంగా గోచరించనివాడు(వేదాలు, ఉపనిషత్తుల ద్వారా మనసుకు మాత్రమే తెలియగలవాడు), జ్ఞానైశ్వర్యములు, తత్త్వాలతో నిండియుండీ గంభీర స్వభావి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

121. కనగ మనుజులకును గహన మతడు గాదె

గుప్తుడైన నేమి గూర్మి చూపు

చక్ర గదలె యున్న శాంత స్వరూపుడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : గహన ... సులభముగా చేరువ కానివాడు, గుప్త ... నిగూఢమైనవాడు, చక్ర గదాధర ... చక్రము, గద ధరించియున్నవాడు.

భావము : ఉనికి తెలిసినట్లే యున్నప్పటికీ వేదోపనిషత్తులు, తత్త్వసారం అద్యయనం చేసినప్పుడు మాత్రమే గోచరించేవాడు(లేకుంటే సులభంగా గోచరించనివాడు), సగుధు సజన భక్తుల యెదలో గుప్తంగానే అధివసించి ప్రేమను పంచేవాడు, చేతులలో చక్రం, గద ఉన్నప్పటికీ భక్తులకు శాంతాకారంగానే భాసించువాడు( చక్రం పేరే సు ... దర్శనం, కాగా గద నామము కౌమోదకి... వైరులను మోదడం ద్వారా భక్తులకు మోదము పంచునదనీ చెప్పుకోవచ్చు కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః !

వరుణో వారణో వృక్షః పుష్కరాక్షో మహామనః !! 59!!

--------------------------------(నామాలు 547--557)

122. సృష్టి కర్త యతడె, సృజన సాధనములు

జిష్ణుడతడె యెపుడు జితుడు కాడు

స్థిరమనస్కుడాయె, స్థితియె మారదెపుడు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : వేధా ... సృష్టి కర్త, స్వాంగ .. సృజనకు తగిన సాధనములు, అజిత ... పరాజితుతడు కానివాడు, కృష్ణ ... నల్లనివాడు, నీల మే్ఘశ్యాముడు (జిష్ణుడు), దృఢ ... స్థిరమైనవాడు, సంకర్షణోచ్యుత ... పరిణామము చెందనివాడు.

భావము : సృష్టికర్తా, సృజనకు కావలసిన సాధన సంపత్తి కూడా తానే అయినవాడు(మరియొక భాష్యం ప్రకారం స్వాంగో అనగా సుందరమైన అంగములు గలవాడు), ఎవరిచేతిలోనూ, ఏనాటికీ పరాజితుడు కానివాడు, యదుకులోద్భవుడూ (నల్లనయ్యే) , స్థిరమైన (దృఢమైన) మనసు గలవాడు, ప్రళయకాలంలో సైతం, సర్వమూ తనలో కలుపుకున్నప్పటికీ తానుగా ఏ మార్పులకూ లోనుగానివాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

123. వరుణు డతడె మరియు వరుణుని పుత్రుడూ

సజ్జనులకు నెపుడు సాలమతడు

గగన మంత తానె, గగన మంత హృదియె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : వరుణ ... సాయంకాలపు సూర్యుడు, వారుణ ... వరుణుని కుమారుడు, వృక్ష ... చెట్టు, పుష్కరాక్ష ... అంతరిక్ష(ఆకాశ)మంతయు ఆవరించియున్నవాడు, మహామన ... గొప్ప (ఆకాశమంతటి)మనసు గలవాడు.

భావము : పశ్చిమాద్రికి చేరే సూర్యభగవానునే వరుణుడు అంటాము. అస్తమయ సమయంలో సూర్యుని రూపంలో హరియే(సూర్యనారాయణ అంటే ఆయనే కదా) లోకంలోని సమస్త కాంతినీ తనలో కలుపుకుంటాడు. (అయితే ఆ వెంటనే తానే చంద్రునిలా వెన్నెలలూ కురిపిస్తాడు. కాబట్టి ఇక్కడ తనలో కలుపుకునేది మానవుల హృదయాలలో చెలరేగుతున్న దుర్గుణాలనే అనుకోవచ్చునేమో. )కాగా, వరుణుని పుత్రుడూ, భక్తుల పాలిట కల్పవృక్షమూ, అంతరిక్షము అనగా ఆగాశమంతా ఆవరించియున్నవాడు, ఆకాశమంతటి విశాల హృదయుడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

(ఒక వివరణ : మిత్రా వరుణులకు అగస్త్య, వసిష్ఠుల రూపంలో జన్మించినదీ శ్రీహరి అంశయే కదా...)



------------------------

శ్లో. భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః !

ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణు ర్గతిసత్తమః !! 60 !!

--------------------------------(నామాలు 558--566)

124. ఆరు లక్షణములు, నావిరె ప్రళయాన

వేడ్క సేయు నతడె, వైజయంతి

మాల కంఠమందు, హాలుడు నాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : భగవాన్ ... భగమను ఆరు లక్షణములు గలవాడు, భగహా ... (ప్రళయకాలయమందున ) ఆరు లక్షణములనూ తిరిగి తనలో విలీనం చేసుకునేవాడు, వేడ్క (వేడుక) అనగా ఆనందం పెంచువాడు, వనమాలి ... వైజయంతీ మాల ధరించువాడు, హలాయుధ ... హలమునే ఆయుధముగా గలవాడు (హాలుడు అనగా బలరాముడు).

భావము : భగము అంటే కేవలం వీర్యమే కాదు, శీలము, కీర్తి, ధర్మము, జ్ఞానము, సంపదలు ... ఈ ఐదూ కలిసినప్పుడే వీర్యము అనగా వీరత్వము అదే శక్తి.... వాటిని కలిగి ఉన్నవాడే భగవంతుడు, కాగా, ప్రళయ కాలమున ఈ ఆరింటినీ కూడా లయం చేసేవాడు కనుకనే భగహా (అనగా మానవులకు కలుగుతున్నాయనుకునే గుణాలూ, వాటిని లయం చసేదీ కూడా ఆయనే), జగదానంద కారకుడు(వేడుక లేదా వేడ్క అనగా ఆనందమనే అర్థమూ ఉన్నది), కంఠమునందు ఎన్నటికీ వాడిపోని ఆకులూ, పువ్వులతో కూడిన వైజయంతీ మాలను ధరించి యున్నవాడు, హలధారియైన బలరామావతారుడు ( కృష్ణ, బలరాములిద్దరూ విష్ణ్వావతారాలుగానే ప్రసిద్ధి కదా) అనగా హాలుడే అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}



125. అదితి సుతుడు తానె, అంబరీషుడు దానె

ద్వంద్వ లక్షణముల తాళుచుండు

సకల జనులకెపుడు సరియగు సదనమే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఆదిత్య ... అదితి కుమారుడు, జ్యోతిరాదిత్య ... సౌరమండలంలో జ్యోతి స్వరూపుడు, సహిష్ణు ... ద్వంద్వ లక్షణములను సహించు(తాళు)వాడు, గతి సత్తమ ... సత్పురుషులకు తగిన ఆశ్రయము(గతి).

భావము : బలి చక్రవర్తిని పాతాళానికి పంపడం కోసం కశ్యపునికి అదితి వల్ల వామనునిగా అవతరించినవాడు, సౌర మండలంలో దివ్య జ్యోతి స్వరూపుడు అనగా అక్కడి నుంచి లభించే కాంతులకు కారణమైనవాడు (సకల జీవులకు కావలసిందంతా అందించువాడు ...Sun, the great grand giver .. అనునది మరో భాష్యం), జనన మరణాలు, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు వంటి ద్వంద్వాలను అదుపులో ఉంచువాడు, వాటకి తాను అతీతమైనవాడు, సాధు సజ్జనులకు సరియైన ఆశ్రయం (సదనము ... గతి) కల్పిస్తున్నవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. సుధన్వా ఖండ పరశు ర్దారుణో ద్రవిణ ప్రదః !

దివః స్పృక్ సర్వ దృక్ వ్యాసో వాచస్పతి రయోనిజః !! 61 !!

--------------------------------(నామాలు 567--573)

126. తృణత గలదు తనకు సృణుల కూలార్చగా

ఖండ పరశువుండె దండనలకు

దారుణంబె రూపు, తరగని నిథులిచ్చు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సుధన్వ ... మంచి విల్లు (తృణత), సృణులు ... శత్రువులు (రాక్షసులు), కూలార్చు .. కూల్చు అనగా సంహరించు, ఖండపరశువు ... గండ్రగొడ్డలి, తగనివారు ... దుర్జనులు (రాక్షసులు), ద్రవిణ ప్రద ... నిధులిచ్చువాడు.

భావము : సారంగమను ధనుస్సు చేబూనివాడు, పరశురామావతారుడు, పగతురకు బీభత్స రూపంలో గోచరించువాడు, భక్త జనులకు ఆధ్యాత్మిక సంపదలిచ్చువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

(వివరణ : సారంగపాణి. దానికి దుర్మార్గులు భీతిల్లవచ్చు కానీ, భక్తులకు నేత్ర పర్వమే. అందుకే సుధన్వ అయింది. దశావతారములలో పరశురామావతారమూ ఉంది. అది దుర్జనులైన రాజులను వధించానికే ఆయన పరశువును ఆయుదంగా చేపట్టాడు.( మనలో చెలరేగే దుర్లక్షణాలకు, దుష్టశక్తులకూ కూడా అదే ఆయుధం గావచ్చు.) దండనలంటే శిక్షలే అంటే అణచివేయడమే కదా..)

127. నింగి దాక నేగె నిజరూపమును జూప

ఆగమంబు దెలుపు వ్యాసుడాయె

పారుషుండు తానె, పారాశరుండుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : దివః స్పృక్ ...నింగిని తాకినవాడు, ఆగమము ... వేదాలు, వ్యాస ... వ్యాస భగవానుడే (సర్వ దృక్ వ్యాస అనగా వేదాలను విభిజంచి మరీ సర్వజనులకు వివరణాత్మకముగా అందించినవాడు), వాచస్పతి .... బృహస్పతి అనగా వాక్పతి (పర్యాయ పదమే పారుషుడు), అయోనిజుడు ... సహజ ప్రసవము లేకుండగనే జన్మించినవాడు ... పారాశరుడు అనగా వ్యాసులవారే.

భావము : కురుక్షేత్ర సంగ్రామ సమయాన అర్జునికి గీత బోధిస్తూ సందర్భ వశాన విశ్వరూపము చూపినవాడు, వేదాలను విభజించి వివరణాత్మకంగా అందించిన వ్యాసుడు (అతడే అయోనిజుడైన పారాశరుడు), వాచస్పతి అనగా వాక్పతి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

(వివరణ : వాస్తవానికి వేదం ఒక్కటే. దానినే నాలుగు భాగాలుగావిభజించినవాడే వ్యాసుడు.అవే ... ఋుగ్వేదము, దీనిలోనే 21 శాఖలు. ఋక్ అనగా మంత్రం. దీనిలోనే దూర్వాణి (ప్రస్తుత టెలిపోన్) వంటి అనేక ఆధునిక పరికరాల గురించి ఉన్నది. ఆయుర్వేదం, ధనుర్వేదం కూడా దీనిలో భాగాలే. కాగా, రెండోది యజుర్వేదం. దీనిలో నూటొక్క శాఖలు. మరియూ ఇదే కృష్ణ, శుక్ల యజుర్వేదాలని రెండు రకాలు.ఇది యజ్ఞ, యాగాదులకు సంబందించినది. కనుకే దీనిలో స్మృతులు, మంత్రాలు, ప్రార్థనలు ఉంటాయి. మూడోది సామవేదం. సామము అనగా గానము. దేవతలను గానం చేయడానికి ఇది అనువుగా ఉంటుంది. దీనిలో వేయికి పైగా శాఖలున్నాయి. చివరిదే అధర్వణవేదం. దీనిలో 90 శాఖలు.

ఇక పారాశరుడే వ్యాసుడు. పరాశర మహర్షి వలన మత్స్య (యోజన)గంధికి అనగా సత్యవతికి జన్మించినవాడే పారాశరుడు. అయితే ఆమె కన్యాత్వము చెడకుండా పరాశరుడు ముందుగానే వరం ప్రసాదించడం వలన పారాశరుడు అయోనిజుడవుతున్నాడనేది ఐతిహ్యం.

------------------------

శ్లో. త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ !

సన్న్యాస కృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్ !! 62 !!

--------------------------------(నామాలు 574--585)

128. మూలమంత్రములకు మూలమె యాతడు

సామ గాయకుండు, సామమతడె

బంధములను తెంచు, భవరోగముల బాపు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సామ వేదములోని మూడు మంత్రములచే స్తుతింప బడువాడు, సామగ ... సామగానము చేయువాడు, సామ ... సామమే అయినవాడు, నిర్వాణ ... బంధ విముక్తి, భేషజం ... ఔషధం.

భావము : సామవేదంలోని మూడు రకాల(మంత్రాల)తో స్తుతింపబడువాడు, సామ గానము చేయువాడు, ఆ సామమే తానైనవాడు, భవబంధములను తెంచువాడు, భవరోగములకు చక్కని ఔషధమైనవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

(వివరణ : ముందుగానే పేర్కొన్నట్లు సామ వేదంలో ఒక వివరణ ప్రకారం వేయికిపైగా శాఖలుండగా మరొక చోట వంద మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే రెండు రకాల భాష్యాలలోనూ దీనిని జైమినీ మహర్షియే బయటి ప్రపంచానికి అందించినట్లున్నది. కాగా, ఇందులో ప్రధానంగా మూడు రకాలున్నాయంటారు. అవే బృహత్సామం, రథంతర సామం, వాసుదేవ్య సామం. ఈ మూడింటియందూ ఉన్నవాడూ, వీటి ద్వారా స్తుతింపబడువాడే శ్రీహరి.

నిర్వాణం ... ఇది సంస్కృత పదమే ... సంపూర్ణ జ్ఞానం కలగడం వల్ల కోర్కెల నుంచీ, దుఃఖం నుంచీ, జనన మరణాల చక్రమైన సంసారం నుంచీ విముక్తి సిద్ధించడం అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ కాలక్రమేపీ భౌద్దుల ప్రభావంతో ...సజీవ స్థితిలోనే మనస్సు సంపూర్ణ ప్రశాంతిని అనుభవించడమే నిర్వాణం అనే భావన బలపడింది. ఏదేమైనా వివిధ ప్రాపంచిక ఆలోచనలూ, బాధల నుంచి విముక్తి సాధనమే నారాయణ మంత్రంగా చెప్పుకోవచ్చు . దీనివలన కోర్కెలూ, కోపతాపాలూ నశించి నిజమైన సుఖం, ఆనందం లభిస్తాయి కదా)

129. వైద్యుడనగ తానె, వైరాగ్య ధాతయే

శమము, నిష్ఠ, మరియు శాంత రూపి

శాంతమొసగు నతడె, సజ్జన ధామమే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : భిషక్ ... వైద్యుడు, సన్న్యాస కృత్ ... సన్న్యాసాశ్రమ వ్యవస్థాపకుడు, శమము ... శాంతి, నిష్ఠ ... నిలకడ, శాంత ... శాంత స్వరూపి, శాంతి ... శాంతింప జేసేవాడు, పరాయణము ... పరమ ధామము.

భావము : భవ బంధాలనే రుగ్మతల నుంచి గట్టెక్కించే వైద్యుడు, సన్న్యాసాశ్రమం సృష్టించడం ద్వారా మోక్ష మార్గం చూపువాడు, (బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం తర్వాత చివరిదే సన్న్యాసం కదా...దైవ చింతనలో గడిపేవారు విషయవాంఛలు లేకుండానే వీటిని అవలంబించగలరు కూడా) కామక్రోధాదులను అణచివేయడం ద్వారా శాంతికి బాటలు వేసుకొనునట్లు చేయువాడు, భక్తుల హృదయాలలోనే నిలకడగా యున్నవాడు, గుణరహితుడై తనను నమ్మినవారికి సకల శాంతులు ప్రసాదించువాడు, సాధు సజ్జనులకే గాక సర్వ ప్రాణులకూ అంతిమ ప్రస్థానమైనవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః !

గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృష ప్రియః !! 63 !!

--------------------------------(నామాలు 586--595)

130.అతని రూపు జూడ యది మనోహరముగా

శాంతి దాత యతడు, స్రష్ట యతడె

ప్రజల ఫలము జూసి ప్రమదము నందునూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : శుభాంగ ... మంగళప్రదమైన రూపం, శాంతి ద ... శాంతి ప్రదాత, స్రష్ట ... సృష్టి కర్త, కుముద ... భూమి (యందు) గురించి ఆనందించువాడు(ప్రమదము ఆనందమే కదా).

భావము : మంగళప్రదమైన రూపం గలవాడు, భక్త జనులకు సకల విధ రుగ్మతల నుంచీ, భవబంధనాల నుంచి విముక్తమూ తద్వారా శాంతినీ ప్రసాదించువాడు, సృష్టి కర్తా, భూమి యందు లేదా భూమిని చూసి అనగా అవనిపై నున్న జీవులు కర్మఫలాలను అనుభవిస్తున్న తీరుచూసి ఆనందించువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

131. జలధి శయనుడతడు, జగతికి హితుడుగా

గోపతిగను తానె గోప్త యగును

వృషభ నేత్రుడతడె, వృషముల నేస్తమూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : కువలేశయ .. సాగర(జలధి) శయనుడు, గో హిత ... భూమికి హితుడు, గో పతి ... భూపతి, గోప్త ... రక్షకుడు, వృషభాక్ష ... ధర్మ (వృషభ) దృష్టి గలవాడు అనగా ధర్మమే నేత్రములుగా గలవాడు, ధర్మములకు(మాత్రమే) ప్రియుడు(నేస్తము).

భావము : అనంత క్షీర సాగర శయనుడు(మరో భాష్యం ప్రకారం కర్మ ఫలానుసారం వివిధ జీవులను తగిన దేహముల యందు నియమించువాడు), భూమికి ( లేదా గో అంటే వేదాలు, వాక్కు, గో గణమూ కావచ్చు) హితుడైనవాడు, జగతి(భూమి)కి పతియై, రక్షణ (గోప్త) కల్పించువాడు, ధర్మములే నేత్రములుగా గలవాడు, ధర్మాలకు మాత్రమే ప్రియ నేస్తమూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమ కృచ్ఛివః !

శ్రీవత్స వక్షః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః !! 64 !!

--------------------------------(నామాలు 596--604)

132. ధర్మ పథము నుంచి తప్పడెపుడు తాను

విజితుడవగ నీడు విషయములకు

క్షియము జేయు నతడె క్షమ దాత యనగ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అనివర్తీ ... ధర్మం నుంచి తప్పుకోడు, నివృత్తాత్మా ... ఇంద్రియ జ్ఞానానికి లొంగడు (లొంగిపోనివ్వడు), సంక్షేప్తా ... సంక్షిప్తం (క్షియము ) అనగా తగ్గుదల చేయువాడు, క్షేమ కృత్ ... భక్తులకు క్షేమమే కలుగజేయువాడు.

భావము : ధర్మపథం నుంచి తప్పుకోనివాడు అనగా భక్తజనులను సదా ధర్మమార్గముననే పయనింపజేసేవాడు, కాగా ... నివృత్తాత్మాఅను నామానికి రకాల భాష్యాలున్నాయి. ఒక భాష్యం ప్రకారం భక్తులు ధర్మమార్గం నుంచి తప్పుకోకుండా చూసేవాడు. మరొక రకంగా తానే ఇంద్రియ పరమైన విషయాలకు లొంగనివాడు అనగా నియమిత మనస్కుడు( ఇన్ని విధాలుగా ఉన్నపుడు భక్తితో ఎలా తీసుకున్నా సానుకూలప్రదమైనదైతే ఫర్వాలేదనుకుంటున్నాను), ప్రళయకాలమున జగత్తును తనలో లీనం చేసుకోవడం ద్వారా పరిమాణము తగ్గించు (క్షయించు)వాడు, సాధు సజ్జనులకు సదా క్షేమమే అందించువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

133. వాముడైన తానె, వక్షమందు శశము

సిరికి వాసమతడు, సిరికి బతియె

ఉన్నవారి కెల్ల నుత్తము డాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : శివ ... శుభములిచ్చువాడు(పర్యాయపదాలలో వామ శబ్దమూ ఉన్నది), శ్రీవత్స వక్షము ... వక్షము( హృదయము)పైన శ్రీవత్సము (శశము అనగా కుందేలు) కలవాడు, శ్రీవాస .. లక్ష్మికి వాసమైనవాడు, శ్రీపతి ... లక్ష్మీ పతి, శ్రీమతాం వర ... శ్రీమంతులందరిలోకీ ఉత్తముడు.

భావము : శివుడనగా పరమ శివుడే సందేహం లేదు.... ("శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు ర్విష్ణోశ్చహృదయం శివః" ... అని గదా సూక్తి,), హృదయముపై కుందేలు వంటి మచ్చ (తెలుపు రంగులో)కలిగి యున్నవాడు (ఆ మచ్చయే శ్రీవత్సము), లక్ష్మీదేవికి వాస స్థానమైన హృదయము గలవాడు (సాధారణంగా చిత్రపటాలలో అమ్మవారు విష్ణువు పాదాల చెంత ఉన్నట్లు పేర్కొంచారు. కానీ వాస్తవానికి ఆమె నివాసం ఆయన వక్షమే ... కదా) , లక్ష్మీదేవికే భర్త, శ్రీమంతులలో ఉన్నతమైనవాడు( వరింపదగినవాడు ... ఇచ్చట శ్రీమంతుడు అనగా సంపద గలవాడు అదే జ్ఞాన సంపద అనుకోవచ్చు ...) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీ విభావనః !

శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోక త్రయాశ్రయః !! 65 !!

--------------------------------(నామాలు 605--614)





134. సంపదిచ్చు నతడె, సతికియా గుణమిచ్చు

జ్ఞానవాసమాయె జ్ఞాన నిధిగ

శ్రీ విభావననగ శ్రీధరుడాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : శ్రీ ద అనగా సంపద ఇచ్చువాడు, శ్రీశ ... మహాలక్ష్మికి శ్రీ లక్షణము ఇచ్చినవాడు, శ్రీనివాస ... శ్రీకి నివాసమైనవాడు, శ్రీనిధి ... శ్రీ కి నిధియైనవాడు, శ్రీ విభావన ... ఫలాలు అందించువాడు, శ్రీధర ... శ్రీని ధరించినవాడు.

భావము : శ్రీ అనే ఏకాక్షర పదానికే జ్ఞానము, సంపద, ఐశ్వర్యము. శోభ, కీర్తి, బుద్ధి వంటి అర్థాలున్నాయి. కనుక ఈ పద్యములో పదే పదే వచ్చిన ఈ పదమునకు సందర్భానుసారంగా రకరకాల భాష్యాలను చెప్పుకోవలసి ఉంటున్నది. మహావిష్ణువు లక్ష్మికి అధినాథుడు. అయితే అన్నీ తానే అయినవాడు కావడం చేత ఆమెనూ తానే ఐశ్వర్య దేవత చేశాడని ఒక భాష్యం. అలాగే విభావన అను పదానికి అవగాహన కల్పంచువాడు అనియూ, శ్రీని కర్మఫలాలను పంచువాడు అనియూ రెండురకాల భాష్యాలున్నాయి. శ్రీ నివాస అంటే లక్ష్మీనివాసమనీ, జ్ఞానులకు ఆశ్రయమనీ కూడా చెప్పుకోవచ్చును. శ్రీనిధి, శ్రీధర నామాలలోని శ్రీ కి కూడా సిరిసంపదలు లేదా జ్ఞానము వంటి అర్థాలు చెప్పుకోవచ్చును కదా. ఇలా ఎన్ని భాష్యాలకైననూ తావీయగల ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

135. శ్రీ కరుడెగ తాను, శ్రేయమొసగుచుండు

అష్ట సంపదలకు నధిపతియెగ

మూడు లోకములకు ముఖ్యుడు నాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : శ్రీ కర ... శ్రీకి నిలయమైన లేదా కరము వదలనివాడు, శ్రేయ ... శ్రేయమొసగువాడు, శ్రీమాన్ ... సర్వసంపదలకు అధిపతి, లోక త్రయాశ్రయ ... మూడులోకములకు ఆశ్రయము కల్పించువాడు.

భావము : యుగమేదైననూ లక్ష్మి చేయి వదలని వాడు (నరసింహ, రామ, కృష్ణ అవతారాలే నిదర్శనం కదా), సాధు సజ్జనులకు సర్వ శ్రేయోదాత, సకల ఐశ్వర్యములకూ అధిపతి, మూడులోకాలకూ ఆశ్రయదాత( మరియొక భాష్యం ప్రకారం జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలకు మూలపురుషుడు అనగా అధిపతి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతి ర్గణేశ్వరః !

విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి శ్ఛిన్నసంశయః !! 66 !!

--------------------------------(నామాలు 615--623)

136. కనులు చూడ గొనబు కనగ శుభాంగుడే

ఆత్మలందె యుండు నరుసమందు

పొందుచుండు ముదము పూష గణేశుడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : స్వక్ష అనగా సు అక్ష ... అందమైన కనులు( గొనబు అనగా మనోజ్ఞము), స్వంగ అనగా సు అంగ ... శుభాంగుడే, అరుసము అనగా హర్షము, పూష గణేశుడు ... పూషుడు అంటే సూర్యుడు, గణేశుడు గణములకు ప్రభువు(జ్యోతిర్గణేశ్వర అనడంలో భావం పూషాది వెలుగులు ప్రసాదించే గణములన్నిటికీ అధిపతి అనే).

భావము : అందమైన కనులున్నవాడు, మనోహరమైన రూపము గలవాడు, తాను సృష్టించిన కోట్లాది జీవుల యందే ఉంటూ మమేకం కావడాన్ని ఆనందించేవాడు(చేసేదీ, చేయించేదీ అంతా తానే కదా కనకే తన చేష్టలకు తానే ఆనందించడం అనుకోవచ్చునేమో),

సూర్యాధి వెలుగునిచ్చే గ్రహ, గణములన్నటికీ తానే అధిపతి యైనవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

137. భక్తులకును బంది, భక్త విధేయుడు

ఖ్యాతి పొందెనెపుడు భ్రాతి గాను

సర్వమెరిగినవాడె సంశయ రహితుడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : విజితాత్మ ... ఆత్మలకు తలొగ్గేవాడు, విధేయాత్మా ... ఆత్మలకే విధేయుడు, సత్కీర్తి ..ఘనమైన కీర్తి గడించినవాడు, భ్రాతి ... ఘనము, ఛిన్న సంశయ ... ఛిన్నమైన అనగా చెదరిపోయిన సంశయాలు గలవాడు.

భావము : ఆత్మలు అనగా నిజమైన భక్తులకు లొంగేవాడు, వారికే విదేయుడుగా ఉండేవాడు, గొప్ప కీర్తి ప్రతిష్ఠలు సొంతం చేసుకున్నవాడు, సర్వమూ తెలిసినవాడు గనుక సంశయాలనేవి ఏవీ లేనివాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. ఉదీర్ణః సర్వత శ్చక్షు రనీశః శాశ్వత స్థిరః !

భూశయో భూషణో భూతి ర్విశోకః శోక నాశనః !! 67 !!

--------------------------------(నామాలు 624--632)

138. జీవులన్ని తానె, జీవులపై దృష్టి

స్వామి తానె యెపుడు, శాశ్వతుండు

భూ శయనుడు మరియు భూషణుండును దానె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఉదీర్ణ... జీవులన్నియూ తానే అయినవాడు, సర్వతశ్చక్షు ... సర్వత్రా దృష్టి కలిగియుండు, అనీశ ... స్వామి అనగా ప్రభువు లేదా నాయకుడు లేనివాడు( తనే స్వామి), శాశ్వత స్థిర ... యెప్పటికీ శాశ్వతమైనవాడు, భూశయ ... భూమిపై శయనించువాడు, భూషణుడు ... ఆభరణమైనవాడు.

భావము : జీవులన్నియూ తానే అయినవాడు మరియూ సర్వ శ్రేష్ఠుడు, సర్వత్రా తన దృష్టి ప్రసరించువాడు, సకలానికి తానే స్వామియైనవాడు, ఎప్పటికీ శాశ్వతమైనవాడు, భూమిపై శయనించువాడు, భూమికే భూషణుడైనవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

(ఒక వివరణ : రామావతార సమయంలో ఆయన నేలపైనే శయనించేవాడు. మరో విదంగా ఆయన స్వయానా భూదేవికి భర్త గావున భూమిపై శయనించాడనటంలో అసహజమేమీ లేకపోవచ్చు. కాగా, వేరొక భాష్యం ప్రకారం మాత్రం దీనినే తిరగవేసి చెప్పుకోవచ్చు. అనగా భూమియే అనగా చరాచర జగత్తే ఆయన యందు విశ్రాంతి పొందుతున్నది... యని.)

139. మోక్ష సంపదలకు మూలమైనవాడు

శోక భావములనె సోకడెపుడు

కొలువ దుఃఖములను పొలుపర జేయుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : భూతి ... ఉనికి, సంపదలకు నిలయం, విశోక ... శోకభావనలు లేనివాడు, సోకడు అనగా తాకడు, శోకనాశన ... శోకములను నాశనము చేయువాడు, పొలుపర జేయు అనగా నశింపజేయు.

భావము : భక్తులలోనే ఉంటూ మోక్షసంపదలకు నిలయమైనవాడు(భూతికి ఉనికి కలిగి యుండుట, సకలైశ్వర్య నిధి అని వేర్వేరు అర్తాలు కానవస్తున్నాయి), తనకు ఏ విధమైన శోకములు ఉండవు తానుగా తాకడు(సోకడు) అని ఉన్నప్పటికీ వాస్తవంలో అవే ఆయనను అంటలేవని చెప్పుకోవాలి, తనను నమ్మి కొలిస్తే సర్వ విధ కష్ట నష్టాలను పోగొట్టేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. కాలనేమినిహా వీరః శౌరిః శూర జనేశ్వరః !

త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిహా హరిః !! 69 !!

--------------------------------(నామాలు 642--650)

142. కాలనేమి నతడె కాలరాచెను గాదె

వీరు డతడె, శౌరి, శూర జనుల

కెల్ల మిన్న యతడె ముల్లోకముల కాత్మ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : కాలనేమిని హా ... కాలనేమిని అను రాక్షసుని చంపినవాడు, వీర ... వీరుడు, శౌరి ... శూర వంశీకుడు, శూర జనేశ్వర ..శూరులైన జనులకు అధిపతి, త్రిలోకాత్మ ... మూడులోకాలందున తానే.

భావము : కాలనేమి యను రాక్షసుని సంహరించిన వాడు, వీరుడు, శూరుని వంశమునజన్మించిన వాడు, శూరులలో కెల్ల మిన్న(ఈశ్వర అంటే ప్రభువు అంటే అధికుడు)యైనవాడు, మూడులోకములకు తానే ఆత్మ యైనవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

(ఒక వివరణ : వసుదేవుని తండ్రి శూరుడను యాదవ రాజు. వసుదేవుని పుత్రుడే కృష్ణుడు. కనుకే ఆ అవతార మూర్తిని అనగా విష్ణువును వాసుదేవుడనీ, శౌరి యనీ కూడా వ్యవహరిస్తారు.

త్రిలోకాత్మ ... ముల్లోకాలకూ ఆత్మయైనవాడని ఒక భావం కాగా, లోకానికి గల విస్తృతార్థం తీసుకుంటే సుషుప్తి, స్వప్న, జాగ్రదావస్థలన్నిటా ఆయనే ఉంటాడని కూడా చెప్పుకోవచ్చు.)

143. మూడు లోకములకు చూడ నతడె దిక్కు

క్లేశముల హరించు కేశవునిగ

కేశినడగ జేసె, కిణ్వములను బాపు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : త్రిలోకేశ ... ముల్లోకాలకూ ఈశుడు అనగా ప్రభువు, కేశవ ... క్లేశములు తొలగించువాడు, కేశిహా ... కేశి యను రాక్షసుని చంపినవాడు, హరీ ... పాపములను హరింపజేయువాడు.

భావము : ముల్లోకాలకు ప్రభువు (దిక్కు), క్లేశములను పారద్రోలువాడు, లేదా నిడుపాటి క్శములు గలవాడు లేదా సూర్య చంద్రాది కిరణములే కేశములుగా గలవాడు, కేశి యను రాక్షసుని చంపినవాడు, కిణ్వము అనగా పాపములను పోగొట్టి అనగా హరింపజేయువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. కామ దేవః కామపాలః కామీ కాంత కృతాగమః !

అనిర్దేశ్యవపు ర్విష్ణుః వీరోనంతో ధనంజయః !! 70 !!

--------------------------------(నామాలు 651--650)

144. కామ దేవుడతడు, కామ పాలన సేయు

కామి యనగ నతడు, కాంత యతడె

సత్యవతికి బుట్టె సర్వము తానెగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : కామ దేవ ... కామము తీర్చువాడు, కామపాల .. కోరికలను దారిలో పెట్టువాడు, కామీ ... కోరదగినవాడు, కాంత ... బ్రహ్మను సైతం తనలో కలుపుకున్నవాడు, కృతాగమ ... ఆగమములను అనగా వేదాలను సృజించినవాడు.

భావము : ధర్మార్థ కామ మోక్షములలో ఒకటైన కామమును తీర్చువాడు, అదే సమయాన అది సరైనదిగా అనగా తుచ్ఛమైన కోరిక గాక ధర్మబద్ధమైనదే అయి ఉండునట్లు చూచువాడు, సర్వజనులు కోరదగినవాడు( సర్వులకూ తానే దిక్కు గదా), కాంత అనగా రమణీయమైన రూపసి అని ఒక భావం కాగా, క అనగా బ్రహ్మ అంత లయము చేయు కనుక ప్రళయకాలములో సృష్టి యావత్తూ తనలో కలుపుకున్నప్పుడు ఆయన కుమారుడే అయిన బ్రహ్మ కూడా ఆయనలోనే లీనం అవుతాడనేది మరో భాష్యెం. ఇక కృత్ ఆగమ అనగా వేదాలను సృజించినవాడు. సత్యవతి తనయుడైన వేదవ్యాసులవారే. అయితే ఆయనా తన అంశయేనని గీతలో పేర్కొన్న ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

145. నిర్వచింప లేము నిజమగు రూపమూ

దూరభూమి లేని వీరుడతడె

అర్జునుండు దానె యంతమె యెరుగడు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అనిర్దేశ్యవపు ... నిర్దేశింప లేదా నిర్వచింప సాధ్యం కాని, విష్ణు ... విశ్వమంతా వ్యాపించువాడు, వీర ... వీరుడు, అనంత ... అంతము లేనివాడు, ధనంజయ ... అర్జునుడు.

భావము : ఆయన రూపం ఇదమిత్థంగా ఇదీ అని చెప్పడానికి వీలులేనివాడు, దూర ప్రాంతం అంటూ ఏమీలేకుండా సర్వత్రా వ్యాపించగలవాడు, వీరుడు, అంతమనేది లేనివాడు, అర్జునునికి గల వివిధ నామాలలో ధనంజయుడు అనేది కూడా ఒకటి. యాగ సమయంలో అతను విజయాలు సాధించి కప్పంగా ధనం గెలుచుకున్నాడంటారు కదా... కాగా, నరనారయణులిద్దరూ ఒకటేననీ, పాండవులలో తాను కిరీటిననీ గీతలోనే పరమాత్ముడు పలికాడు కదా...)

------------------------

శ్లో. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ వివర్ధనః !

బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః !! 71 !!

--------------------------------(నామాలు 661--670)

[ మనవి : ఈ శ్లోకం సర్వం బ్రహ్మ మయం. కనుక ప్రతి పదార్థముగా గాక, భావార్థపరంగానే...]

---------------------

146. బ్రహ్మ యనగ తానె, బ్రహ్మమె తానుగా

బ్రాహ్మణుండు మరియు బ్రహ్మవిదుడు

బ్రహ్మి గానె తాను బ్రాహ్మణ ప్రియుడుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ భావము : బ్రహ్మ జ్ఞానము తెలిసినవాడు, దానినే బోధించువాడు(గురు దేవోభవ కదా), దానిని బాగుగా గ్రహించిన వారి(కే)కి ప్రియమైనవాడు, వేద వేదాంగములే తానై, బృహత్ స్వరూపి యైన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

నామార్థాలు :

బ్రహ్మణ్య ... బ్రహ్మ (అనగా సకల శాస్త్రాలు, వేదాలు, సత్యం, ధ్యానం తదితరాల సారం.... అదీగాక బ్రహ్మ తన కుమారుడు కూడా కదా)కు అభిమాని, బ్రహ్మకృత్ ... వేదాల సృజిన కర్త, బ్రహ్మ ... సృష్టి కర్త,బ్రహ్మ .. పెద్దది...(బ్రహ్మాండం అనడంలో భావం అదేకదా), బ్రహ్మ వివర్ధన... తపస్యాదులను వృద్ధి చేసేవాడు, బ్రహ్మ విద్ ... బ్రహ్మము తెలిసినవాడు, బ్రాహ్మణ ... బ్రహ్మము బోదించువాడు, బ్రహ్మీ ... వేదాములే అంగములుగా గలవాడు, (అనగా తానే వేద వేదాంగములనుకోవచ్చు), బ్రహ్మజ్ఞ ... బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, బ్రాహ్మణప్రియ ...బ్రహ్మజ్ఞానము తెలిసినవారికి ప్రియుడు, తెలిసినవారినే ప్రేమించువాడు.

------------------------

శ్లో. మహాక్రమో మహా కర్మా మహా తేజా మహోరగః !

మహా క్రతు ర్మహా యజ్వా మహా యజ్ఞో మహా హవిః !! 72 !!

--------------------------------(నామాలు 671--678)

147. పరమ పదమునకును పద్ధతులను చూపు

కర్మలెన్నొ జేయు కాంతులీను

సర్పరాజు తానె సాగర మధనాన

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : మహాక్రమ ... గొప్పవైన (క్రమమైన) పద్ధతులు , మహాకర్మా ... గొప్ప కార్యములు, మహా తేజా ... కాంతి మంతుడు, మహోరగ ... సర్పరాజు.

భావము : తనను చేరడానికి స్వామియే మంచి మార్గాలు ఏర్పరిచాడు. అవే సాధు, సజ్జనసేవ, శ్రద్ధ, భక్తి, దీక్ష, ఆత్మ జ్ఞానము...వగైరా( వాస్తవానికి అవీ తానే....), మంచి కర్మలు నిర్వర్తించువాడు (నిజానికి తానే కర్మా చేయడు, దేనికీ బందీ కాడు కూడా), గొప్ప తేజోమయ రూపుడు, సర్పరాజైన వాసుకి రూపాన సాగర మధనంలో తాడుగా ఉపయోగపడిన వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

148. యాగములలొ నతడె యశ్వమేధంబుగా

యజ్ఞములను సేయు యాజ్ఞికుడును

అసలు యజ్ఞమతడె, హవియును నతడెగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : మహాక్రతు ... గొప్ప యాగం, మహా యజ్వా ... యాగములు చేయువాడు, మహా యజ్ఞ ... గొప్ప యజ్ఞము, మహా హవి ... గొప్ప హవిస్సు.

భావము : యాగాలలో గొప్పదైన అశ్వమేధరూపుడు, యాగములు చేయువారిలో గొప్పవాడు (రామావతారంలో తానే అశ్వమేధం చేయడమూ, కుశలవులు ఆ అశ్వాన్ని బంధించడమూ తెలిసినదే కదా), మరో భాష్యం ప్రకారం ఎక్కువ మంది ఉపాసకులు అనగా యాజకులు గలవాడు, అసలు యజ్ఞమూ, హవిస్సూ కూడా తానే అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. స్తవ్య స్తవప్రియః స్తోత్రమ్ స్తుతిః స్తోతా రణప్రియః !

పూర్ణః పూరయితాః పుణ్యః పుణ్య కీర్తి రనామయః !! 73 !!

--------------------------------(నామాలు 679--689)

149. స్తవ్యుడనగ తానె, స్తవమునెగోరునూ

స్తవము తానె, పొందు స్తవము నెపుడు

సాధు సజ్జనులనె స్తవము జేసెడు వాడు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : స్తవ్య ... స్తవమునకు అర్హుడైనవాడు, స్తవ ప్రియ ...స్తవమునకు ప్రియుడు అనగా కోరెడివాడు, స్తోత్రమ్ ... స్తోత్రమే (అనగా స్తవమే) తానైనవాడు, స్తుతి ... స్తోత్రము అనగా స్తవము పొందువాడు, స్తోతా ... స్తోత్రమ్(స్తవము) చేసెడివాడు.

భావము : స్తుతించడానికి అర్హుడైనవాడు, సాధిు సజ్జనుల స్తుతిని అనగా వారు చేసే ధర్మబద్ధమైన ప్రార్థనలను ఆశించేవాడు(పరమ శివుని అభిషేక ప్రియుడు అన్నరీతినే...), అసలు స్తవమే తానై నిజమైన జ్ఞానులను తానుగా స్తుతించేవాడు అనగా ఆదరించేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

150. పోరు సలపగలడు భూమి రక్షణకును

పూర్ణులనుగ జేయు, పూర్ణుడతడె

పుణ్య కీర్తి తనది, పొందడే మాయనూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : రణప్రియ ... సమరోత్సాహి, పూర్ణ ... పూర్ణ పురుషుడు, పూరయితా ... కోరికలను నెరవేర్చు, పుణ్య కీర్తి ... శుభప్రదమైన కీర్తి గలవాడు, అనామయ ... మాయకు అందనివాడు.

భావము : తన భక్తులకు గాని, భూమాతకు గాని ఆపద ఎదురైనదనుకున్నప్పుడు ఎవరితోనైనా యుద్ధానికి సిద్ధమయ్యేవాడు, తనకంటూ ఏ కోరికలూ లేని పూర్ణపురుషుడు, భక్తుల కోర్కిలనునెరవేర్చడం ద్వారా వారిని సైతం పూర్ణ పురుషులను చేయువాడు (పుణ్య అను ామానికి గల అర్థము కూడా పుణ్యాత్ములను అనగా పూర్ణ పురుషులను చేయడమే ...కోరికలేవీ మిగలని వారూ పూర్ణపురుషులైన పుణ్యాత్ములైనవారే కదా), మిక్కిలి శుభప్రదములైన కీర్తి ప్రతిష్ఠలు గలవాడు, ప్రాపంచిక మాయలు లేదా అవి కల్పించే వ్యాధులు వేటికీ అందనివాడు(వాస్తవానికి వాటిని సృష్టించేదీ ఆయనే అంటే అది విషయాంతరం కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

--------------------------------------------

శ్లో.మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః !

వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః !! 73 !!

--------------------------------(నామాలు 690--698)



151. వేగమందు మనసు, వేదాలు సృజియించె

పరమ పురుషులకును పసిడి రేత

శుభము, మోక్ష మొసగు, శూర వంశీకుడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : మనోజవ ... వేగములో మనసు వంటివాడు, తీర్థకరో ... తీర్థాలు చేసినవాడు, వసురేతా ... బంగారం వంటి తేజము లేదా రేతస్సు గలవాడు, వసుప్రద మరియూ వసుప్రదో... శుభము (ఐశ్వర్యము) మరియూ మోక్షము నొసగువాడు,వాసుదేవ ... వాసుదేవుని సుతుడు.

భావము : భక్తులను, ధర్మాన్ని కాపాడటానికి మనోవాయు వేగాలతో పయనించువాడు, వేదాలు లేదా గంగాది పుణ్య నదులను సృజించినవాడు, బ్రహ్మాది దేవతలకు జన్మనిచ్టినవాడు( ఆయన రేతస్సు నీటిలో పడి స్వర్ణమయ అండం కాగా అందుండి బ్రహ్మ ఉద్భవించాడని ఒక వివరణ. కాగా, ఆయన తేజముతోనే కృష్ణుడు అవతరించాడని మరో భాష్యం), శుభము (అదే ఐశ్వర్యము కదా) మరియూ మోక్షము ప్రసాదించువాడు,శూరసేన వంశీకుడైన వసుదేవుని కుమారుడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

152. సకల లోకములకు శరణమే యాతడూ

వసుధ పైన తనకు వలపు యెంతొ

యజ్ఞ యాగములలొ హవిసన యాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : వసు ... సర్వులకూ శరణ్యమైనవాడు, వసుమనా ... వసుధ పట్ల మనసు లగ్నము చేయువాడు, హవి .. తానే హవిస్సు యైనవాడు.

భావము : సమస్త లోకములకూ శరణ్యమైనవాడు లేదా తానే సకల జీవుల యందు వసించియున్నవాడు, వసుధ(విశ్వమే) పట్ల మరియూ తనను కన్న తండ్రియైన వసుదేవుని పట్ల ఆదరాభిమానములు గలవాడు, యజ్ఞ యాగాదులలో హవిస్సు కూడా తానే అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః !

శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః !! 75 !!

------------------------------------(నామాలు 699--707)

153. సద్గతియును దానె, సత్కృతి కర్తగా

శక్తి జూపగలడు, సంపదలతొ

సత్పరాయణుడును, సమర సేనలె మిన్న

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సద్గతి ... సరియైన గతి అనగా ఆశ్రయం, సత్కృతి .. మంచి పనులు, సత్తా ... శక్తి లేదా సత్, సద్భూతి ... సంపద, సత్పరాయణ ... ఆత్మ జ్ఞానులకు అంతిమ గమ్యం, శూర సేన ... శూరులైన సేనలున్నవాడు.

భావము : సాధు సజ్జనులకు సరియైన ఆశ్రయమిచ్చువాడు, స్వామిగా ఎల్లప్పుడూ మహోన్నత కార్యములు చేయువాడు(రామ, కృష్ణ వంటి అవతారముల ద్వారా స్వామి చేసినవన్నీ జగత్కల్యాణ కార్యక్రమములే కదా), సత్ అనగా చైతన్యము నుంచి అగ్ని, దాని నుంచి జలము, జలము నుంచి భూమి, భూమి నుంచి చెట్లు... ఇలా జీవులకు ఆహారం అందిస్తూ తానే అందు అంతర్లీనంగా ఉంటాడు కనుక శ్రీహరినే శక్తి అనవచ్చు కదా, భూతి అనగా సంపద అంటారు గనుక జ్ఞాన సంపదల స్వరూపి, సత్కార్యములతో ఆత్మ శుద్ధి పొందిన సాధువులకు చివరి గమ్యం తానే అయిన వాడు, రామ, కృష్ణాది వివిధ అవతారములలో రక్కసులను చంపడానికి తగిన శూరులైన సేనలను కలిగి యుండే ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

154. యదుకులమ్ములోన యతడెగా శ్రేష్ఠుడూ

సన్నివాసమాయె సజ్జనులకు

యమున వంటి వాడె యామున ప్రభువుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : యదు శ్రేష్ఠ ... యదు వంశ శ్రేష్ఠుడు, సన్నివాస ... సరియగు నివాసము , సుయామున ... యమున వంటివాడు.

భావము : కృష్ణావతారుడైన శ్రీహరియే యదువంశ శ్రేష్ఠుడు, సధాసజ్జులకు ఆయన సన్నిధియే ఆవాసము లేదా ఆయనే వారి హృదయాలలో నివాసముంటాడు. యాదవ ప్రముఖులైన స్త్ర్రీ పురుషులతో పాటు గోప జనంతో పరివేష్టించి ఉంటాడు కావున సు యామున అంటారని చెప్పవచ్చు. కాగా, గోప బాలురు అంటే కేవలం గోవులను మాత్రమే కాచే వారు కాదనీ, వేదాలను ఉపనిషత్తులన బడే పాలను పంచేవారనీకూడా చెప్పుకోవాలనేది ఒక భాష్యం. అట్టి గోపబాలురకు ప్రభువు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. భూతా వాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః !

దర్పహా దర్పదా దృప్తో దుర్ధరో థాపరాజితః !! 75 !!

------------------------------------(నామాలు 708--716)

155. భూత వాస మతడు, పుడమిని మాయెగా

ప్రళయమందు హితుడు ప్రాణులకును

అనల గాను యతడె యమిత సంపదలిచ్చు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : భూత వాస ... భూతములందుండువాడు, వాసుదేవ ...మాయ చేయువాడు, సర్వాసు నిలయ ... ప్రాణులను తనవద్దకు చేర్చుకునేవాడు, అనల ... అమితమైన శక్తి, సంపదలిచ్చువాడు.

భావము : సకల భూతములనందునూ వసించి యుండువాడు లేదా సకల భూతములకూ ఆవాసమైనవడు, వాసుదేవుడనునది సామాన్య అర్థం ఉన్నప్పటికీ ఇంకొక భాష్యం ప్రకారం విశ్వాన్ని మాయతో కప్పి ఉంచువాడు, ప్రళయ కాలమందున సకల ప్రాణులను తన వద్దకు చేర్చుకునేవాడు, అమితమైన శక్తి సంపదలకు (అనగా జ్ఞాన సంపదగానే భావించవచ్చు కదా) నిలయమై అర్హులకు అందజేసేవాడు... అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

156. దర్పముల హరించు, దర్పమే యందించు

గర్వమాభరణమె కనగ యెపుడు

ధారణకును రాడు, తరమె గెలువ వాని

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : దర్ప హా ... గర్వము అణగ దొక్కుతాడు, దర్ప ద ... దర్పము ప్రసాదించువాడు, దృప్తా... గర్వమూ ఆభరణంగానే గలవాడు, దుర్ధర ... ధారణకు అందనివాడు, అపరాజిత ... గెలువ శక్యము కానివాడు.

భావము : గర్వాంధకారమును పటాపంచలు చేసేవాడు, అర్హులై వారికి తానే తగిన దర్పము అనుగ్రహించువాడు(దర్పము అనగా కేవలం గర్వమే గాక ఉత్సాహము, ప్రోత్సాహము, కస్తూరి వంటి సువాన అను నానార్థాలూ ఉన్నాయి), కేవలం యోగ సాధనతోనే ఆయనను చేరుకోవడం సాధ్యపడనీయనివాడు, ఏనాటికీ ఎవరి వలనా పరాజితుడు కానివాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. విశ్వ మూర్తి ర్మహా మూర్తి ర్దీప్త మూర్తి రమూర్తి మాన్ !

అనేక మూర్తి రవ్యక్తః శతమూర్తిః శతాననః !! 77 !!

------------------------------------(నామాలు 717--724)

157. విశ్వమూర్తి యతడు, విగ్రహ రూపియే

దివ్య జ్ఞాన జ్యోతి దీప్త మూర్తి

కాయ మదియు లేదు, కనగ మూర్తులె యెన్నొ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : విశ్వమూర్తి ... విశ్వమే మూర్తీభవించినవాడు, మహా మూర్తి ... గొప్ప మూర్తిమంతం, దీప్త మూర్తి ... సంపూర్ణ జ్ఞానం మూర్తీభవించినవాడు, అమూర్తిమాన్ ... శరీరమే లేనివాడు, అనేక మూర్తి ... అనేక అవతారాలు ధరంచినవాడు.

భావము : విశ్వమే మూర్తీభవించినవాడు, పరిపూర్ణ జ్ఞానంతో విశిష్టమైన మూర్తిమంతమైనవాడు(విగ్రహ రూపి అనగా గొప్పదైన అనే అర్థమూ ఉన్నది కదా), ఆలోచిస్తే కర్మ సంబందితమైన అనగా కర్మలు చేయాల్సిన సాధారణ ప్రాణకోటి శరీరం లాంటిదేమీ లేదు, కాని స్వామి మూర్తులే అనేకం. (మనం ఎలా అనుకుంటే అలా, ఏ పేరుతో పిలుచుకుంటే ఆ పేరుకు తగిన రూపంలో మన మనోఫలకంపై దర్శనమిస్తాడు కదా !) అట్టి యా శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

158. గుణము రూపు లేవి గోచరములె కావు

మూర్తి లెన్నొ గలవు, ముఖములట్లె

ఎన్ని యున్ననేమి యన్ని విశ్వమునకె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అవ్యక్త ... గోచరముకాడు, శతమూర్తి ... అనేకానేక మూర్తులు, శతానన ... వందలాది ముఖాలు.

భావము : స్వామి రూపు రేఖా విలాసాలు ఊహించుకోవడమే గాని సాధారణ కండ్లకు కన్పట్టవు. అలాగే జీవ కోటిఅంతటా తానే ఉంటాడు గనుక శతాధిక మూర్తులు గలవాడంటారు. ఎన్ని ఉన్నా ఏమి చేసిన విశ్వ కల్యాణానికే కదా. అట్టి యా శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. ఏకో నైకః సవః కః కిమ్ యత్తత్పదమనుత్తమమ్ !

లోక బంధు ర్లోక నాథో మాధవో భక్త వత్సలః !! 78 !!

------------------------------------(నామాలు 725--736)

159. ఏక రూపుడతడె, యెంచ భావనలెన్నొ

సోమ రూపుడతడు స్ఫూర్తి తాను

ప్రశ్న పరిధి పెరుగ ప్రత్యుత్తరమె తాను

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఏక ... ఒక్కడే, నైక ... అనేక, సవః ... సోమ రసరూపుడు, కః ...ఆనందం లేదా ప్రశ్న, కిమ్ ... ఏమిటి, యత్ ... ఏది, తత్ ... అదే.

భావము : నిజానికి పరమాత్మ ఒక్కడే. కానీ మన భావనలకు తగినట్లు ఎన్నో రూపాలుగా పొడగడతాడు. ఆయన గురించి తలెత్తే ప్రశ్నలేవైనా సమాదానం ఆయనే. అదే బ్రహ్మం. కదా. కనుక అట్టి యా శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

160. అతడె యిచ్చు మోక్షమది యొక్కటే చాలు

విశ్వ బంధు వతడె, విశ్వ పతియు

భక్త వత్సలుండు, పద్మాకరుండును

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : పదమ్ అనుత్తమమ్ ... సాటిలేని ఉత్తమ పదం, లోకబంధు ... విశ్వ బంధు, లోకనాథ ... విశ్వానికే పతి, మాధవ ... లక్ష్మీ పతి, భక్త వత్సల ... భక్తులపట్ల ప్రేమ గలవాడు.

భావము : స్వామి సన్నిథిని మించిన ఉత్తమ పదమే లేదు. పేరుకు లక్ష్మి (మా అంటే లక్ష్మి అను అర్థమున్నది. అలాగే ఆమెకే పద్మ అను పర్యాయపదము ఉన్నది. పద్మకు ఆకరం అనగా నిలయమైనవాడు పద్మాకరుడు... కదా)కే భర్త అయినప్పటికీ ఈ సమస్త విశ్వానికీ భర్త ఆ స్రీహరియే. ఆ ప్రకారంగా ఆయనే అందరికీ ప్రియ బాందవుడు. కనుకనే తన భక్తుల పట్ల మరింత ప్రేమగా ఉంటాడు. అట్టి యా శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాంగదీ !

వీరహా విషమః శూన్యో ఘృతాశీ రచలశ్చలః !! 79 !!

------------------------------------(నామాలు 737--746)

161. పసిడి వర్ణ మేను పరమ పురుషుడిది

అవయవములు నవియు అగ్ని రంగె

అరయ చందనాంగుడందరి కిష్టుడూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సువర్ణ వర్ణ ... బంగారు రంగు, హేమాంగుడు ... బంగారు (అగ్ని) వన్నె గల అవయవములు గలవాడు, వరాంగుడు... కోరదగిన శరీరుడు, చందనాంగుడు ... చందనలేపనం గల అవయవములు గలవాడు.

భావము : ఆపాద మస్తకం బంగారం పోత పోసినట్లు మెరుస్తూ, చందన లేపనంతో పరిమళంతో అందరినీ ఆకట్టుకునే ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}



162. వీరులైన హతులె, వీక్షింప బేసియే

గగన రూపుడతడు, కాంక్ష లేదు

కదలు, కదలకుండ, కదిలించు నాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : వీరహా ... వీరులను చంపినవాడు, విషమ.... బేసి అనగా అసమానుడు, శూన్య ... నిరాకారుడు, ఘృతాశీ ... ఆశామోహములేవీ లేనివాడు, అచల ... కదలనివాడు, చల ... కదులువాడు.

భావము : రావణ, శిశుపాలాది వీరులను, రాక్షసులను సైతం చంపినవాడు, సాటిలేని వాడు(బేసి అనగా సరి కానిది. మరో విదంగా సమానమైనది లేనిది కదా), శూన్యము అంటే ఆకాశానికి పర్యాయపదం. దానికీ నిర్దిష్ట రూపం ఉండదు. అలాగే శ్రీహరీ ఒక నిర్దిష్టమైన రూపం లేని నిరాకారుడే కదా, సహజంగానే ఆ స్వామికి ఆశలూ, ఆకాంక్షలూ ఉండవు.చరాచర జీవికోటి అంతటా తానే గనుక కదులుతున్నట్లు కనబడతాడు. కదలనివాడుగానూ పొడగడతాడు. వాస్తవంలో సమస్తమూ కదిలించేది తానే అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. అమానీ మాన్యదో మన్యో లోకస్వామీ త్రిలోక ధృక్ !

సుమేధా మేధజో ధన్య సత్యమేధా ధరా ధరః !! 80 !!

------------------------------------(నామాలు 747--756)

163. గర్వమసలు లేదు, గారవం కల్పించు

మాన్యుడతడు, లోకమంతువతడు

మూడు లోకములకు మూలమనగ వాడె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అమానీ ... నిగర్వి, మాన్యద ... మన్నన(గారవం) ఇచ్చు లేదా ఇప్పించువాడు, మాన్య ... పూజితుడు, లోకస్వామి ... లోకములకు అధిపతి(మంతువు అనగా రాజు లేదా ప్రభువు), త్రిలోక ధృక్ ... ముల్లోకాలకు ఆధారం (మూలము).

భావము : దైవము గనుక సహజముగానే నిగర్వి, పరమపూజ్యుడు అయిన శ్రీహరి ముల్లోకాలకూ ఆదార భూతుడు. ముల్లోకాలకు అధిపతి కూడా అయిన ఆ స్వామియే తనను నమ్మి కొలిచినవారు ధర్మబద్ధులైనపుడు తానే వారికి తగిన మన్నన లభింపజేస్తాడు. అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

164. ప్రజ్ఞకతడె నిధియు, యజ్ఞఫలమతడు

ధన్య జీవి తానె సత్యమైన

మేధయున్నవాడు, మేదినీ ధరుడాయె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సుమేధ ... మంచి మేధస్సు కలవాడు, మేధ జ ... యజ్ఞము నుంచి జనించినవాడు, ధన్య ... ధన్యజీవి, సత్యమేధ ... సత్యమైన మేధస్సు గలవాడు, ధరా ధర ... భూమి(మేదిని)ని ధరించినవాడు లేదా భూమికి ఆదారమైనవాడు.

భావము : నిత్యమూ, సత్యమూ అయిన మేదస్సు కలవాడు, యజ్ఞము వలన (నుంచి) జన్మించినవాడు (పుత్రకామేష్టి వల్లనే రామావతారం కదా), ధన్యజీవి లేదా తనవారిని ధన్యజీవులుగా చేయువాడు, భూపతి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}



------------------------

శ్లో. తేజో వృషో ద్యుతి ధరః సర్వ శస్త్ర భృతాం వరః !

ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః !! 81 !!

------------------------------------(నామాలు 757--764)

165. తేజరిల్లుచుండు, తేజమై వర్షించు

శస్త్ర ధారులందు సాటి లేదు

ఇంద్రియాశ్వములకు నింపైన పగ్గమూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : తేజో వృషో ... తేజమును వర్షింపజేయువాడు, ద్యుతి ధర .. తేజోమయమైన శరీరం కలవాడు, సర్వశస్త్ర భృతాంవరః ... శస్త్రధారులందు సాటిలేనివాడు, ప్రగ్రహ ... ఇంద్రియములనే గుర్రాలకు పగ్గం వేయువాడు.

భావము : తేజోమయమైన శరీరుడై కాంతులు విరజిమ్మువాడు (మరో భాష్యం ప్రకారం వృష అంటే వర్షించు కనుక సమస్త జీవరాశులకు అవసరమైన కాంతినీ, వేడిమినీ కూడా వర్షింపజేయువాడు), అస్త్ర శస్త్రాలను ధరించేవారిలో తనకు తానే సాటి, ఇంద్రియాలనే గుఱ్రాలకు కళ్ళెం బిగింపజేయువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

166. అడగజేయు నరుల నరమరికలు లేక

భక్త గణము కోర్కె పదిలముగను

తీర్చు, కొమ్ములెన్నొ, తెలియ గదాగ్రజ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : నిగ్రహ ... నిగ్రహించువాడు, వ్యగ్ర ... కోరికలు తీర్చడంలో నిమగ్నమైనవాడు, నైకశృంగ ... అనేక కొమ్ములున్నవాడు(న + ఏక శృంగ), గదాగ్రజ ... గదునికి అన్న.

భావము : శత్రువులను అణచివేయువాడు మరో భాష్యం ప్రకారం భక్తగణములోని అవాంఛనీయ కోరికలను నిగ్రహించువాడు, భక్తుల ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చువాడు, ధర్మ సంస్థాపనకు గాను సందర్భాన్ని బట్టి ఎన్నికొమ్ములనైనా ధరించగలవాడు, గదునికి అన్న (రోహిణికి కృష్ణుని తర్వాత గదుడు అనే మరో ప్రముఖయాదవుడు జన్మించినట్లు తెలుస్తున్నది. కనుకే స్వామి గదాగ్రజుడైనాడని భాష్యం.) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః !

చతురాత్మా చతుర్భావ శ్చతుర్వేద విదేకపాత్ !! 82 !!

------------------------------------(నామాలు 765--772)

167. భావములును, గతులు, బాహువులైననూ

ఆత్మ యైన, మూర్తులైన యతడె

వేద, వ్యూహములలొ వీక్షింప నొక్కడే

వందనాలు హరికి వంద వేలు !!

{భావము : అన్నీ నామాలే కనుక పదార్థాలంటూ ఏమీ లేవు. స్థూలంగా... నాలుగు భావములు, గతులు, బాహువులు, మూర్తులు, వేదాలు, వ్యూహాలు .... ఇలా అన్నిటా అన్నీ తానొక్కడే అయి (ఏకపాత్ అంటే ఒకే పాదము... అంటే కనిపించేది తానొక్కడే....కదా), అలా కావడానికి తగిన చతుర మైన ఆత్మ అనగా సామర్థ్యమే... గలవాడైన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

వివరణ :

---------

మూర్తులు... యుగానికొక రంగుకు ప్రతినిథి ...ఆ ప్రకారంగా కృత యుగము ... తెలుపు, త్రేతా యుగము ... ఎరుపు, ద్వాపర...పసుపు,కలి... సహజాతి సహజంగా నల్లని నలుపు. కాగా, మరో భాష్యం ప్రకారం జాగ్రద, స్వప్న, సుషుప్త, తురీయా(బ్రహ్మమే) వస్థలలో విశ్వ, తైజస(తేజస్సు), ప్రాజ్ఞ, చైతన్యం. ఇవి మూర్తీభవించినవాడు.

బాహువులు ... సత్యము, న్యాయము, దయ, శాంతి. వీటితో విశ్వ శ్రేయస్సును కాచేవాడు.

వ్యూహాలు ... గతంలో పేర్కొన్నట్లే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. కాగా, మరో భాష్యం ప్రకారం మనసు, చందసు, వేదాలు, మహాపురుషత్వం. వైరి పై విజయసాధనకు ఇవే స్వామి వ్యూహాలు.

గతులు ...బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, చివరగా సన్న్న్యాసం. స్వామిని చేరడానికి నిష్ఠగా, నిక్కచ్చిగా పాటించాల్సిన పద్ధతులు. వీటితోనే సద్గతి.

వేదాలు .... ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వీటికి మూలము, వీటిని ఔపోశన పట్టినవాడే స్వామి.

భావాలు ... ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థాలు. వీటికే ఆయన ప్రతీక. రామావతారంలో అనుసరించి చూపినవాడు కదా...

ఇక పై శ్లోకంలో మిగిలిన చతురాత్మా, ఏక పాత్ తెలిసినవ కదా..

------------------------

శ్లో. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః !

దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా....!! 83 !!

------------------------------------(నామాలు 773--781)

168.జగతి కార్యములను జరిపించు సారథిగ

తాను లేని దేది తరచ లేదు

ఏది తనది కాదు, లేదప జయమునూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సమావర్త ... (turner of the wheels) చక్రము సవ్యంగా త్రిప్పువాడు, నివృత్తాత్మా ... అన్నిటా తానై, ఏదీ పట్టనివాడు, దుర్జయ ... జయింప శక్యము కానివాడు.

భావము : విశ్వం అంతటా తానై ఏదీ పట్టనట్లు ఉంటూనే తాను సృష్టించిన ప్రకృతిలో సమస్తమూ తగిన విధంగా సాగిపోయేట్లు చూసేవాడు,ఎట్టి పరిస్థితులలోనూ ఎవరిదీ తనపైచేయి కాకుండా చూసేవాడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

169. అతని మాయె యాన, అమిత దుర్లభుడాయె

చేరలేము చూడ దూర మెంతొ

ఆశ్రయంబె యిడడు యసురుల నడగించు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : దురతిక్రమ ... అతిక్రమించడం వీలుకాదు, దుర్లభ ... తేలికగా వశము కాడు, సమీపించడం కష్టం, దగ్గర దారి అంటూ లేదు, దురావాస ... దుర్జనులకు ఆవాసం (ఆశ్రయం) లభించదు, దురారిహా ... దుర్జనులను(అసురులను) అణగజేయు.

భావము : స్వామి వాక్కును అతిక్రమించడం సాద్యం కాదు. ఎవరు ఏమి చేయాలో ఎలా చేయాలో కూడా ఆయనే ముందే రాసి ఉంచుతాడు. అంతా అలా జరిగిపోవాలసిందే కదా...నవ విధ భక్తి మార్గాలున్నాయన్నప్పటికీ ఆయన అంత తేలికగా యోగులకైనా సరే వశము కాడు. అలాగే ఆయనను సమీపంచడమూ సాద్యం కాదు. కఠోరమూ, నిర్దిష్టమూ,నిర్దుష్టమూ అయన పంధాలో సాగినప్పుడు మాత్రమే దైవ స్న్నిది సాధ్యపడవచ్చునేమో కదా. కాగా, దుర్జనులను అనగా అసురులను (అసురీ లక్షణాలను) క్షమించడు. అలాంటి వారిని తన వద్దకు రానీయడు. అట్టి యా శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. శుభాంగో లోకసారంగః సుతంతు స్తంతు వర్ధనః !

ఇంద్ర కర్మా మహా కర్మా కృత కర్మా కృతాగమః !! 84 !!

------------------------------------(నామాలు 782--789)

170. వేదముల ధరించె, విశదమె విశ్వమూ

తంతు రూపమునను తనువు పెంచె

బంధనాలు చూపి భావమునే పెంచు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : శుభాంగ ... శుభప్రదమైన అంగములు గలవాడు, లోకసారంగ ... లోకసారం తెలిసినవాడు, సుతంతు ... ఉత్కృష్టమైన తంతువు, తంతు వర్ధన ... తంతులను వర్ధిల్లజేయువాడు.

భావము : వేద శాస్త్రాలనే అవయవాలుగా ధరించడం చేత అవి మరింత శోభస్కరముగా రూపొందాయి. సర్వాంతర్యామి గనుక ముల్లోకాల సారమూ ఆయనకు ఎరుకే కదా. కోట్లాది జీవరాశులను సృష్టించడమేగాక వాటన్నిటా తానే ఉంటాడు. తంతువు అంటే తీగ . సమస్త విశ్వాన్ని కలుపుతూ తానే విస్తరించి ఉంటాడు గనుక ఆయనను సు తంతు అంటున్నారనుకోవాలి. కాగా, తాను సృష్టించిన మాయలో జనులు చిక్కుకుని తన నిర్దేశాల ప్రకారం కర్మబంధాలు సాగించేట్లు చూడడం ద్వారా తానే భూమిపై సృష్టి సజావుగా సాగేట్లు చూస్తున్నాడు. అట్టి యా శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

171. కర్మలేవియైన కనగ లోకమునకె

సృజన కర్త తానె, చివరి గతియు

విశ్వమునకు తానె వేద ప్రదాతగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఇంద్ర కర్మ ... ఇంద్రాది దేవతలకోసం చేసిన పనులు, మహా కర్మ ... గొప్ప పనులు, కృత కర్మ ... తనే చేసిన కర్మ(సృష్టి), కృతాగమ ...వేదముల కర్త.

భావము : ఇంద్రాది దేవతల కోసమే అయినా చంపినది రాక్షసులనే గనుక అది లోకకల్యాణార్థం చేసిన గొప్ప పనిగానే భావించాలి కదా. అలాగే కృతము అంటే చేసినది లేదా చేయబడినది. ఆయన చేసేది ప్రధానంగా సృష్టియే కదా మరియూ మరో భాష్యం ప్రకారం అంతిమ గమ్యము ఆయనే. ఆగమము అంటే వేదము. కనుక వేదాలు సృష్టించినవాడు. జగత్తుకు అందించినదీ ఆయనే కదా...అట్టి యా శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః !

ఆర్కో వాజనసః శృంగీ జయంతః సర్వ విజ్జయీ !! 85 !!

------------------------------------(నామాలు 790--799)

172. సాగరమును యీద శయమె యాతనిదిగా

సరవి రూపు తనది, శమమె జూపు

ధర్మములకు నాభి, ధర్మలో చనుడుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఉద్భవ ... ఉత్కృష్టమైన జన్మ లేదా భవసాగర వారథి, సుందర ... సుందరమైన( సరవి) రూపుడు, సుంద... మోక్ష (శమము) ప్రదాత, రత్న నాభ ... రత్నములకు కేంద్రమైనవాడు, సులోచన ... మంచి కనులున్నవాడు.

భావము : ఉత్కృష్టమైన జన్మ గలవాడు అనగా బ్రహ్మయే అని ఒక భాష్యం కాగా, భవసాగరము దాటించువాడు అని మరియొక వివరణ. (శయము అనగా హస్తము కనుక ఈ సందర్భంలో చేయూతగా భావించవచ్చు కదా...) సుందరమైన రూపం గలవాడు, వేద శాస్త్రము లనెడి రత్నములను తన నాభి యందు దాచుకున్నవాడు లేదా వాటికి కేంద్రమైనవాడు,ధర్మబద్ధమైన వారికి దయగా చూచువాడు గనుక ధర్మలోచనుడనవచ్చును కదా...అట్టి యా శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

173. ఆర్క యనగ జగతి నలరించునాతడూ

అన్నదాత యతడె యాది శృంగి

అరులనడగజేయు నన్ని యెరుగునుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఆర్క ... సూర్యభగవానుడు, వాజసన ... అన్నప్రదాత, శృంగి ... కొమ్ము గలవాడు, జయంతి ... శత్రుమూకను జయప్రదంగా అణచివేయగలవాడు, సర్వ విత్ జయీ ... సర్వమూ తెలిసినవాడు.

భావము : సూర్య భగవానునిగా విశ్వానికి కాంతి నందించువాడు, తానే పోషకుడు కనుక సకల జీవరాసులకూ ఆహారం (వాజము) అందించువాడు, స్వామి శృంగములు ధరించినది ఆది వరాహావతారంలోనే కదా, శత్రుమూకలను జయప్రదంగా అణచగలవాడు, అన్నియూ సాకల్యంగా యెరిగియున్నవాడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. సువర్ణ బిందు రక్షోభ్యః సర్వ వాగీశ్వరేశ్వరః !

మహా హ్రదో మహా గర్తో మహా భూతో మహా నిథిః !! 86 !!

------------------------------------(నామాలు 800--806)

174. స్వర్ణమయమె జూడ సర్వావయవములు

వ్యాకులతయె లేదు, వాక్కు కతడె

జవము, జీవమిచ్చు జలనిధి యాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సువర్ణ బిందు ... స్వర్ణ మయమైన అవయవాలు, అక్షోభ్య ... వ్యకులత లేనివాడు, సర్వ వాగీశ్వరేశ్వర ... వాక్కుకు అధిపతి, మహాహ్రద ... గొప్ప తటాకము.

భావము : ఒక భాష్యం ప్రకారం స్వర్ణమయమైన అవయవాలు గలవాడు కాగా, మరియొక భాష్యం ప్రకారం స్వర్ణం వంటి బిందువు అనగా ఓకారమే తానైనవాడు, వ్యాకులత లేనివాడు లేదా కలగకుండా చూసేవాడు, వాక్పతి, మహా జలనిధి( తానున్నదే క్షీరసముద్రంపై గదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}



175. ఘాతకులకు నతడె ఖాతకం కల్పించె

పంచ భూతములకు ప్రాణుడతడు

తనను గొల్చువారి తరగని పెన్నిధీ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : మహాగర్త ... గొప్ప అగడ్త(ఖాతకం ... కందకం), మహా భూతో ... పంచభూత స్వరూపి, మహా నిధి .. గొప్ప నిధి.

భావము : ధర్మాన్ని అతిక్రమించే వారికి (ఘాతకులు అనగా దుష్టులే కదా) వారికోసం పైలోకాలలో నరకం పేరిట పెద్ద కందకం వంటిది ఏర్పాటుచేసినవాడు (ఇందులోనే మొత్తం 27 విభాగాలు ఉంటాయి) , నింగీ, నేలా నీరూ, నిప్పూ,వాయువు అనే ఐదు భూతాలకూ ఆయనే ప్రాణం. అనగా అన్నిటా ఆయనే ఉంటాడు. కోరి కొలిచేవారికి గొప్పనిధి. (అదే ఆయన సన్నిధి.) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోనిలః !

అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః!! 86 !!

------------------------------------(నామాలు 807--816)

176. భువికి ముదము నిచ్చు, పుడమినే ధరియించు

కుసుమములను బోలు, గురియు గరుణ

ఆత్మ శుద్ధి చేయు, అనిల రూపములోన

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : కుముద ... భూమికి ఆనందం ఇచ్చువాడు, కుందర ... పుడమిని ధరించువాడు, కుంద ... కుంద పుష్పములను బోలియుండువాడు, పర్జన్య ... మేఘము వంటివాడు, పావన ... పవిత్రం చేయువాడు, అనిల ... గాలి వంటివాడు.

భావము : భూమి(ఆయన స్వయానా భూపతియే కదా) కి ఆనందం ఇచ్చు వాడు, మరో భాష్యం ప్రకారం విశ్వానికి అనగా ప్రాణులన్నిటికీ తానే మోక్షప్రదాత అయినవాడు, భూమిని ధ(భ)రించిన వాడు లేదా మరో భాష్యం ప్రకారం భూమిని(ముట్టెతో... వరాహావతారం) తొలుచుకుంటూ పోయి హిరణ్యాక్షుని వధించినవాడు,కుంద పుష్పముల మాదిరి ఆకర్షణీయమైన రూపము గలవాడు,మరొక భాష్యం ప్రకారం పరశువు గొని దుర్మార్గులైన రాజులను వధించినవాడు లేదా కశ్యప మహర్షికి భూమిని దానం చేసినవాడు, మేఘాలు నీటిని వర్షించునట్లే తానున్నూ భక్తగణాలపై కృపాకటాక్షణాలు కురిపించువాడు, ఆత్మలను పవిత్రీకరించువాడు, వాయువు మాదిరి మనసులకంటిన దుమ్మను తొలగించువాడు, మరియొక భాష్యం ప్రకారం తానే ఆత్మజ్ఞాని అయినవాడు. అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

177. అతని యిచ్ఛె నిజము నదె ఫలప్రదముగా

నిత్యమైనవాడు, సత్యమతడు

సకలమెరుగు నెపుడు, సర్వతోముఖుడుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అమృతాంశ ... నిజమైన అనగా సత్యమూ శాశ్వతమూ అయిన ఇచ్ఛ గలవాడు, అమృతవపు ... మరణము(జననము కూడా) లేని శాశ్వతుడు, సర్వజ్ఞ ... సర్వమూ తెలిసినవాడు, సర్వతోముఖ ... సర్వాంతర్యామి.

భావము : “One whose desires are never fruitless,” అను భాష్యం ప్రకారము ఆ స్వామి ఇచ్ఛలు అనగా నిర్ణయాలు సర్వదా ఫలప్రదాలే కదా, మరియొక భాష్యం ప్రకారము అమృత సమానుడూ, భక్తగణాలకు జ్ఞానామృతం అందించువాడూ అని అనుకోవచ్చు. కాగా, సహజంగానే స్వామి జననమరణాలెరుగుని శాశ్వతుడు. సర్వమూ తెలిసినవాడు, సర్వాంతర్యామి ... అనగా తన ముఖాన్ని అన్ని వైపులా తిప్పుతూ అంతటా దృష్టి సారించువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. సులభః సువ్రతః సిద్ధః శత్రు జిచ్ఛత్రుతాపనః !

న్యగ్రోధోదుంబరోశ్వత్థ శ్చాణూరాంధ్ర నిషూదనః !! 88 !!

------------------------------------(నామాలు 817--825)

178. భక్త సులభుడతడు, భక్తులకై దీక్ష

బూనుచుండు, పూర్ణ పురుషుడతడు

దుర్గుణముల నణచు, దుష్టుల నదలించు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సులభ ... భక్త సులభుడు, సువ్రత ... విశ్వశ్రేయస్సే వ్రతముగా గలవాడు, సిద్ధ ... సిద్ధులను సాధించినవాడు, శత్రుజిత్ ... శత్రువులను జయించువాడు, శత్రు తాపన ... శత్రువులకు తాపము పుట్టించువాడు.

భావము : కొన్ని మార్గాల ద్వారా(అవేమిటో చాలా సార్లు వివరించేము కదా) భక్తులకు సులభ గ్రాహ్యుడు, అణిమాది అష్ట సిద్ధులనూ సాధించిన పూర్ణపురుషుడు. నిజానికి తనకు శత్రువులంటూ ఉండరు. కనుక భక్తగణములోని దుర్గుణాలనే అణచపెడతాడనీ, అలాగే దుష్టులనే అదలిస్తాడనీ చెప్పుకోవాల్సి ఉంటుంది కదా... అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

178 (ఎ). నీడ నిచ్చుచుండు, నింగిపై వాసమూ

విస్తరించు జగతి వృక్ష రూపు

మల్లు రూపు దనుజు మట్టుబెట్టినవాడె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : న్యగ్రోధ ... మఱ్ఱి (లేదా జమ్మి)చెట్టు, ఉదుంబర ... గగనానికిపైన, అశ్వత్థ ... రావి చెట్టు, చాణూరాంధ్ర నిషూదన ... చాణూరుడు అను మల్లుని (ఆంధ్రుని) చంపినవాడు.

భావము: మఱ్ఱి చెట్టు మాదిరి భక్తులకు నీడనిచ్చువాడు లేదా జమ్మి వృక్షము మాదిరి మోక్షము ప్రసాదించువాడు, ఆకసానికి పైనే అనగా అంతరిక్షము దాటి అన్ని మండలములకుపైననే నివసించువాడు, రావి చెట్టు మాదిరిగా సంసార వృక్షమును శాఖోపశాఖలుగా విస్తరింపజేయువాడు,చాణూరుడను మల్లయోధుని చంపినవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

సిద్ధులు... మొత్తం ఎనిమిది..అణిమా, లఘుమా, గరిమా, ఈశిత్వ, ప్రాకామ్య, వశిత్వ, మహిమా మరియూ ప్రాప్తి. వీటిలో అణిమా మరియూ మహిమా సిద్ధులు హనుమంతుడు సాధించినవి. తులాభార ఘట్టంలో కృష్ణుడు ప్రదర్శించినవి లఘుమా,గరిమా సిద్ధులు.

------------------------

శ్లో. సహస్రార్చిః సప్త జిహ్వః సప్తైధాః సప్త వాహనః !

అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః !! 89 !!

------------------------------------(నామాలు 826--834)

179. ఏడు జిహ్వలుండె, యెన్నెన్నొ కిరణాలు

అగ్నులేడు మరియు యజ్ఞములును

అశ్వములును యేడు, యాకార మదిలేదు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సహస్రార్చి ... వేలాది కిరణాలు, సప్త జిహ్వ ... ఏడు విధాలైన నాలుకలు, సప్తైధ ... ఏడు అగ్నులు, సమిధలు, యజ్ఞాలు వగైరా, సప్త వాహన ... ఏడువాహనాలు, అమూర్తి ... నిరాకారుడు.

భావము : వేలాది కిరణాలతో ప్రాణకోటికి ఆహార రూపాన శక్తి ప్రసాదించువాడు, యజ్ఞ యాగాదులందు ఏడు విదాలైన నాలుకలతో అగ్ని దేవతలకు హవిస్సు అందుతున్నట్లు చూచువాడు, అలాగే ఏడు విధములైన అగ్నిస్వరూపములందు, సమిధలయందు, యజ్ఞములందు, కలవాడు, మరియూ సప్త సముద్రాలూ, సప్త ఋషులు ఇత్యాది ఏడు సంఖ్యతో సూచితమయ్యే సమస్త చరాచర జీవులలోనూ కొలువై ఉండువాడు, సప్తాశ్వ రథమారూఢం అని సూర్య భగవానుని స్తోత్రాంశం. మరియూ ఆ ఏడు గుర్రాలూ ఏడు వారాలకు ప్రతీకలని ఒక వివరణ. అవన్నీ కూడా శ్రీ మహా విష్ణ్వాంశలే...కదా ఇన్నిట ఉన్నా తానుగా ఎవరికీ నిర్దిష్ట రూపంలో కానరాడు కనుక నిరాకారుడే కదా...ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

సప్త జిహ్వలు ... కాళి, విస్ఫులింగిని, మనోవ, సులోహిత, దేవి, సధూమ్రవర్ణ, కరాళి..

180. అనఘు డనగ యతడె, యందడే చింతకూ

భయము వెట్టుచుండు పాపి నెపుడు

తననె గొల్చువారి తడిమి భయము బాపు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అనఘ ... పుణ్యశీలి, అచింత్య ... చింత లేదా విరాము లేనివాడు, భయకృత్ ... భీతి గొల్పువాడు, భయనాశన ... భయం పోగొట్టువాడు.

భావము : ఎంత ఊహించినా సాధారణంగా అంతుబట్టనివాడు( చింత అంటే విచారం అంటే కేవలం బాధ మాత్రమే కాదు కదా ఆలోచించడం ఆరా తీయడమూ కావచ్చు కదా),దుర్మార్గులను భయకంపితులను చేస్తూ, తనను నమ్మి కొలిచేవారికి ఏ భయమూ లేకుండే చేసే ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. అణు ర్బృహ త్కృశః స్థూలో గుణ భృన్ని ర్గుణోమహాన్ !

అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశ వర్ధనః !! 90 !!

------------------------------------(నామాలు 835--846)


181. అణువు రూపె గాని అణువణువున యుండు

సున్నితంబె గాని స్థూలరూపి

గుణములన్ని తానె, గుణరహితుడు దానె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అణు ... అణు రూపి, బృహత్ ... బృహత్తరమైన, కృశ ... సున్నితమైన, స్థూల ... స్థూల స్వరూపి, గుణ భృత్ ... త్రిగుణాత్మకం, నిర్గుణ ... గుణరహితం.

భావము : సకల చరాచర ప్రాణకోటి ఆత్మ యందుండువాడు గాన అణుమాత్ర సరీరం కలవాడు. అయితే, అట్టి అణువులన్నిటా తానే గనుక బృహత్ శరీరుడు. కృశ ...ఈ పదానికి గల అసలర్థంఅర్థం కృశించిన అయి ఉండాలి.....కానీ పరమాత్ముని అలా అనలేము. గనుక సన్నని, సున్నితమైన (భక్తుల కష్టాలు చూడలేడు కదా) వాడు, స్థూల ... స్థూల అనగా బ్రహ్మాండమైన శరీరం కలవాడు, రజ స్సత్త్వ తమోగుణాలన్నిటా తానే అయి ఉండువాడు, అయినప్పటికీ తామరాకుపై నీటి బొట్టు మాదిరి తనకంటూ ఏ గుణమూలేకుండా ఏదీ పట్టనివాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

182. అవధ లేనివాడు, ఆధారమదిలేదు

వేదములను యిడెను విశ్వమునకె

వంశ మెరగలేము, వంశవృద్ధియె చేయు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : మహాన్ ...అవధులు లేనివాడు, అధృత ... ఏ ఆదారమూ లే

నివాడు, స్వధృత ... తనకు తానే ఆధారమైనవాడు, ప్రాగ్వంశ ... అత్యంత పురాతనమైన వంశీకుడు, వంశవర్ధన ... ప్రాణకోటి వంశాలను వృద్ధి చేయువాడు.

భావము : వివిధ భాష్యాల ప్రకారం దేశకాలావధులు లేనివాడు, పంచభూతాలకు కట్టుబడి యుండనివాడు, ప్రళయకాలమందు తనలో తాను లయమగువాడు, తనకంటూ ఏ ఆధారమూ లేని, తనకు తానే ఆధారమనదగినవాడు, వేదాలను సుసంపన్నము చేసి ఇచ్చినవాడు, స్వామిది సహజంగానే ఆది తెలీదు కనుక అత్యంత పురాతన వంశీకునిగానే పేర్కొనవచ్చు కదా, పుడమిలోని జీవరాశులన్నిటీ వృద్ధి చేసేదీ ఆయనే కదా. అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః !

ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణః వాయువాహనః !! 91 !!

------------------------------------(నామాలు 847--856)

183. భర్త మరియు శృతుల భజియింపబడెనుగా

యోగి తానె ప్రభువు యోగులకును

సర్వకామదనెడి సర్వేశుడాతడే

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : భారభృత్ ... బారం మోసేవాడు(భర్త), కథిత ... వేదము(శృతులు)లందు కీర్తింపబడినవాడు, యోగి ... యోగ విద్య తెలిసినవాడు, యోగీశ ... యోగులకు ప్రభువు, సర్వ కామద ... సకల విధ కోరికలు తీర్చువాడు.

భావము : భూమిపై నున్న సమస్త జీవుల బారం మోసేవాడు, వేదాలు ఇతర అధ్యాత్మిక గ్రంథాలలో కీర్తింపబడువాడు, యోగ విద్య తెలిసినవాడు, యూగులకే ప్రభువు, భక్తులకు సకల కోరికలు తీర్చు సర్వేశ్వరుడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

184. ఆశ్రయంబునిచ్చు, యాకలి దీర్చునూ

భ్రష్టు బాగుసేయు, పసిడి పర్ణ,

వాయువాహనుండె వదలడు బుధులనూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఆశ్రమ ... ఆశ్రమమైనవాడు, శ్రమణ ... ఆకలిదప్పులు చూసేవాడు, క్షామ ... క్షమించేవాడు, సుపర్ణ ... పసిడి వర్మము గల పత్రాలు, వాయువాహన ... వాయువులను నడుపువాడు.

భావము : తనను శరణు కోరేవారికి తానే ఆశ్రమమై భాసిల్లువాడు, భక్తులకు న్యాయం చేసేవాడు లేదా వారి ాకలి దప్పులు తీర్చేవాడు, భక్తులలో చెడును పోగొట్టి వారి మనసు మరల్చువాడు, పసిడి వర్ణము గల రావి ఆకులలో ఉండువాడు అనగా వాటినే వేదాలకు నిలయంగా చేసి తద్వారా సజ్జనులకు వాటిని అందిస్తున్నవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః !

అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః !! 92 !!

------------------------------------(నామాలు 857--866)

185. కార్ముకము ధరించు, కార్ముక విద్యకూ

దండనలకు జూడ తానె ప్రభువు

అనుభవముతొ పండి, యదుపు చేయు జగతి

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ధనుర్ధర ... విల్లు (కార్ముకము)ధరించువాడు, ధనుర్వేద ... విలువిద్యాపారంగతుడు, దండో ... దండింపజేసేవాడు, దమయిత ... దుష్టులను తద్వారా విశ్వాన్ని అదుపుచేసేవాడు, దమ ... శిక్షల ద్వారా పొందే పవిత్రత.

భావము : సారంగమను విల్లు ధరించువాడు, విలువిద్యా(ఆ మాటకొస్తే సకల విద్యలకూ ఆయనే) పారంగతుడు, రాజులకు రాజుగా దండనలు అమలుచేయించువాడు, దుష్టులను దుర్గుణాలను తద్వారా సమస్త విశ్వాన్ని అదుపు చేసేవాడు, శిక్థల ద్వారా పొందే అనుభవంతో భక్తులలో కలిగే పవిత్రత తానే ఆయినవాడు( సర్వమూ తానే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

186. అపజయంబె లేదు, అమిత సహన శీలి

నియతి లేదు తనకు, నియమమసలు

అవసరంబె లేదు యమ భయమైననూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అపరాజిత ... పరాజితుడేకాడు, సర్వ సహ ... సర్వమూ సహించువాడు, అనియంత ... తనను నియంత్రించువారే లేరు, అనియమ ... తాను పాటించాల్సిన నియమాలంటూ లేవు, అయమ ... యముని భయమూ లేనివాడు.

భావము : ఎట్టి పరిస్థితులలోనూ యెవరి చేతులలోనూ పరాజితుడు కానివాడు, సర్వజనులూ తన బిడ్డలే గనుక ఎవరేమి చేసినా సహించువాడు, సర్వమూ తానే గనుక తను పాటించాల్సిన నియమాలు గానీ, పాటింపజేసే వారుగానీ లేనివాడు, అలాగే యముని (మృత్యు) భయం కూడా లేనివాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. సత్త్వవాన్ సాత్వికః సత్యః సత్య ధర్మపరాయణః

అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతి వర్ధనః !! 93 !!

------------------------------------(నామాలు 867--875)

187. సాహసికుడు మరియు సాత్త్వికుడాతడు

సత్య ధర్మపరుడు, సత్యమతడె

కడకు విశ్వమంత కలియుగా నతనిలో

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సత్త్వవాన్ ... సత్తువ, సాహసం గలవాడు, సాత్త్విక ... సత్త్వ గుణం గలవాడు, సత్య ... నిత్యము, సత్యమూ అయినవాడు. సత్య ధర్మపరాయణ ... సత్యధర్మ పరాయణుడు, అభిప్రాయ ... అంత్య కాలమున విశ్వమంతయూ తనలో కలుపుకునేవాడు.

భావము : నామాలలో అనేకం నేరుగా స్వామికి ఆపాదించలేము. కనుక, తనను నమ్మి కొలిచినవారిలో తానే ధైర్య సాహసాలు పాదుకొల్పుతాడనీ, వారిని సాత్వికులుగా తీర్చి దిద్దుతాడనీ చెప్పుకోవచ్చనుకుంటున్నాను. అలాగే ఆయన సత్యధర్మ పరాయణుడే అనడానికి రామావతారాన్ని ఉదాహరించవచ్చుకదా. కాగా, అంత్యకాలమున అనగా ప్రళయ కాలమున సర్వమూ తిరిగి తనలోనే కలుపుకునేవాడూ ఆయనే కదా. అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

188. అర్చనలకు మరియు నర్హుడు ప్రేమకూ

ప్రీతి కలగజేయు ప్రియతములకు

భక్తులందు పెంచు బ్రహ్మముపై ప్రేమ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ప్రియార్హ ... ప్రేమకు అర్హుడు, అర్హ ... పూజలకు అర్హుడు, ప్రియకృత్ ... ప్రియము చేయువాడు, ప్రీతి వర్ధన ... ప్రేమ పెంచువాడు.

భావము : సకల జనుల ప్రేమకు అర్హమైనవాడు,అట్టివారికి ప్రియము చేకూర్చువాడు, పూజలన్నిటా అర్చనలకు తగినవాడు, భగవంతుని(బ్రహ్మము)పై ప్రాణికోటిలో ప్రేమ అనగా భక్తి, గౌరవము ఇనుమడింపజేయువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. విహాయ సగతి ర్జ్యోతిః సురుచిర్హుత భుగ్విభుః !

రవి విరోచః సూర్యః సవితా రవిలోచనః !! 94 !!

------------------------------------(నామాలు 876--885)

189.గగన మాశ్రయంబు, కనగ నాతడె కాంతి

అవని యతని మాయె హవిసు పొందు

వల్లభుండె భువికి, వదలడు రసములూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : విహాయ సగతి ... ఆకాశమే ఆశ్రయం, జ్యోతి ... కాంతి, సురుచి ... ఉత్తమాభిరుచి, హుతభుక్ ... హవిస్సు పొందు, విభుడు ... వల్లభుడు, రవి ... రసములు పొందువాడు.

భావము : గగనమే తన ఆశ్రయంగా చేసుకుని అదే మనకు పరమపదం(గతి లేదా గమ్యం) గా చేసినవాడు, స్వయం ప్రకాశకుడై దివ్యమైన కాంతులు వెదజల్లువాడు, ఈ చరాచర విస్వం ఆయన అభిరుచి మేరకే ఏర్పడింది కనుక ఆయనది ఉత్తమాభిరుచిగానే పరిగణించాలి కదా, యజ్ఞరూపమున హవిస్సులు పొందువాడు, సకల జీవులకూ విభునివంటివాడు, సూర్యుడి నేలపై నీటిని తన కిరణములచే ఆవిరి చేస్తున్నట్లు విష్ణువు కూడా భూమిపైనున్న అన్నిటి రసములు స్వీకరించువాడు (బహుశా గుణదోషములు పరిగణనలోకి తీసుకుని తగిన ఫలితములు నిర్దేశించువాడు) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

190. తేజములును యెన్నొ, తెలియ సూర్యుడతడె

ప్రాణులకును యతడె ప్రాణ శక్తి

జగము చూచుచుండు జమునయ్య సాక్షియై

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : విరోచన ... వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు, సూర్య ... సూర్యుడు, సవితా ... సూర్యుడు( ప్రాణశక్తి), రవిలోచన ... రవి (జగత్సాక్షి ) కన్నులతో జగమును చూచువాడు.....జమునయ్య అనేది కూడా సూర్యునికి గల అనేక నామాలలో ఒకటి కదా..

భావము : వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు, ద్వాదశాదిత్యులలో ఒకరైన సూర్యభగవానుడు, తన కిరణాలతో సకల ప్రాణులకు ప్రాణశక్తి నిచ్చువాడు, సూర్యుని కిరణాలే కన్నులుగా విశ్వాన్ని చూచుచుండువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

వివరణ : అదితి కుమారులే ఆదిత్యులు. వీరు పన్నెండుమంది.

ప్రధముడే విష్ణువు తర్వాత వరుసగా.. ఇంద్రుడు, వరుణుడు, అంశుమంతుడు, వినస్వంతుడు, ఆర్యముడు, పూష, ధాత, మిత్రుడు, భగుడు, త్వష్ట, పర్జన్యుడు.

------------------------

శ్లో. అనంతో హుతభుక్భోక్తా సుఖదో నైకజోగ్రజః !

అనిర్వణ్ణః సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః !! 95 !!

------------------------------------(నామాలు 886--895)

191. అంత మనగ లేదు, హవ్య ద్రవ్యము పొందు

భోగములనె యిచ్చు, భోక్త యతడు

జన్మ లెన్నొ కలవు, జగతికగ్రజుడుగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అనంత ... అంతములేనివాడు, హుతభుక్ ... హవ్యము పొందు, భోక్తా ... భుజించువాడు, సుఖద ... సుఖము(భోగము)లిచ్చువాడు, నైక జ ... అనేక జన్మలు, అగ్రజ ... అగ్రజుడు అనగా పెద్దవాడు లేదా అధికుడు.

భావము : ఆద్యంతములేని వాడు లేదా అనంతుడు అనగా ఆదిశేషుడూ ఆయనే కదా, యజ్ఞ రూపాన హవిస్సు అనగా హ్రవ్య ద్రవ్యములే స్వీకరించువాడు, భోక్త అనగా భుజించువాడు .... ఇక్కడ భక్తగణముల కీర్తనామృతము సేవించువాడు అనుకోవచ్చు. సుఖాలు అనగా కేవలం ప్రాపంచికములే కాదనీ చతుర్విధ పురుషార్థములనీ అనుకోవచ్చు. శ్రీవారు పురాణాల ప్రకారం కేవలం దశావతారాలే గాక ఇంకా చాలా అవతారాలే ధరించారని తెలుస్తున్నది కదా. సకల చరాచర జగత్తుకూ ఆయనే అగ్రజుడు అనగా అధికుడు. కదా! అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

192. నిందనాడబోడు, నిర్విణ్ణు కానీడు

అవనికెల్ల తానె యధిపతిగను

భూతమేమిలేని భూతనాథుడతడె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అనిర్వణ్ణ ... నిర్విణ్ణుడు కా(నీయ)డు, సదామర్షి ... సదా దయతో ఉండువాడు, లోకాధిష్ఠానమ్ .... లోకాలన్నిటికీ అధిపతి, అద్భుతమ్ ... భూత కాలం అంటూ లేనివాడు, లేదా భూతాది సర్వకాలాలకూ అధినాథుడు.

భావము : తాను నిర్విణ్ణుడు కాడు, తన భక్తులనూ నిర్విణ్ణులను (అనగా నిర్వీర్యులనూ, నిస్తేజులనూ) కానీయడు. సర్వదా సకల జనుల గుణదోషాలతో నిమిత్తం లేకుండా దయ చూపువాడు, లోకాలన్నిటికీ అధిపతి, అద్భుతం అనడంలో భూత కాలమేదీ లేదనే భావం తీసుకోవచ్చు. అలాగే భూతాది కాలాలన్నిటికీ అధిపతీ అతడే. అలాగే రూపలీలా విశేషాలేవీ తెలియనీయని గొప్పవాడని కూడా చెప్పవచ్చు. కదా! అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. సనాత్సనాతనతమః కపిలః కపి రవ్యయః

స్వస్తిదః స్వస్తి కృత్ స్వస్తిః స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః !! 96 !!

------------------------------------(నామాలు 896--905)

193. అతి పురాతనుండు, యతడె కపిలుడగ

కపి యనంగ తానె, కాడు వ్యయుడు

సకల జనులకెపుడు సర్వశుభములిచ్చు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : సనాత్ మరియూ సనాతనతమ ... ఆది మద్యాంతాలు లేని అత్యంత సనాతనుడు, కపిల ... కపిల మహర్షి లేదా కపిల వర్ణుడు, కపి ... జలమే ఆహారముగా గలవాడు, అవ్యయ ... వ్యయము అనగా నాశము కానివాడు, స్వస్తిద ... శు(ఖ)భములిచ్చువాడు.

భావము : సనాత్, సనాతనతమ అను రెండు నామాలకు దాదాపు ఒకే అర్థం వస్తుంది. ఆద్యంతాలు లేనివాడు, అత్యంత ప్రాచీనుడు అనేదే వాటి సారాంశంగా ఉన్నది. కాగా, కపిల అంటే గీతలో తానే చెప్పినట్లు మహర్షులలో కపిలుడు. మరోభాష్యం ప్రకారం కపిల వర్ణుడు అంటే నీలమేఘ శ్యాముడే ననవచ్చు. జలమే ఆహారముగా తీసుకునే జీవి రూపంలోనూ ఆయన ఉంటాడు. గతంలో మత్య, వరాహావతారాలు ధరించాడు కదా. మరో విధంగా భూమిలోని జలమును తన వేడిమిచే ఆవిరిగా మార్చి స్వీకరించే సూర్యభగవానుడనీ అనుకోచ్చునేమో. ఎన్నటికీ వ్యయము అనగా నాశనము కానివాడు. సరిగదా ప్రళయకాలయమున సర్వమూ తనలో విలీనం చేసుకునేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

194. స్వస్తి కలగజేయు, సచ్చిదానందుడూ

శుభములందు తానె, శుభములిచ్చు

స్మరణ మాత్రముననె సంక్షేమమదిచూడు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : స్వస్తి కృత్ ... మంగళకారుడు, స్వస్తి భుక్ ... శుభములు అనుభవించువాడు మరియూ ఇచ్చువాడు, స్వస్తి దక్షిణ ... స్మరణ మాత్రముననే శుభములిచ్చువాడు.

భావము :ఈ పద్యము స్వస్తి ప్రధానమైనది. స్వస్తి అనగా మంగళము. శుభప్రదము. కావున శ్రీహరి సహజంగానే మంగళ ప్రదుడు. సచ్చిదానంద స్వరూపుడు. తనను నమ్మినవారికి మంగళము చేకూరుస్తాడు. ఎన్ని దుష్కార్యాలు చెసినా చివరలో నారాయణా నన్ను కావుమన్న చాలు ఆయనే స్వయముగా తరలి వచ్చి అక్కున చేర్చుకుంటాడని చెప్పవచ్చు. అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః !

శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః !! 97 !!

------------------------------------(నామాలు 906--914)

195. కోపదారి కాడు, కుండల ధారియే

చక్రధారి మరియు విక్రముడును

డేగ వాహనుండె యాజ్ఞల కెదురేది

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అరౌద్ర ... రౌద్రమెరుగడు, కుండలీ ... కుండలములు ధరించువాడు, చక్రి ... చక్రధారి, విక్రమ ... పరాక్రముడు, ఊర్జిత శాసన ... తన ఆజ్ఞలకెదురులేనివాడు.

భావము : సహజముగానే స్వామి కోపదారి మనిషి కాడు. కనుక మనుషులలోని కోపావేశాలను అణచిపెడతాడనుకోవచ్చు కదా. చెవులకు మకర కుండలములు ధరించువాడు, సుదర్శనమను చక్రముధరించువాడు, అవక్ర పరాక్రముడు లేదా మరొక భాష్యం ప్రకారం వేగముగా సంచరించు డేగను వాహనముగా చేసుకున్నవాడు, తన ఆజ్ఞలకు ఎక్కడా ఎప్పుడూ ఎదురులేకుండా చేసుకున్నవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

196. శబ్దమధిగమించు, శబ్ద విద్వాంసుడూ

శిశిరమాయె భక్త శిబిరములకు

తిమిరములె మిగుల్చు తీరుగా లేకున్న

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : శబ్దాతిగ ... శబ్దములను అధిగమించినవాడు, శబ్ద సహ ... శబ్దముల భావములు తెలిసినవాడు, శిశిర ... శిశిర ఋుతువు, శర్వరీ కర ... దుష్టులకు చీకట్లనే చూపువాడు.

భావము : శబ్దము అంటే ఇక్కడ ప్రణవ నాదమే. దానిని అధిగమించినవాడు, దాని భావం పూర్తిగా అవగాహనచేసుకున్నవాడు( అసలు అదంతా తానే కదా), శిశిరము ఆకు రాల్చునది, ఆ తర్వాత వచ్చునదే వసంతం... కనుక తనను నమ్మి కొలిచినవారి కష్షాలను ఆకుల మాదిరి రాల్చేసేవాడు, ధర్మ పథం తప్పి చరించేవారికి చీకట్లు మాత్రమే మిగిల్చేవాడు ( ఆ తర్వాత వారిలో తప్పు తెలుసుకున్నవారికి తిరిగి తానే వెలుగు చూపుతాడు కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః !

విద్వత్తమో వీతభయః పుణ్య శ్రవణ కీర్తనః !! 98 !!

------------------------------------ (నామాలు 915--922)

197. తనదె సౌమ్య గుణము, తలచ సుందరుడునూ

దక్షుడతడె, కనగ దయకు వీడు

క్షమయె తన గుణంబు సహనమునకు పేరు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అక్రూర ... క్రూరత్వము లేనివాడు, పేశల ... సుందరాకారుడు, దక్ష ... సమర్థుడు, దక్షిణ ... దాక్షిణ్య శీలి(దయామయుడు), క్షమిణాంవర ... క్షమాగుణం కలవాడు( వీడు అంటే నిలయము)..

భావము : అక్రూరుడు అంటే సౌమ్యుడు అనగా శాంతమూర్తి అని అర్థం. కనుకనే శాంతాకారం అని వర్ణింపబడ్డాడు కదా. దయా దాక్షిణ్యాలకు, సహనశీలతకు మారుపేరైన శ్రీహరి సహజంగానే మనోహరుడు. కదా. అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

198. విద్వతనగ తనదె విద్వాంసులలొ మేటి

విహ్వలతయె రాదు విన్న పేరు

శ్రవణ కీర్తనల ప్రసాదించు పుణ్యమూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : విద్వత్తమ ... విద్వాంసులలో మేటి, వీతభయ ... భయము పోగొట్టువాడు, పుణ్య శ్రవణ కీర్తన ... శ్రవణ కీర్తనలతోనే పుణ్యం.

భావము : విద్వాంసులలోకెల్లా మేటి, తనను స్మరించినంత మాత్రముననే ఎలాంటి భయాలూ దరికి రానీయనివాడు, శ్రవణ కీర్తనలతోనే పుణ్య మార్గము చూపువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}





------------------------

శ్లో. ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుః స్వప్న నాశనః !

వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః !! 99 !!

------------------------------------(నామాలు 923--931)

199. సాగరమ్ము నీద సాయమందించునూ

దుష్ట బుద్ధులెపుడు దూయుచుండు

పుణ్యులనుగ జేయు పోగొట్టి కలలనూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఉత్తారణ ... ఉద్ధరించువాడు, దుష్కృతి హా ... చెడ్డ పనులను అణచివేయువాడు, పుణ్యో ... పుణ్యులనుచేయువాడు, దుః స్వప్న నాశన ... పీడ కలలను పోగొట్టువాడు.

భావము : సంసార సాగరము ఈదడానికి సహాయం చేసే(ఉద్ధరించే)వాడు, చెడ్డపనులను, దుష్టులను, దుర్గుణాలను ఏరివేయుచూ(దూయు అనగా అదే కదా), పీడ కలలను పోగొట్టడం ద్వారా భక్త గణాలను పుణ్యాత్ములుగా జేయువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

200. భక్తుల మనములను పదిలముగ మలచు

రక్షణిచ్చు సంతు రమ్యమైన

ఔషధమ్ములతడె, అంతటా తానెగా

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : వీరహా ... జనన మరణ భయాల(చక్రం)నుంచి తప్పించువాడు, రక్షణ ... రక్షకుడు, సంత ... సంతానం, జీవన ... జీవము అనగా ఔషధము, పర్యవస్థిత ... సర్వాంతర్యామి.

భావము : భక్తుల జనన మరణ చక్రాన్ని నడిపేవాడు తానే గావున వారిలో ఏ విధమైన భయాందోళనలు కలగకుండా మనసు మళ్ళించేవాడు, తనను అనుసరిస్తూండే ఉత్తమ సంతానానికి ఉత్తమ గతులు కల్పించేవాడు, పుడమిలోని ఔషధ వృక్షాలకు చంద్రుని రూపంలో జీవం ప్రసాదించువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}



------------------------

శ్లో. అనంత రూపోనంత శ్రీర్జితమన్యు ర్భయాపహః !

చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః !! 100 !!

------------------------------------(నామాలు 932--940)

201. రూపనంతమాయె, స్తూప సంపద యెంతొ

ఆగ్రహంబె లేదు, నాపు భయము

సమత భావమందు సాటి లేదు తనకు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అనంత రూప ... అంతమెరుగని రూపము, అనంత శ్రీ ... అమితమైన శక్తి (స్తూప) సంపద, జితమన్యు ... క్రోధాన్ని జయించిన లేదా అణచినవాడు, భయాపహ ... భయమును పోగొట్టువాడు, చతురశ్ర .... సమతా భావము గలవాడు.

భావము : అనంతమైన లేదా అనేకానేక రూపాలు గలవాడు,అనంతమైన శక్తి సంపదలు గలవాడు,క్రోధ స్వభావమే లేనివాడు లేదా భక్తులలో ఆ శీలమును అణచిపెట్టువాడు, భయవిహ్వలతను పోగొట్టు(అడ్డుకొను)వాడు, సమతా భావం గలవాడు ( చతురస్రము అనగా నాలుగు భుజములు సమానంగా గలది యని కదా అర్థము) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

202. అంతుపట్టదాత్మ, యన్ని దిశల నుండు

స్రష్ట విధులు తానె స్పష్ట పరచు

ఆత్మ జ్ఞానమైన యతడె యందించునూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : గభీరాత్మ ... లోతైన మనసు, వి దిశ ... దిశ అంటూ లేనివాడు, వ్యా దిశ ... బ్రహ్మాది దేవతలకు విధులు నిర్దేశించువాడు, దిశ ... ఆత్మజ్ఞానము నందించువాడు.

భావము : పరమాత్మ లీలలు, బావాలు మనకు అంతుబట్టవు కదా,తనకు ఒక దిశ అంటూ లేకుండా అన్ని దిశలకూ విస్తరించి యున్నవాడు, బ్రహ్మ(స్రష్ట) తదితర దేవతలందరికీ తానే విధి విదానాలు నిర్దేశించువాడు, ఆత్మ జ్ఞానము నందించువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

--------------------------------------------

శ్లో. అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః !

జననో జనజన్మాది ర్భీమో భీమ పరాక్రమః !! 101 !!

------------------------------------(నామాలు 941--949)

203. ఆది లేదు, తానె పాదుగా పుడమికి

లక్ష్మి రూపె తనది లక్షణముగ

రూపె సుందరముగ రుచిరాంగద యనగ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : అనాది ... ఆదిలేనివాడు, భూర్భువ ... భూమి(పుడమి)కి ఆదారమైనవాడు, లక్ష్మి ... లక్ష్మీ స్వరూపుడు, సువీర ... సుందరుడు, మంగళప్రదమైన బాహువులు గలవాడు.

భావము : ఆది అనగా ముదలు అనేదే లేనివాడు, భూర్భువ ... భూమికి ఆధారమైనవాడు(పాదు అనగా ఆదారమే), లక్ష్మీ స్వరూపుడు ( లక్ష్మి ఆయన భార్య గనుక ఇద్దరూ ఒకటే అనుకోవచ్చు), సుందరాకారుడు (సువీర నామానికి గల అర్థాలలో...సుందరమైనవాడు అనే అర్థంతోవాటు పరాక్రముడు అనీ, దైవికమూ, అద్భుతమూ అయిన మార్గాలలో మాత్రమే పయనించువాడనీ అని ఉన్నాయి.), మంగళప్రదమైన బాహువులు (అనగా భుజ కీర్తులు అనుకోవచ్చు) గలవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

204. జన్మములకు గర్త, జన్మకారకుడాయె

భయము వెట్టునెపుడు భ్రష్టునెపుడు

సాటి లేనివాడు సంహరింప సృణుల

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : జనన ... సృష్టికర్త, జనజన్మాది ... జన్మలకు కారకుడు, భీమ ... భీతిగొలుపువాడు, భీమ పరాక్రమ ... గొప్ప(బీమమైన) పరాక్రమము గలవాడు.

భావము : జీవరాశుల పుట్టుకకు కారణమవుతూ, తానే పుట్టిచువాడు,దుష్టులకు భయంకరాకారుడు, శత్రువులను (సృణి అనగా శత్రువే కదా) చంపడానికి తగిన గొప్ప బలపరాక్రమములు గలవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః !

ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః !! 102 !!

------------------------------------(నామాలు 950--958)

205. అన్నిటికిని తానె ఆదార నిలయము

తనకు ధాత లేడు తరచి చూడ

పుష్పహాసుడతడు, పొందడు విశ్రాంతి

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఆధార నిలయ ... సర్వమునకు తానె ఆధారం, అధాత ... తనకు ధాత (నియంత్రించేవాడు) లేనివాడు, పుష్పహాస ... వికసిత పుష్పం లాంటి నవ్వు మోమువాడు, ప్రజాగర ... సదా మేలుకొని(అప్రమత్తుడై) యుండువాడు.

భావము : అఖిల జగత్తుకు ఆదారమైనవాడు, తనను నియంత్రించేవారంటూ లేనివాడు, సదా విరిసే పువ్వుల వంటి నవ్వుమోము కలిగి యుండువాడు, విశ్వ రక్షణకోసం విరామం లేకుండా సదా అప్రమత్తుడై యుండువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

206. సర్వ శ్రేష్ఠుడతడు, సత్పథాచారియే

ప్రాణ దాత యతడు, ప్రణవమతడు

కర్మ ఫలితమిచ్చు కరుణామయుడతడె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఊర్ధ్వగ ... సమున్నతుడు మరియూ సర్వ శ్రేష్ఠుడు, సత్పథాచార ... సత్యమైన బాటననుసరించువాడు, ప్రాణద ... ప్రాణ దాత, ప్రణవ ... ఓంకారం, పమ ... కర్మ ఫలితములిచ్చువాడు.

భావము : సమున్నతుడు, సర్వ శ్రేష్ఠుడు, సత్యమూ శుభప్రదమూ అయిన బాటననుసరించువాడు లేదా అనుసరింపజేయువాడు, ప్రాణులకు ప్రాణదాత, ఓంకార స్వరూపము, కర్మలను నిర్ణయించడమేగాక వాటిననుసరించి తగిన ఫలితాలనూ అందించువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. ప్రమాణం ప్రాణ నిలయః ప్రాణ భృత్ ప్రాణ జీవనః !

తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మ మృత్యు జరాతిగః !! 103 !!

------------------------------------(నామాలు 959--966)

207. ప్రాణ నిలయ, వేద ప్రామాణికంబుగా

ప్రాణములకు దానె పాలకుండు

ప్రాణములను నిలుపు పరమ తత్త్వమదియె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ప్రమాణం ... వేద ప్రమాణం, ప్రాణ నిలయ ... ప్రాణములన్నిటికీ నిలయం, ప్రాణభృత్ ... ప్రాణాలను నిలుపురీతిలో జీర్ణాదిక్రియలను శాసించువాడు, ప్రాణ జీవన ... ప్రాణులకు జీవం.

భావము : వేదాలకు ప్రామాణికమూ, ప్రాణములన్నిటికీ నిలయమూ ( చివరకు చేరేది అక్కడికే కదా) అయినవాడు, ఆహారం తీసుకోవడం మొదలు జీర్ణ ప్రక్రియ వరకూ సర్వమూ తానై క్రమబద్ధీకరించువాడు, ప్రాణులకు జీవం (ప్రాణవాయువు) అందించువాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

208. తరచి చూడ నతడె తత్త్వ వేత్త యనగ

ఆత్మ, పరమ యాత్మ యనగ నతడె

జీవ దశలనేవి చేర రానీయడూ

వందనాలు హరికి వంద వేలు !!

{భావము : తత్త్వ సారం అతడే. దానిని పూర్తిగా యెరిగియున్నదీ ఆయనే కదా. ఆత్మ, పరమాత్మకూడా (అద్వైతం) తానే అయినవాడు,జనన మరమములనుగానీ, వార్ధక్యాది రుగ్మతలను గానీ దరికి రానీయనివాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః !

యజ్ఞో యజ్ఞపతి ర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞ వాహనః !! 104 !!

------------------------------------(నామాలు 967--975)

209. మూడు లోకములలొ మూల వృక్ష మతడె

బంధనాల నుంచి బయటవేయు

తండ్రి యనగ నతడె, తండ్రి తండ్రి యతడె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : భూర్భువస్వస్తరు ... దేవలోకము, భూలోకము, పాతాళము అను మూడులోకాలలో వృక్ష సమానం, తార ... తరింపజేయువాడు, సవిత ... తండ్రి, ప్ర పితామహ ... తాత.

భావము : మూడులోకాలలోనూ తానే వృక్షం మాదిరిగా విస్తరించి దయామృత ఫలాలు అందిస్తున్నవాడు, భవ సాగర బంధనాలనుంచి బయటపడవేయు(తరింపజేయు అంటే దాటించడమే....కదా)వాడు, సర్వులకూ తండ్రి (అంటే బ్రహ్మ అనగా పుట్టుకకు కారణమైనవాడు), ఆ బ్రహ్మకే తండ్రి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

210. యజ్ఞమనగ తానె,యజ్ఞాధిపతి తానె

యాజి గాను మరియు యాగ మందు

ద్రవ్యములును కనగ తానె వాహనమునూ

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : యజ్ఞ ... యజ్ఞమూర్తి, యజ్ఞపతి ... యజ్ఞ యాగాది క్రతువులకు అధిపతి, యజ్వా ... యాగకర్త, యజ్ఞాంగ ... హోమద్రవ్యములు, యజ్ఞవాహన ... యజ్ఞములు వాహనములుగా గలవాడు.

భావము : యజ్ఞ రూపిగా, యాగాదిపతియై, యజ్ఞ యాగములలో తగిన ద్రవ్యములు తానే అగుచూ, యజ్ఞ నిర్వాహకుడూ తానే అయి, అట్టి యజ్ఞములు సక్రమంగా సాగునట్లు చూచే (వాహనం అంటే నడవటానికి ఉపకరంచే సాధనం. కనుక యజ్ఞవాహనం అంటే యాగం సాఫీగా సాగడానికి ఉపకరించేది.. అదే తానే కదా )ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

------------------------

శ్లో. యజ్ఞ భృద్యజ్ఞ కృత్యజ్ఞీ యజ్ఞ భుగ్యజ్ఞ సాధనః !

యజ్ఞాన్తకృత్యజ్ఞ గుహ్యమన్నమన్నాద ఏవ చ !! 105 !!

------------------------------------(నామాలు 976--984)

211. యజ్ఞ రక్షకుండు, యాగ కర్తయుదానె

యజ్ఞమందు పూజలతడె పొందు

యజ్ఞ ఫలములందు, యజ్ఞసాధనతడె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : యజ్ఞభృత్ ... యాగ రక్షకుడు, యజ్ఞ కృత్ ... యాగ కర్త, యజ్ఞీ ... యజ్ఞములందు ఆరాధింపబడువాడు, యజ్ఞ భుక్ ... యజ్ఞ మందు భోక్త, యజ్ఞసాధన ... యజ్ఞ సాఫల్యానికి సాధనము.

భావము : యాగ రక్షకుడూ, కర్తా, వాటియందు ఆరాధన పొందేవాడు, వాటి ఫలాలను అనుభవించేవాడు చివరకు యాగాలు సఫలీకృతం కావడానికి తగిన సాధన సంపత్తి కూడా తానే అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

212. యజ్ఞ ఫలములిచ్చు, యజ్ఞార్థమది తానె

అన్న రూపముననె ఆయువిచ్చు

అన్నమనెడి భక్తి యారగింపు తనకె

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : యజ్ఞాన్త కృత్ ... యాగం ముగింపజేయువాడు, యజ్ఞ గుహ్యమ్... యజ్ఞానికి అర్థము, అన్మ ... జీవులకు ఆయువునిచ్చే అన్నము, అన్నాద ... అన్నము భుజించు.

భావము : యాగం జయ(ఫల)ప్రదంగా ముగింపజేసేవాడు అంటే ఫలితములందించేవాడు, గుహ్యమ్ అనగా గోప్యమైన... యజ్ఞ గుహ్యమ్ అంటే గోప్యమైన యజ్ఞమే అంటే అది బ్రహ్మయజ్ఞమే కనుక యజ్ఞానికి అసలైన అర్థమూ, పరమార్థమూ తానే అనుకోవచ్చు. ప్రాణులకు ఆయువు పెంచేది ఆహారం. అది ఆ శ్రీహరి రూపమే (అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా).



------------------------

శ్లో. ఆత్మ యోనిః స్వయం జాతో వైఖానః సామగాయనః !

దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః !! 106 !!

------------------------------------(నామాలు 985--992)

213. తనదు జన్మకెపుడు తరచ యోనియె లేదు

ధర్మరక్షణనగ తానె వచ్చు

అహమును సరిచేయు ఆలపించు త్రయి

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : ఆత్మ యోని ... తన ఆవిర్భావానికి యోని అనేది లేదు, స్వయం జాతా ... తనకు తానుగా జన్మించువాడు, వైఖాన ... అహమును అణచి పెట్టు, సామగాయన ... వేదము(త్రయి) ఆలాపించు.

భావము : ఆయన అయోనిజుడు. కనుక అవసరం అనుకున్నపుడు తానుగా వేరే శక్తుల ప్రమేయం లేకుండగానే అవతరిస్తాడు. అహమును అణచిపెడతాడు.(సరిచేయు అనగా అణచు లేదా నాశనము చేయు). మరో భాష్యం ప్రకారం ప్రాపంచిక దుఃఖాలను పోగొడతాడని తెలుస్తున్నది. వేదాలే కదు, వాటిని ఆలాపించునదీ ఆయనే...కదా అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

214. దేవదేవుడైన దేవకీ గర్భాన

అవతరించె తానె యసలు స్రష్ట

అవని ప్రభువు గాను హరియించు పాపాలు

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : దేవకీ నందన ... దేవకి పుత్రుడు, స్రష్ట ..... సృష్టి కర్త, క్షితీశ ... అవని(క్షితి)కి ప్రభువు, పాపనాశన ... పాపాలు హరించువాడు.

భావము : సృష్టి కర్త, పుడమికి ప్రభువూ , పాపాలు హరించువాడు, దేవకీ పుత్రుడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}



------------------------

శ్లో. శంఖ భృన్నందకీ చక్రీ శార్జ్ఞ ధన్వా గదాధరా !

రథాంగ పాణి రక్షోభ్య సర్వ ప్రహరణాయుధః !! 107 !!

------------------------------------(నామాలు 993--1000)

215. పాంచజన్య దారి, పట్టిన ఖడ్గమూ

దర్శనీయ మదియె ధనువు యున్న

కలుగ జేయు శుభము కౌమోదకంబుతో

వందనాలు హరికి వంద వేలు !!

{ అర్థాలు : శంఖ భృత్ ... శంఖధారి, నందకీ ... ఖడ్గము, చక్రీ ... చక్రధారి, సారంగ ధన్వా ... సారంగమను ధనుస్సు, గదాధర ... గదను ధరించినవాడు.

భావము : ధర్మ రక్షణకై దుష్టులను శిక్షించే నిమిత్తం పాంచజన్యమను శంఖము, నందకమను ఖడ్గము, సుదర్శనమను చక్రము, సారంగమను ధనుస్సు, కౌమోదకి యను గద దరించియున్న యా శ్రీహరికే శత సహస్ర వందనాలు.}

216. ఆత్మ రథమె యైన యా చేతి చక్రాలు

దూరముంచునెపుడు దుఃఖములను

సర్వ ప్రహరణములకు సాటి యా శ్రీహరి

వందనాలు వేల వందనాలు... !!

{ అర్థాలు : రథాంగపాణి ... రథము యొక్క అంగాలు చేబూనినవాడు, అక్షోభ్య .. వతనలు దూరం చేయువాడు, సర్వ ప్రహరణాయుధ ... ఆయుదాలతో సర్వ విదాలా దెబ్బకొట్ట గలవాడు.

భావము : రథమనగా ఆత్మయే. మోక్షమే దాని అంగములు. పగ్గం తన చేతిలో ఉంచుకుని ఆత్మను సవ్యమైన పంతాలో నడిపించువాడు శ్రీహరి. అందుకు అనుగుణంగానే అడ్డు వచ్చే శక్తులను వీలైన ఆయుదంతో మోదుతాడు. అట్టి ఆ పరంధామునికే వంద వేల వందనాలు....}

........................................ శు భ మ్ ....................................


3 comments:

  1. చాల చాల బావుందండి.-- రామలక్ష్మి అవసరాల

    ReplyDelete
  2. ధన్యవాదాలు. ఇది సరిగా రాలనందున తొలగించాను. కనక ధారా స్తవమూస మోహముద్గరమూ చూడవచ్చును.

    ReplyDelete
  3. చాలా చక్కగా గేయరూపం కల్పించి విష్ణుసహస్రమును సులభరీతిలో అందించి ఆనందింప చేశారు. ధన్యవాడములండీ.మీకృషి నిరుపమానం !!

    ReplyDelete